Valentine Week 2023: ఈ జనాల ఆలోచనలు ఎప్పుడు మారతాయో..!
ABN, First Publish Date - 2023-02-09T00:36:30+05:30
ప్రేమ దక్కని క్రమంలో వారు ఎక్కడ ఉన్న సుఖంగా ఉండాలని కోరుకోవాలి.
సాధారణంగా ప్రేమకథలన్నీ సుఖాంతం అయిపోతాయనే అభిప్రాయం ఎవరికీ ఉండదు. చాలా పోరాడి, పెద్దల్ని ఒప్పించి సాధించుకున్న ప్రేమకథలు ఎక్కడో సుఖాంతం అయ్యి, వివాహబంధంతో ఒకటవుతాయి. అనుకోకుండా మొదలయిన ప్రేమకథలో కొన్ని అనుకోని సంఘటనలు వచ్చి చేరతాయి. వాటన్నింటినీ దాటి రాగలిగితేనే అదో ప్రేమ కావ్యం అవుతుంది. చిన్నతనం నుంచి ఒకరితో ఒకరికి పరిచయం ఉండి, ఆ స్నేహం ప్రేమగా మొదలైతే, జీవితానికి పునాది కాస్త గట్టిగానే పడుతుందని నిరూపించారు ఈ ప్రేమికులు. ఈ జంట ప్రేమ, పెళ్ళికి దారి పట్టేలోపు అనుకోని మలుపు తిరిగినా.. క్లైమాక్స్ శుభంకార్డ్ తోనే ఎండ్ అయింది. అసలు కథలోకి వెళితే.. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 సందర్భంగా వాలెంటైన్స్ వీక్ Valentine'S Day ప్రత్యేక కథనం ఆంధ్రజ్యోతి వెబ్ నుంచి..
ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెద్దల అంగీకారం కోసం చాలా ఎదురుచూసారు. తీరా చేస్తే పెంచిన తండ్రే ఈ కథలో విలనయ్యాడు. అతని అంగీకారం కోసం వేచి చూసారు, చాలా నచ్చజెప్పారు. పంతాలకు పోయి పెంచిన తండ్రి బంధాన్ని తెంచుకుంటే ఆ ప్రేమికులు అందరిలాగే ఒత్తిడితో నలిగిపోయారు. దైర్యంగా నిలబడి కోరుకున్న జీవితాన్ని అందుకున్న ఈ జంట తమ ప్రేమకథను నాలుగు మాటల్లోనే చెప్పేసినా, ఈ ప్రయాణం దాదాపు పదేళ్ల మైలురాయిని దాటేసింది. పదకొండో మైలురాయి దగ్గరిలో ఉంది. కోరుకున్న జీవితాన్ని పెద్ద పరీక్ష పెట్టకుండానే ఎలాంటి ఛేజింగ్ లు, ఫైట్స్ లేకుండానే ఇచ్చేసిన పైవాడు, ప్రేమకు ప్రతిరూపాలను ఇవ్వడంలో కాస్త ఆలస్యం చేయడంలో మగవాడిగా వేణుగోపాలాచారి పెద్దగా ఇబ్బంది పడకపోయినా, ప్రేమ వివాహం, పైగా బిడ్డలు ఆలస్యం కావడం ఇవ్వన్నీ రజిని విషయంలో ఎక్కువగానే ప్రభావాన్నిచూపాయి. ఎన్ని కష్టాలనైనా చిరునవ్వుతో సర్దుకుపోయే ఆడవారికి భూదేవంత ఓపికంటారు. ప్రేమలో ఉన్నందుకు ఆ ఓపిక రెట్టింపు అయింది కాబోలు. అవమానాలు, చీదరింపులు ఓపికగా భరించినందుకు ఇప్పుడు వీళ్లకు ఇద్దరు ముత్యాల్లాంటి బిడ్డలు. వాళ్ల ప్రేమకథ గురించి అడిగితే వేణు, రజనీ చెప్పిన కాసిని కబుర్లు ఇవిగో..
ఇది కూడా చదవండి: మరో సావిత్రి మన విమ్లా.., ఈ బంధానికి వెనుకున్నదీ ప్రేమే.. !
1. ఈ ప్రేమ కథ ఎక్కడ ఎప్పుడు మొదలైంది.
జ. మా ప్రేమ కథ 2002 డిసెంబర్ లో ములుగులో మొదలైంది. మా ప్రయాణం దాదాపు 11 సంవత్సరాలు సాగింది. 2002 లో నేను డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉన్నాను, తను ఎనమిదవ తరగతిలో ఉంది. అయినా రెండు సంవత్సరాలు మాట్లాడుకోలేదు కేవలం చూపులు మాత్రమే. తను పదవ తరగతిలో ఉండగా నేను మ్యాథ్స్ క్లాస్ చెప్పే వాడిని. తనతో కేవలం మామూలు పరిచయం మాత్రమే. ఒకటే కులం, అయినా అందరి ప్రేమ కథలోలానే మాకూ కష్టాలు ఎదురయ్యాయి. అవన్నీ నా కుటుంబం కన్నా వాళ్ళ కుటుంబం నుంచి వచ్చాయి. ముఖ్యంగా వాళ్ళ అమ్మ నాన్న (పెంచుకున్న వారి) రూపంలోనే వచ్చాయి. తనను పెంచుకున్న అమ్మ నాన్నలకు, నన్ను ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టపడలేదు (మొదట నాతో బాగానే ఉండే వారు కానీ ఎవరో ఏదో చెప్పారు వాళ్ళ మనసు మారిపోయింది). గ్రామ పెద్దల వరకు విషయం వెళ్ళినా లాభం లేకుండా పోయింది. గ్రామ పెద్దలు తనను వాళ్ళ సొంత అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళమన్నారు. 13.02.2013 న మా పెళ్లి వారి చేతుల మీదుగానే జరిగింది. ఇప్పుడు మాది చక్కని సంసారం, ఒక పాప, ఒక బాబు. ఇపుడు మాది హ్యాపీ ఫ్యామిలీ.
2. ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏమిటి?
ప్రేమ ఇదని, ఇలాగే ఉంటుందని ఆఫీలింగ్ ని మాటల్లో చెప్పలేము. ఎందుకంటే మనకోసం ఒకరు ఉన్నారనే భావన మనసులో ఉత్సాహాన్ని, ప్రేరణను ఇస్తుంది. ప్రేమించిన అమ్మాయి పక్కన ఉంటే ఏదైనా సాధించగలం అనే నమ్మకం ఉంటుంది. నా ఉద్దేశ్యంలో ప్రేమించడం కన్నా, ప్రేమించబడటం గొప్ప. అందరు ప్రేమిస్తారు, కానీ దాన్ని పొందే అవకాశం కొందరికే వస్తుంది. అది నాకు దక్కింది. తను వచ్చాకా లైఫ్ ఎలా ఉంటుంది అని అనుకున్నానో అలానే హాయిగా ఉంది. అయితే నా విషయంలో జరిగినట్టు అందరికీ జరగాలని ఏంలేదు. ఇంత హాయిగా ఉంది కనుక ఇలా చెపుతున్నాను అదే వేరే ఏం జరిగినా కూడా సర్దుకునే వాడినే. కాకపోతే విఫలం అయిందని బాధలో కూరుకుపోయే మనిషినైతే కాదు.
3. జీవితంలో ప్రేమను సాధించేసాకా తరవాత.. అని ఆలోచన వచ్చినపుడు..?
జ. ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నానని చాలా ఆనందంగా ఉన్నాను. నా స్నేహితులలో చాలా మంది ప్రేమించారు, కానీ ఎవరూ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. నా స్నేహితులలోనే కాదు, మా బంధువులలో కూడా ఎవరూ ప్రేమించి పెళ్ళి చేసుకుని కలలుకన్న జీవితాన్ని అందుకున్నవారు లేరు. కోరుకున్న అమ్మాయిని భార్యగా పొందాలంటే అదృష్టం ఉండాలి, అదే మనల్ని అర్థం చేసుకున్న అమ్మాయి అయితే, ఇంకెంత అదృష్టం ఉండాలి, అందులో నేను చాలా అదృష్టవంతుడిని.
4. కోరుకున్న అమ్మాయి జీవితంలోకి వచ్చిన తరువాత ఆ జర్నీ ఎలా ఉంటుంది.
జ. ప్రేమను పెళ్ళి వరకూ తీసుకువెళ్ళి, ఆమెతో జీవితం పంచుకున్నాకా నా వరకూ నేను తృప్తిగా ఉన్నాను. అందులోనూ మన జీవితంలోకి వచ్చిన అమ్మాయి మనల్ని అర్థం చేసుకున్న అమ్మాయి అయితే, ఆ లైఫ్ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చాలా ఆనందంగా సాగిపోతుంది.
5. ప్రేమలో ఉన్నప్పటికీ, ప్రేమను సాధించేసుకున్న ఇప్పటికీ తేడా ఏదైనా గమనించారా?
జ. తేడా ఉంది. కానీ మరీ ఎక్కువ తేడాలు ఏం లేవు. ప్రేమలో ఉన్నపుడు తనని చూడాలి, మాట్లాడాలి అని ఉండేది, కానీ తను కనపడగానే మౌనమే. ప్రేమ ఎవరికి ఏం నేర్పిందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం బాధ్యతగా ఉండటం నేర్పించింది. ప్రేమలో ఉన్నపుడు ఎంత బాధ్యతగా ఉన్నానో అంతే బాధ్యతగా ఇప్పుడు కూడా ఉన్నాను. అదే నేను గమనించిన విషయం. ఇద్దరు పిల్లలతో మంచి భర్తగా బాధ్యతతో తనని చూసుకుంటున్నాను. తను కూడా నా కుటుంబంలో కలిసిపోయింది.
6. మగవారితో పోల్చితే ఆడవాళ్లు ప్రేమ వివాహం చేసుకున్నారని చుట్టుపక్కల వారి నుంచి, బంధువుల నుంచి వ్యతిరేకత ఉంటుంది అలాంటిది మీరు ఏమైనా ఎదుర్కున్నారా?
జ. పెంచుకున్నవారు వదిలేస్తే.. నా అసలు తల్లితండ్రులే నాకు చేయూతయ్యారు. దానికి మరింత బలం ఇస్తూ నా భర్త నిలబడ్డారు. ఇద్దరు పిల్లలతో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను. కానీ బంధువులు, చుట్టు పక్కల వారితో పెళ్లయిన కొత్తలో ఇబ్బంది ఉండేది. ఏదో చేయరాని తప్పు చేసినట్టు చూసేవారు. ఇప్పుడిప్పుడే కాస్త ఆ చూపుల్లో నా పట్ల గౌరవం కనిపిస్తుంది. కాకాపోతే ప్రేమించుకుంటే నేరంగా చూసే జనాల ఆలోచనలు ఎప్పుడు సరిగా మారతాయో, అర్థం చేసుకునే వారిగా ఎప్పుడు ఉంటారో.. అర్థంకాదు. ప్రేమంటేనే తప్పుగా చూసే దృష్టి కోణం మారాలి.
7. మారుతున్న కాలంలో ప్రేమ మారుతూ వచ్చిందా? లేక ఏ మార్పూ లేకుండా ఉందా? మీరేం గమనించారు.
జ. ప్రేమ అనేది మారుతూ వచ్చింది. మేము దాదాపుగా 11 సంవత్సరాలు వేచి ఉన్నాము. ఇప్పటి ప్రేమికులు సంవత్సరం కాదు కదా, గంటల్లో ప్రేమ పుట్టేస్తుంది, దాన్ని తేడావస్తే నిమిషాల్లోనే మరిచి పోతున్నారు. ప్రేమిచకపోతే భౌతిక దాడులకు తెగబడి, ఉన్మాదుల్లా మారిపోతున్నారు. ఇప్పటి ప్రేమలో నిజాయితీ లేదు. అమ్మాయి అయిన అబ్బాయి అయిన ప్రేమను దక్కించుకోవాలి, దక్కని క్రమంలో వారు ఎక్కడ ఉన్న సుఖంగా ఉండాలని కోరుకోవాలి.
8. ఇద్దరూ కోరుకున్న జీవితాన్ని సాధించుకున్నారు. రేపు మీ పిల్లలకు ప్రేమ వివాహం చేస్తారా? మీకు నచ్చిన వారినే ఇచ్చి చేస్తారా?
జ. ప్రేమ, పెళ్ళి వారికి నచ్చినట్టుగానే చేయాలి. ఎందుకంటే ఇప్పటి పిల్లలు చాలా తెలివిగలవాళ్లు. వాళ్ల ఆలోచనలు చాలా చురుగ్గా ఉంటున్నాయి. మా కాలంలోలా పెద్దల చాటున ఉండే తరం కాదు ఇప్పటిది. ఇప్పటి పిల్లలకు అన్నీ తెలుసు. అయినా మా పిల్లలకు మేం ఎప్పుడూ సపోర్ట్ గానే నిలుస్తాం. వాళ్ల ప్రేమకు బంగారు భవిష్యత్ కు మేం ఎప్పుడూ అండగా ఉంటాం.
- శ్రీశాంతి మెహెర్
Updated Date - 2023-02-09T18:15:15+05:30 IST