Viral: వామ్మో ఇంత దూకుడా.. ఇలాగైతే చైనాను ఆపడం కష్టమే..!
ABN, First Publish Date - 2023-11-26T17:25:45+05:30
చైనాలో ఓ కొండపై నిర్మించిన మూడంతస్తుల వంతెన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం అమెరికాతో పోటీపడుతున్న దేశం ఏదైనా ఉందీ అంటే అది చైనానే(China). అపార పారిశ్రామిక శక్తికి కమ్యునిస్టు దేశం పర్యాయ పదంగా మారింది. ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు చైనా ప్రభుత్వం మౌలికవసతుల కల్పననే కల్పతరువుగా భావిస్తోంది. ఈ క్రమంలో నిర్మాణ రంగంలో భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తోంది. నమ్మశక్యం కాని కట్టడాలతో ప్రపంచ దేశాల్ని ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పుడిదంతా చెప్పుకోవడానికి కారణం ఓ వైరల్ వీడియో!
అది ఓ వంతెనకు సంబంధించిన వీడియో! వంతెనలు అందరికీ తెలిసినవే అయినా ఈ బ్రిడ్జి డిజైన్, నిర్మాణంలో చైనా తనదైన సృజనాత్మకతను చూపించింది. షాంక్సీ ప్రావిన్సులో 1,370 అడుగుల ఎత్తైన టియాన్‌లాంగ్ కొండపై దీన్ని నిర్మించారు( Tianlong Mountain Bridge). చుట్టచుట్టుకున్న డ్రాగన్ ఆకారాన్ని గుర్తుకు తెచ్చేలా 30 కిలోమీటర్ల పొడవుతో మూడంతస్తులుగా నిర్మించిన ఈ వంతెన స్థానికంగా ఓ పర్యాటక కేంద్రంగా మారింది. ఇది ఇంజినీరింగ్ అద్భుతమంటూ జనాలు ప్రశంసలు కురిస్తున్నారు.
ఈ వీడియో నెట్టింట కూడా వైరల్(Viral Bridge) అవుతూ నెటిజన్లు అబ్బురపడేలా చేస్తోంది. నిర్మాణ రంగంలో చైనా అద్భుతాలు సృష్టిస్తోందంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇలాంటి ఫీట్ చైనా మాత్రమే సాధించగలదని కొందరు ముక్తాయించారు. కమ్యునిస్టు దేశానికి ఇంతటి సామర్థ్యం ఉంది కాబట్టే అగ్రరాజ్యానికే పోటీనిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంత దూకుడుగా ఉన్న చైనాను ఎదుర్కోవడం ఏదేశానికైనా కష్టమేనంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు.
Updated Date - 2023-11-26T17:26:51+05:30 IST