Organic Mama Hybrid Alludu Film Review: ఈ మామ అల్లుళ్లను తట్టుకోవటం చాలా కష్టం
ABN, First Publish Date - 2023-03-03T15:39:27+05:30
ఎస్.వి. కృష్ణారెడ్డి (SV Krishna Reddy) సీనియర్ దర్శకుల్లో ఒకడు, సినిమా పరిశ్రమలో అతని మార్కు చిత్రాలు తీసి మంచి పేరు పొందాడు. అయితే ఈమధ్య అతను సినిమాలు ఎక్కువ తీయలేదు, చాలా సంవత్సరాల విరామం తరువాత కృష్ణారెడ్డి ఈ 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' (OrganicMamaHybridAlluduFilmReview) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సినిమా: ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు
నటీనటులు: సోహెల్, మృణాలని రవి, రాజేంద్రప్రసాద్, మీనా, సునీల్, వరుణ్ సందేశ్, రష్మీ గౌతమ్, అలీ, హర్ష, అజయ్ ఘోష్, ప్రవీణ్ తదితరులు
ఛాయాగ్రహణం: సి రాంప్రసాద్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్.వి. కృష్ణారెడ్డి (SV Krishna Reddy)
నిర్మాత: కల్పనా కోనేరు
-- సురేష్ కవిరాయని
ఎస్.వి. కృష్ణారెడ్డి (SV Krishna Reddy) సీనియర్ దర్శకుల్లో ఒకడు, సినిమా పరిశ్రమలో అతని మార్కు చిత్రాలు తీసి మంచి పేరు పొందాడు. అయితే ఈమధ్య అతను సినిమాలు ఎక్కువ తీయలేదు, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని చాలామంది సీనియర్ దర్శకులు సినిమాలు తీయటం ఆపేసారు. చాలా సంవత్సరాల విరామం తరువాత కృష్ణారెడ్డి ఈ 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' (OrganicMamaHybridAlluduFilmReview) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే సినిమా మొదలయిన దగ్గర నుండి విడుదల వరకు ఈ సినిమా గురించి అంత బజ్ ఏమి లేదు. ఇందులో బిగ్ బాస్ (Bigg Boss Fame Sohel) ఫేమ్ సోహెల్ కథానాయకుడు అయితే, సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), మీనా (Meena) ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. ఇంతకు ముందులానే ఈ సినిమాకి కూడా దర్శకత్వం తో పాటు కృష్ణారెడ్డే మాటలు, సంగీతం, స్క్రీన్ ప్లే, కథ అందించారు. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
Organic Mama Hybrid Alludu story కథ:
విజయ్ (సోహెల్) రెండు ప్లాప్ సినిమాలు తీసి, ఒక పెద్ద దర్శకుడు కావాలి అని ఊహల్లో బతుకుతూ ఉంటాడు. అతని తల్లి దండ్రులు కొండపల్లి బొమ్మలు చేసి జీవనోపాధి చేస్తూ వుంటారు. విజయ్, హాసిని (మృణాళిని రవి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. హాసిని తండ్రి వెంకటరమణ (రాజేంద్ర ప్రసాద్) ధనవంతుడు, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ మంచి పేరు గడిస్తాడు. కూతురు అంటే పిచ్చి ప్రేమ, ఆమె ఎవరి ప్రేమలో అయినా పడిపోతుందేమో అని భయపడుతూ ఉంటాడు. (Organic Mama Hybrid Alludu Film Review) అలాంటిది ఆమె ఇప్పుడు ప్రేమలో పడింది. మరి వెంకటరమణ ఆ ప్రేమను అంగీకరించాడా, విజయ్ దర్శకుడుగా ఒక హిట్ సినిమా తీసి తన టాలెంట్ నిరూపించుకున్నాడా? ఇవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Organic Mama Hybrid Alludu Film Review)
విశ్లేషణ:
దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి పాత సినిమాలు చూస్తే కనక వాటిల్లో ఎదో ఒక పనికొచ్చే అంశం ఉండేది. తనదయిన మార్కు ఒకటి పెట్టుకొని హాస్యం, బంధాలు, విలువలు ఇలాంటివి అతని సినిమాల్లో ఎక్కువ కనపడేవి. కానీ ఇప్పుడు తరం మారింది, మనుషులు మారారు, కానీ కృష్ణారెడ్డి మాత్రం మారలేదు. అతను తీసిన ఈ 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' (Organic Mama Hybrid Alludu Film Review) అటు అతని పాత మార్కు కానీ, లేదా ఇటు కొత్త తరానికి సంబదించిన అంశం కానీ ఏదీ లేదు. అంత సీనియర్ దర్శకుడు అయి ఉండీ కూడా, ఒక సరి అయిన కథ లేదు, ఒక ఆసక్తికర సన్నివేశం లేకుండా ఆలా ఎలా ఈ సినిమా తీసాడో మరి అతనికే తెలియాలి. ఈ సినిమాలో కథ కి టైటిల్ కి సంబంధం లేదు, అలాగే కొన్ని సన్నివేశాలు ఎందుకు వచ్చాయో, ఎందుకు తీశారో తెలియదు, పోనీ ఆ తీసిన సన్నివేశాలు ఏమైనా రసవత్తరంగా, ఆసక్తికరంగా ఉన్నాయా అంటే, అదీ లేదు.
ముందుగా ఈ సినిమాకి మొదటి నుండీ అసలు బజ్ అనేదే లేదు. రాజేంద్ర ప్రసాద్, బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, మీనా అనగానే పోనీలే సినిమాలో ఏదైనా చిన్న విషయం అయినా వుండబోదా అనుకొని వెళ్లినవాళ్ళకి కూడా కృష్ణారెడ్డి పూర్తి నిరాశే మిగిల్చాడు. స్క్రీన్ మీద అతను చెప్పే విధానం, కథనం అంతా ఒక పాతకాలపు సీరియల్ లో చూపించినట్టుగా చూపించాడు కృష్ణారెడ్డి. అక్కడక్కడా ఏవో పోరాట సన్నివేశాలు, పాటలు ఎందుకంటే తెలుగు సినిమాలో కథానాయకుడు అనగానే పదుల్లో వున్న విలన్స్ ని కొట్టాలి, కొట్టిన వెంటనే ఊహల్లోకి వెళ్ళిపోయి పాటలు పాడేసుకోవాలి కదా. (Organic Mama Hybrid Alludu Film Review)
ఇక్కడ ఇంకో తప్పు పని కూడా చేసాడు కృష్ణారెడ్డి. సినిమాలో కథే ఏమి లేదు అనుకుంటే, హాస్య సన్నివేశాలను ఇంకో ట్రాక్ లో నడిపించి, కథ వేరుగా, ఆ హాస్య సన్నివేశాన్ని వేరుగా చూపించాడు. ఈ రెండిటికి సంబంధం ఉండదు. అలాగే కృష్ణారెడ్డి రాజేంద్ర ప్రసాద్ పాత్రని పొడిగించాలి అని అనుకున్నాడేమో, అందుకని అక్కరలేకపోయినా కూడా కొన్ని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు పెట్టాడు అతనికి. మామూలుగానే రాజేంద్ర ప్రసాద్ ని ఆ విగ్ లతో చూడలేము, అందులోకి ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో అతన్ని కుర్రాడిగా చూపించటం, దానికి ఇంకో విగ్, ఇవన్నీ అవసరమా? ఒక మంచి కథతో ఒక సినిమా తీస్తే ఎవరయినా చూస్తారు, అంతే కానీ, అప్పట్లో ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని హిట్స్ ఇచ్చాను, ఇన్ని క్లీన్ సినిమాలు తీసాను అని ఎదో ఒక కథ, కథనం తో వస్తే ప్రేక్షకులు చూడరు. ఏ సినిమాకి అయినా కథ, భావోద్వేగాలు బలం అని కృష్ణారెడ్డి గ్రహించాలి. ఆ రెండూ లేనప్పుడు ఏ సినిమా నడవదు. ఇవేమీ కాకపోతే కామెడీ, యాక్షన్ లాంటి జానర్ తీసినా కొంత నయంగా ఉండేదేమో. ఎస్.వి. కృష్ణా రెడ్డి మూడు దశాబ్దాల కి పైగా వున్న సినిమా కెరీర్ లో ఎటువంటి విషయం లేని ఈ 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' ఒక మాయని మచ్చలా ఉండిపోతుంది, వున్న మంచి పేరు కాస్తా పోతుంది. సుమారు 8, 9 సంవత్సరాల తరువాత విరామం తరువాత ఇలాంటి సినిమా చేస్తే, విరామాం తీసుకుంటేనే మంచిది అని ప్రేక్షకులు అనుకుంటారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే సోహెల్ (Sohel) కథానాయకుడిగా పరవాలేదు అనిపించాడు, కానీ కథ లేనప్పుడు అతను మాత్రం ఏమి చేస్తాడు. కథానాయిక మృణాళిని రవి (Mrinalini Ravi) మామూలుగా వుంది, ఆమెకి పెద్దగా పాత్ర ఏమి లేదు. రాజేంద్ర ప్రసాద్ కి (Rajendra Prasad) ఇలాంటి పాత్రలు మామూలే, ఇందులో కూడా అలానే చేసాడు. కోపం వస్తే రూమ్ లోకి వెళ్ళిపోవటం లాంటి సన్నివేశాలు అంతగా ఎక్కవు. మీనా (Meena) తన పాత్ర బాగానే చేసింది. సునీల్ కొంచెం పరవాలేదు. హాస్య సన్నివేశాలు అంతగా ప్రేక్షకులకి ఎక్కవు. వరుణ్ సందేశ్ (Varun Sandesh), రష్మి గౌతమ్ (Rashmi Gautam) మధ్యలో కనపడతారు. అలీ (Ali) హాస్య సన్నివేశాలు కూడా అంతగా పండవు. కృష్ణారెడ్డి సంగీతం, మాటలు, కథనం, కథ సమకూర్చారు కాబట్టి అన్నిటికీ బాధ్యుడు అతనే.
చివరగా, 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' ప్రేక్షకుడి సహనానికి ఒక పరీక్ష. చాలా సంవత్సరాల తరువాత దర్శకత్వంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఎస్.వి. కృష్ణారెడ్డి నిరాశ పర్చాడు. ఈ సినిమాలో కొత్తదనం ఏమి కనిపించక పోగా, కనీసం ఒక్క సన్నివేశం కూడా ఆసక్తికరంగా ఉండదు.
Updated Date - 2023-03-03T15:39:27+05:30 IST