హైటెన్షన్ టవర్ మీద వేలాడుతున్న వ్యక్తిని చూసి గ్రామస్తుల ఆందోళన.. తీరా పోలీసులు వచ్చి విచారిస్తే తెలిసిన నిజం..
ABN, First Publish Date - 2023-01-13T16:47:46+05:30
హైటెన్షన్ టవర్ పైకి చూసి షాక్ తిన్నాడు. అతను వెంటనే గ్రామస్తులను కేకలు వేసి పిలిచాడు.
రహదారి ప్రక్కనే నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తి ఏదో నీడ తన ముందు కదులుతూ ఉండటం గమనించాడు. ఎవరిది ఈ నీడ అని అంతా గమనిస్తే ఎక్కడా ఎవరూ కనిపించలేదు. కానీ ప్రక్కనే ఉన్న హైటెన్షన్ టవర్ పైకి చూసి షాక్ తిన్నాడు. అతను వెంటనే గ్రామస్తులను కేకలు వేసి పిలిచాడు. హైటెన్షన్ టవర్ ఎక్కిన ఓ వ్యక్తికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..
చత్తీస్ ఘర్ రాష్ట్రం కోర్బా జిల్లాలో దాల్ పూర్ కచుపరా గ్రామంలో 30 సంవత్సరాల బిపత్ రామ్ అనే వ్యక్తి హైటెన్షన్ టవర్ ఎక్కాడు. అతన్ని చూసిన గ్రామస్తులు క్రిందికి దిగమని ఎంత బతిమలాడినా అతను వినలేదు. 'నేను చచ్చిపోతాను నన్ను ఆపకండి' అని చాలా ఆందోళన సృష్టించాడు. గ్రామస్తుల మాట వినకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎంతో బతిమాలిన మీదట మూడు గంటల తరువాత అతను టవర్ దిగొచ్చాడు.
అతని భార్య పదే పదే తన పుట్టింటికి వెళుతూ ఉండటంతో అతను అలా వెళ్ళవద్దని తన భార్య మీద కోప్పడ్డాడు. అంతకు ముందు కూడా అలా చాలాసార్లు వారిమధ్య గొడవ వచ్చింది. అయితే అతని భార్య మాత్రం అతని మాటలు పెడచెవిన పెట్టింది. ఆమె తన అలవాటు ప్రకారంగా తన పుట్టింటికి వెళ్ళింది. ఆమె వచ్చిన తరువాత 'వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వెళ్ళావు' అని బిపత్ భార్య మీద కోప్పడ్డాడు. అయితే అతని భార్యకు కూడా కోపమొచ్చి 'నువ్వు ఇలా చేస్తే నేను పర్మినెంట్ గా మా పుట్టింటికి వెళ్ళిపోతాను' అని బెదిరించింది. దీంతో బిపత్ కు చెప్పలేనంత కోపమొచ్చి నేరుగా హైటెన్షన్ టవర్ ఎక్కి చచ్చిపోవాలని అనుకున్నాడు. వీరిద్దరి విషయం విన్న పోలీసులు వీరితో మాట్లాడి గొవడను పరిష్కరించి ఇంటికి పంపారు.
Updated Date - 2023-01-13T16:47:49+05:30 IST