Money Plans: తక్కువ డబ్బుతో సుఖమైన జీవితం.. ఇలా చేస్తే సాధ్యమే..
ABN, First Publish Date - 2023-01-30T13:50:47+05:30
సగటు మధ్యతరగతి వ్యక్తి సంపాదన గుప్పెట్లో నీళ్ళను పట్టుకున్న చందంగానే ఉంటుంది. దాంతో ఇక సుఖంగా బ్రతకడం కలే అనే ఆలోచనలో ఉంటారు. ఇదిగో ఇవి తెలుసుకుని పాటిస్తే
భార్య, పిల్లలు, తల్లిదండ్రులు వీరందరి మధ్య సగటు మధ్యతరగతి వ్యక్తి సంపాదన గుప్పెట్లో నీళ్ళను పట్టుకున్న చందంగానే ఉంటుంది. దాంతో ఇక సుఖంగా బ్రతకడం కలే అనే ఆలోచనలో ఉంటారు. ఇదిగో ఇవి తెలుసుకుని పాటిస్తే తక్కువ ఖర్చుతో సుఖవంతమైన జీవితం సాధ్యమే..
మంచి జీవితమంటే..
అందరూ తెలుసుకోవాల్సిన మొదటి విషయం, ముఖ్యమైన విషయం డబ్బు ఉంటే మంచి జీవితం ఉంటుందని అనుకోవడం పొరపాటు. ఆకలేసినప్పుడు మనకు కావలసింది ఆహారం. ఆరోగ్య స్పృహ మీద అదే ఆహారాన్ని కాస్త మెరుగ్గా ఉండేలా చూసుకుంటాం. అంతే కానీ ఆకలేసినప్పుడు కాగితం కట్టలు బయటకు తీసి వాటిని తినము. కాబట్టి మంచి జీవితం అంటే నోట్ల కట్టలతో నిండినది అనే అర్థాన్ని మార్చుకోండి. డబ్బు గురించి అత్యాశ ఉంటే దాన్ని వదిలెయ్యండి. డబ్బు కూడబెట్టడానికి మీరు తిండిని, అవసరాలను కోల్పోతే.. భవిష్యత్తులో అవే అనారోగ్యాలుగా మారి పైసా వసూల్ చేస్తాయి. కాబట్టి ఆరోగ్యమే గొప్ప సంపద.
షాపింగ్ ఇలా చేయండి
చాలా మంది షాపింగ్ చేసేటప్పుడు కొనే వస్తువు తమకు ఎంత సౌకర్యంగా ఉంటుంది అనే విషయం వదిలి బ్రాండులలో చిక్కుకుంటారు. బ్రాండ్ అనేది కేవలం షో చేయడానికి పనికొస్తుంది. బ్రాండ్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కటి పర్పెక్ట్ గా ఉండవు. ఒక్కసారి కొని దీర్ఘకాలం వాడుకోగలిగిన విధంగా ఉండేలా వస్తువులను షాపింగ్ చేయాలి.
గెట్.. సెట్.. గో..
పిండి కొద్ది రొట్టె అంటారు మన పెద్దవాళ్ళు. వస్తున్న సంపాదనను బట్టి బయట తినడం నుండి కారణం లేకుండా ఏదో ఒకటి కొనే అలవాటు వరకు ప్రతి ఒక్కటీ మీ సంపాదన మీద ప్రభావం చూపించే అంశమే. కాబట్టి సంపాదన ఎంత? ఖర్చులు ఎంత? మిగులుతున్నది ఎంత? అంతగా అవసరం లేని విషయాలకు ఖర్చుపెడుతున్నది ఎంత? వంటి వాటిని లెక్కవేసుకుని అవసరమైనవి నిర్ణయించుకుని బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి.
సరదాగా గడపడమంటే.. ఖర్చు చేయడం కాదు.
చాలామంది అనుకుంటారు కుటుంబమంతా కలిసి ఏ రెస్టారెంట్ కో వెళ్ళాలని. కానీ బిల్ గుర్తొస్తే ఆ ఆలోచన మానుకుంటారు. దాని బదులుగా ఇంటి దగ్గర ఫుడ్ తయారుచేసుకుని కుటుంబమంతా కలసి ఏ పార్క్ కో వెళ్ళి అక్కడ హ్యాపీగా సమయాన్ని గడిపిరావచ్చు. కుటుంబమంతా ఇంట్లోనే సినిమా చూడటం, యూట్యూబ్, గూగుల్ మ్యాప్ వంటి వాటిలో టూరిస్ట్ ప్లేస్ ల గురించి తెలుసుకోవడం, బుక్స్ చదవడం, స్నేహితులతో కలసి టైం స్పెండ్ చేయడం. సరదాగా చిన్న చిన్న గేమ్స్ ఆడటం. ఇలా చాలా ఉంటాయి. కేవలం డబ్బు ఖర్చు పెడితేనే సంతోషం వస్తుందని, అదే నిజమైన విలాసవంతమైన జీవితమని అనుకోవడం పొరపాటు. ఉన్నచోటులో సంతోషాన్ని వెతుక్కోవాలి.
Updated Date - 2023-01-30T14:00:39+05:30 IST