Viral Video: మా అమ్మకు నేనంటే ఇష్టం లేదనుకుంటా.. ఈ 4 ఏళ్ల పిల్లాడి వీడియో చూస్తే కన్నీళ్లు రావడం ఖాయం..!
ABN, First Publish Date - 2023-11-24T21:23:16+05:30
తనంటే అమ్మానాన్నలకు ఇష్టం లేదంటూ ఓ చిన్నారి కంటతడి పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ‘‘మా అమ్మకు నేనంటే ఇష్టం లేదనుకుంట.. నాన్న కూడా ఎప్పుడూ నాతో సీరియస్‌గానే ఉంటాడు..నాతో ఆటలు ఆడేందుకు అస్సలు ఇష్టపడడు.. నాన్నకు కోపం వచ్చినప్పుడు నాకు మరింత భయం వేస్తుంది..’’ ఇవీ ఓ నాలుగేళ్ల చిన్నారి అన్న మాటలు. అమ్మానాన్నల పేరు చెబితే సంబరంతో తుళ్లిపడాల్సిన ఆ చిన్నారి ఆవేదన నెట్టింట కలకలం రేపుతోంది. యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపై ఎంతటి దారుణ ప్రభావం చూపిస్తుందో చెప్పే ఈ ఘటన దక్షిణ కొరియాలో(South Korea) చోటుచేసుకుంది.
దక్షిణకొరియాలో చిన్న పిల్లల రియాలిటీ షో ‘మై గోల్డెన్ కిడ్స్’ బాగా పాప్యులర్. ఈ షోలో పాల్గొనే పిల్లలు.. తల్లిదండ్రులు తమతో ఎలా ఉంటారో, ఎలాంటి ఆటలు ఆడతారో వచ్చీరానీ మాటల్లో చెబుతుంటారు. చిన్నారుల ప్రవర్తన బట్టి నిపుణులు వారి తల్లిదండ్రులకు పిల్లల పెంపకంపై కౌన్సెలింగ్ కూడా ఇస్తుంటారు. ఇటీవల ప్రసారమైన ఓ ఎపిసోడ్‌లో ఓ చిన్నారి ఆవేదన యావత్ దేశాన్నీ కలిచివేసింది. తల్లిదండ్రులకు తనంటే బహుశా ఇష్టం లేదేమో అంటూ ఆ చిన్నారి ఉబికివస్తున్న కన్నీటిని అదిమిపెట్టుకుంటూ చెప్పిన తీరు అందరినీ కలిచివేసింది(heartbreaking revelations of 4 year old boy on korean reality show). ప్రేక్షకులు అనేక మంది బాలుడి తల్లిదండ్రులను తప్పుబట్టారు. జీవితంలో ఎన్ని ఒత్తిడులు ఉన్నా, సంతానం విషయంలో మాత్రం ఎటువంటి కాఠిన్యం, నిర్లక్ష్యం పనికిరాదని హితవు పలికారు.
ఈ వీడియో నెట్టింట్లో కూడా వైరల్‌గా(Viral Video) మారింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది, బాలుడి పరిస్థితిపై జాలిపడ్డారు. అతడి తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తమ కొడుకు ఇంతగా బాధపడుతున్నాడని తెలిసిన తల్లిదండ్రులు కూడా తల్లడిల్లిపోయారు. ఇకపై అతడి అల్లారముద్దుగా పెంచుతామని చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులందరికీ ఈ వీడియో ఓ గుణపాఠమని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. తప్పక చూడాల్సిన వీడియో అని అభిప్రాయపడ్డారు.
Updated Date - 2023-11-24T21:24:51+05:30 IST