Preethi case warangal: ప్రీతి ఘటన... ఆ ఇద్దరిపై చర్యలెందుకు ఉండవు?
ABN, First Publish Date - 2023-02-27T21:17:50+05:30
ఎంతో కష్టపడి డాక్టర్ చదువుతున్న ప్రీతి ఆశలను చిద్రం చేసిన వారిని శిక్షించాలని కోరుతున్నారు. ముఖ్యంగా ప్రీతి సీనియర్ సైఫ్‌తోపాటు ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు...
వరంగల్ మెడికో ప్రీతి (preethi case warangal) ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. వైద్యం చేసి నలుగురిని బ్రతికిస్తుందనుకుంటే శవమై తిరిగి వస్తుందనుకోలేదంటూ ప్రీతి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ రోధిస్తున్నారు. ఎంతో కష్టపడి డాక్టర్ చదువుతున్న ప్రీతి ఆశలను చిద్రం చేసిన వారిని శిక్షించాలని కోరుతున్నారు. ముఖ్యంగా ప్రీతి సీనియర్ సైఫ్‌తోపాటు ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా సైఫ్ వేధిస్తున్నాడని ప్రీతి హెచ్‌వోడీతో పాటు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌కి కూడా తెలుసు. ప్రీతి తండ్రి స్వయంగా వారితో మాట్లాడి ఫిర్యాదు కూడా చేశారు. దాదాపు 8 సార్లు ప్రీతి తండ్రి వారిని కలిసి.. తన కూతురు పడుతున్న ఇబ్బందులను చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వాళ్లేం పట్టించుకోలేదు. పైపెచ్చు కంప్లైంట్ తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయని, సైఫే ఇంజక్షన్ ఇచ్చి చనిపోయేలా చేసి ఉండొచ్చని ప్రీతి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ప్రీతిని కులం చూసే తక్కువగా చూశారని, గిరిజన బిడ్డలు చదువుకోవద్దా అని ప్రీతి సోదరి ప్రశ్నిస్తోంది. ఒక్క సైఫ్‌పై కేసు పెడితే సరిపోదని, ప్రిన్సిపాల్‌తో పాటు హెచ్.వో.డీని సస్పెండ్ చేయాల్సిందేనని, ఆ తర్వాతే విచారణ సజావుగా సాగుతుందని కోరుతోంది. ఇక కాకతీయ మెడికల్ కాలేజ్‌లోని కీలకమైన వ్యక్తులపై చాలా ఆరోపణలున్నాయి. వీరిలో కొందరు హెల్త్ ఎడ్యుకేషన్‌లోని కీలక వ్యక్తులకు సన్నిహితంగా ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా సమయంలో రెమిడెసివర్ ఇంజక్షన్లను పక్కదారి పట్టించారన్న ఆరోపణలు కూడా వారిపై ఉన్నాయి. పైఅధికారులతో కాకతీయ మెడికల్ కాలేజ్ లో పనిచేసే వారికి ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా... ప్రీతి వేధింపుల కేసు పక్కదారి పడుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-02-27T21:18:30+05:30 IST