Gali Janardhan Reddy Wife: గాలి జనార్ధన్ రెడ్డి భార్య చేతిలో ఉన్న డబ్బెంతో తెలిస్తే అవాక్కవడం పక్కా..!
ABN, First Publish Date - 2023-04-20T13:03:39+05:30
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నామినేషన్లకు వేళ కావడంతో బరిలో నిలిచిన అభ్యర్థులంతా అట్టహాసంగా..
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నామినేషన్లకు వేళ కావడంతో బరిలో నిలిచిన అభ్యర్థులంతా అట్టహాసంగా నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. కళ్యాణ కర్ణాటక పక్ష పార్టీ వ్యవస్థాపకులు గాలి జనార్ధన్ రెడ్డి గంగావతి కేఆర్‌పీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన భార్య లక్ష్మీ అరుణ బళ్లారి సిటీ కేఆర్‌పీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి సోమవారం నాడు ఆమె కూడా నామినేషన్ దాఖలు చేశారు.
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నాయకులు చేసే విన్యాసాలన్నీ చేస్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న కాకా హోటల్‌లో దోశలేయడం, ముసలవ్వలతో మాటామంతీ, చిన్న పిల్లలను ఎత్తుకుని ఆడించడం.. ఇలా ఎన్నికల సమయంలో ప్రతీ రాజకీయ నాయకుడు పడే పాట్లన్నీ గాలి జనార్ధన్ రెడ్డి భార్య కూడా పడుతున్నారు. ఈ సందర్భంగా గాలి జనార్ధన్ రెడ్డి భార్య తన పేరిట ఉన్న ఆస్తులుఅప్పుల వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించారు. ఈ ఆస్తుల వివరాలు ప్రస్తుతం ఆసక్తికర చర్చకు తావిచ్చాయి.
మైనింగ్ వ్యాపారంలో కోట్లు గడించిన గాలి జనార్ధన్ రెడ్డి భార్య లక్ష్మీ అరుణ పేరిట 250 కోట్ల రూపాయల స్థిరచరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం.
అంతేకాదు.. గాలి జనార్ధన్ రెడ్డి భార్య వద్ద ఏకంగా 84 కిలోల బంగారం, డైమండ్స్.. 437 కిలోల వెండి ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపరిచారు. గాలి జనార్ధన్ రెడ్డి భార్యకు ఎలాంటి అప్పులు లేవని పేర్కొన్నారు.
ఆవిడ వద్ద ఉన్న బంగారం, డైమండ్స్ విలువ రూ.24.4 కోట్లట. 437 కిలోల వెండి విలువ రూ.1.1 కోటిగా తెలిసింది. గాలి జనార్ధన్ రెడ్డి భార్య చేతిలో (బ్యాంకు అకౌంట్లో) రూ.3 లక్షల డబ్బు మాత్రమే ఉందట.
ఏపీలో, తెలంగాణలో ఆమె పేరిట 93 అగ్రికల్చర్ ప్లాట్స్ ఉన్నాయట. ఇంత ఆస్తి ఉన్నప్పటికీ గాలి జనార్ధన్ రెడ్డి భార్య పేరు మీద కారు, స్కూటీ లాంటి ఒక్క వాహనం కూడా లేదట.
ఒక్క గాలి జనార్ధన్ రెడ్డి భార్య పేరిట ఉన్న ఆస్తులే కాదు కర్ణాటక రాజకీయాల్లో కీలక వ్యక్తులుగా కొనసాగుతున్న వారి ఆస్తుల వివరాలు కూడా కళ్లు చెదిరేలా చేశాయి. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక కీలక నేత బీవై యడియూరప్ప కుమారుడు విజయేంద్ర తన ఆస్తుల విలువ రూ.125 కోట్లుగా అఫిడవిట్‌లో సమర్పించాడు. జేడీఎస్ యువ నేత, కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామి తన ఆస్తుల విలువ రూ.77 కోట్లుగా ప్రకటించారు.
నిఖిల్‌కు అత్యంత ఖరీదైన లాంబొర్గిని (Lamborghini) కారుతో పాటు మొత్తం ఐదు వాహనాలు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక.. బీజేపీకి చెందిన ఎంటీబీ నాగరాజు ఆస్తి ఏకంగా రూ.1,607 కోట్లుగా అఫిడవిట్‌లో వెల్లడైంది. కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ ఆస్తి రూ.1,139 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం. 2018లో అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తితో పోల్చితే 67 శాతం ఆస్తి విలువ పెరగడం కొసమెరుపు.
Updated Date - 2023-04-20T13:34:13+05:30 IST