Rapido Driver: ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న లేడీకి డ్రైవర్ అనూహ్య మెసేజులు.. ఇవీ అతడి మెసేజులు..
ABN, First Publish Date - 2023-03-15T18:52:47+05:30
మహిళా ప్యాసింజర్ల పట్ల బైక్ ట్యాక్సీ కంపెనీలకు చెందిన డ్రైవర్ల అసభ్యకర ప్రవర్తనకు సంబంధించి మరో ఉదంతం వెలుగుచూసింది...
ముంబై: మహిళా ప్యాసింజర్ల పట్ల బైక్ ట్యాక్సీ (Bike taxi) కంపెనీలకు చెందిన డ్రైవర్ల అసభ్యకర ప్రవర్తనకు సంబంధించి మరో ఉదంతం వెలుగుచూసింది. ర్యాపిడో బైక్ (Rapido Bike) బుక్ చేసుకున్న ఓ లేడీ ప్యాసింజర్‌కు ఊహించని ఇబ్బంది ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే... సదరు మహిళా ప్యాసింజర్ తన లోకేషన్‌ను వాట్సప్ ద్వారా ర్యాపిడో డ్రైవర్‌కు (Rapido driver) షేర్ చేసింది. ఆ తర్వాత రైడ్‌కు సంబంధించి ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ కూడా జరిగింది. ఆ తర్వాత డ్రైవర్ నిజరూపం బయటపడింది. ‘‘ మీ గొంతు విన్నాక. మీ డిస్‌ప్లే పిక్చర్ చూసిన తర్వాతే పికప్‌కు వచ్చాను. లేకుంటే వచ్చేవాడిని కాదు’’ అంటూ డ్రైవర్ ఆమెకు మెసేజులు పంపించాడు. దీంతో సదరు మహిళా ప్యాసింజర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. ర్యాపిడో డ్రైవర్ నుంచి ఇలాంటి సందేశాలు రావడం పట్ల ఆగ్రహానికి గురయ్యింది. ఈ మెసేజులను స్ర్కీన్‌షాట్ తీసి ‘husnpari’ అనే ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. డ్రైవర్, కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాపిడో బైక్ యాప్‌ను తొలగించాలనే రీతిలో మండిపడడంతో ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది.
ఈ ట్విటర్ పోస్టుపై చాలా మంది నెటిజన్లు కామెంట్ చేశారు. ‘‘ ఈ రోజుల్లో ర్యాపిడో సేఫ్ కాదు’’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ‘ అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్, ఓలా లేదా ఉబర్ ఇలా యాప్ ఏదైనా వీళ్లకు లోకేషన్ పంపించడం ఒక సమస్యగా మారింది’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక ఈ ఘటనను ధైర్యంగా కంపెనీ దృష్టికి తీసుకొచ్చినందుకు చాలామంది మెచ్చుకున్నారు.
కాగా ఈ ఘటనపై ‘ర్యాపిడో’ కంపెనీ ట్విటర్ వేదికగా స్పందించింది. ‘‘ వృత్తి ధర్మానికి విరుద్ధంగా కెప్టెన్ (డ్రైవర్) వ్యవహరించడం మమ్మల్ని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. ఈ ఘటనలో మీకు క్షమాపణలు చెప్పదలచుకున్నాం. ప్రాధాన్యత దృష్ట్యా ఈ ఘటనపై తప్పకుండా చర్యలు ఉంటాయి. మీ రిజిష్టర్డ్ మొబైల్ నంబర్, రైడ్ ఐడీ పంచుకోగలరా?’’ అని కంపెనీ కోరింది.
Updated Date - 2023-03-15T18:52:47+05:30 IST