Old Age Best Friends : స్నేహబంధం విడిపోకుండా గొప్ప నిర్ణయం తీసుకున్న ఇద్దరు బామ్మలు..
ABN, First Publish Date - 2023-02-22T15:44:50+05:30
స్నేహం అంత బలమైనది మరి.
వయసు మీద పడుతుందంటే పిల్లలు, వారి బిడ్డలు, కోడళ్ళు, అల్లుళ్ళు, బంధువులు ఇదే లోకంగా మనవలు, మనవరాళ్ళదే ప్రపంచంగా గడిపేసే సదరు పెద్దవయసువారిని ఎందరినో చూస్తూ ఉంటాం. కలకాలం తోడుంటామని బాసలు చేసి వృద్ధాప్యంలోకి వచ్చి పడ్డాకా, చేయి వదిలేసి వెళిపోయే వివాహ బంధం ఇచ్చిన తోడును తలుచుకుంటూ, కుటుంబమే తన లోకంగా బతికేస్తూ ఉంటారు ఇంకొందరు. తల్లిదండ్రుల ఆస్తులు పంచుకుని బాధ్యతను గాలికి వదిలేస్తే, చావలేక బ్రతుకుతుంటారు మరికొందరు.
అయితే స్నేహం అనేది చావులేనిది..
స్నేహానికి వయసైపోదు.. స్నేహం వయసును లెక్కచేయదు. ప్రేమకన్నా బ్రేకప్స్ ఉన్నాయేమోకానీ, స్నేహానికి బ్రేకప్స్ లేవు. ఒకవేళ స్నేహం దూరమైపోతే ఎక్కడో మనసులో, వాళ్ళతో మనసు కలిపిన రోజులు మెదులుతూనే ఉంటాయి. స్నేహం అంత బలమైనది మరి. ఏదైనా కష్టం వస్తే బంధువు దగ్గరకు వెళ్లడం కన్నా స్నేహితుని దగ్గరకు వెళితే సాయం దొరుకుతుంది. ఓదార్పు అందుతుంది. అటువంటి అపురూపమైన ఆత్మీయ బంధం గురించి ఎందరో మహానుభావులు మనసుకి హత్తుకోనేలా చెప్పుకొచ్చారు.
ఈనాటి ఈస్నేహం ఏనాటిదో..
సముద్రంలో అలల్లా ఎంతో మంది స్నేహితులు వస్తుంటారు పోతుంటారు. కానీ నిజమైన స్నేహితులు ఎక్కడున్నా, ఎలా ఉన్నా కలిస్తే చిన్నపిల్లలైపోతారు. ఇంతకీ ఈ స్నేహం గురించి చెప్పుకుంటూ అసలు స్నేహితుల్ని మరిచిపోతున్నాం. ఈ ఇద్దరు బామ్మలూ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ, స్నేహం. ఇద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఒకరు పెళ్ళిలో మరొకరు ముస్తాబుచేసి మురిసిపోతే, ఒకరింటికి మరొకరు సంబంధాలు కలుపుకుని పిల్లల్ని ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ ఇద్దరి బామ్మల ముద్దుల మనుమరాలు కార్తిక వీళ్ల అపురూపమైన స్నేహం గురించి సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అందువల్లే ఈ చిరకాల స్నేహం గురించి మనందరికీ తెలిసింది. ఇప్పటి తరానికి ఓ ఉదాహరణగా నిలిచిన వారి ఇద్దరి మధ్యన స్నేహం ఈనాటిది కాకపోవచ్చు. కానీ వారి స్నేహం ఎందరో స్నేహితులకు ప్రాణాలు వదిలేంత వరకు చెదరని తమ స్నేహం గొప్పతనాన్ని, తమ బంధం విలువను తెలియచేస్తుంది. మీకూ ఇలాంటి స్నేహితులున్నారా మరి?
Updated Date - 2023-02-22T15:46:02+05:30 IST