ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

valentine week 2023: అంత ఓపిక ఇప్పటి ప్రేమికుల్లో లేదు...!

ABN, First Publish Date - 2023-02-12T22:26:46+05:30

సమస్యకు వెంటనే స్పందించే గుణం నచ్చుతుంది. అర్థంచేసుకునే విధానం ఇంకా ఇష్టం.

valentine week 2023
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానవ మేథస్సుకి అందని భావన ప్రేమ.. ఇంగ్లీషులో నాలుగే అక్షరాలుగా పలికే ఈ ప్రేమకు సర్వమానవాళి శిరస్సు వంచుతుంది. ప్రేమలేని బంధమేది. ప్రేమలేని చోటేది. మనసులు కలిస్తే ప్రేమైపోతే మరి దాని చివరి మజిలీ ఏమిటి. ఇలా ప్రశ్నించుకుంటూ పోతే నిజమైన ప్రేమకు అర్థాలు వెతుకుతూ పోతే, ఇదిగో ఇలా ప్రేమలో పదేళ్ళు వసించి, ప్రేమను పెళ్ళిగా మార్చుకున్న నిజమైన ప్రేమికులు కనిపిస్తారు. కలిసిన మనసులకంటే, ఒకటైన అభిప్రాయాల కంటే, ఇద్దరు మనుషులతో పాటు, రెండు కుంటుంబాల కలయికనే ప్రేమనుకున్నారు వీరు. ప్రేమికుల రోజు సందర్భంగా తమ ప్రేమ ప్రయాణాన్ని ఆంధ్రజ్యోతి వెబ్ తో పంచుకున్నారు ఈ జంట. ఇప్పటి ప్రేమికులనడిగితే ప్రేమ ఎంత మధురమో, అంతకన్నా భయంకరమైన భావనని దానిని పొందటం ఎంత సులువో, పెళ్ళి వరకూ తీసుకువెళ్ళడం అంతకష్టమనే మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. మరి ఈ జంట ప్రేమ, పెళ్ళి వరకూ ఎలా వెళ్ళింది. తర్వాత ఈ ప్రయాణం ఎలా సాగిందనేది సుచిత్ర, నరేష్ ప్రేమకథలోకి వెళితే...

ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టేందుకు సరైన కారణాలు చెప్పడం కష్టం. మా ఇద్దరికీ ఎక్కడో బీరకాయ పీచు బంధుత్వం ఉంది. దాని వల్లే ఇద్దరం పరిచయం అయ్యాం. మామధ్యా ప్రేమ ఉందనేది ఇద్దరికీ తెలీదు. అలా అని ఇప్పటిలా ఒకరితో ఒకరం చెప్పుకున్నదీ లేదు. మనసులు కలిసాయనేది నెమ్మదిగా అర్థం అయింది. కాకపోతే నా వయసు అప్పటికి చాలా చిన్నది. ఇంటర్ చదువుతున్నాను. ఆ వయసులో ప్రేమను వ్యక్తం చేయడం కానీ, ప్రేమను తెలిపే విధానం కానీ నాకు తెలీదు. అయినా ఏదో చెప్పాలనిపించేది. మొత్తానికి నేనే చెప్పాను. తన మీద ఉన్నది ప్రేమని.

అక్కడితో అయిపోదు కదా.. మా ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని మా ఇంట్లో పెద్దవాళ్ళకు చెప్పడానికి దాదాపు పదేళ్ళు సమయం తీసుకున్నాం. ఇంత సమయం తీసుకున్నామంటే.., భయపడి చెప్పకపోవడం కాదు. ఇద్దరం కెరియర్ లో ఓ స్థాయికి రావాలని, మధ్యలో ఆవేశ నిర్ణయాలు తీసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాం. అలాగే నిలబడ్డాం కూడా. ఇక్కడ మమ్మల్ని ఆపింది చిన్న చిన్న విషయాలే అయినా పెద్దల అంగీకారం కోసం అంతకాలం ఆగాల్సి వచ్చింది. రెండు కుటుంబాలు ఒప్పుకుని సంతోషంగా చేస్తేనే పెళ్ళి లేదంటే, ఇందులో ఏ ఒక్కరు బాధపడినా వద్దనుకుని, చాలా ఓపిక పట్టాం. సంతోషంగా అందరూ ఒప్పుకున్న తరువాత అందరి అంగీకారాలను ఆనందపు అక్షింతలుగా చేసుకుని తలంబ్రాలుగా పోసుకున్నాం.

మా నాన్నకు మేం ఐదుగురం ఆడపిల్లలం. నేను మధ్యదాన్ని. చదువు అయిపోయి నేను ఏం చేయాలని ఆలోచించుకునేలోపు ప్రేమలో పడి ఆ విషయాన్ని ఇంట్లో చెప్పాలనే ఒత్తిడిని మోయడం, ప్రేమ పుట్టినంత సులువు కాదని తెలుసుకున్న క్షణాలవి. నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఆయనకూ మేము అందరం ఆడపిల్లలం అని బాధ ఎప్పుడూ లేదు. మమ్మల్ని చాలా స్వేచ్ఛగా పెంచారు. నాకు ఇచ్చిన స్వేచ్ఛను, ప్రేమలో పడి పాడు చేసుకున్నాననే భావన మా నాన్నకు కలగకూడదని ఆయన నిర్ణయం చెప్పే వరకూ ఆగాను. నిజానికి ఆయన కాస్త వ్యతిరేకించారు. ఏమో నేను సొంత నిర్ణయం తీసుకుంటే జీవితం ఎలా ఉంటుందో అనే భయం కావచ్చు. మాట్లాడటం మానేశారు. నేను మనసులోనే బాధ పడ్డాను. ఆ భారాన్ని మోయడం ఎంత కష్టమో ఇప్పుడు తలుచుకున్నా మనసు భారంగా ఉంటుంది. నాన్న పెళ్ళి చేయాలని చూస్తున్నప్పుడు మాత్రం ఎవరితోనూ చెప్పుకోలేని బాధ పడ్డాను. ఈయనకు ఏం చెపితే నా ప్రేమను అంగీకరిస్తారనే ప్రశ్న పదే పదే వేసుకునేదాన్ని. ఓసారి ఆయనే నా దగ్గరకు వచ్చి.., నీ మనసులో ఒకరిని ఉంచుకుని ఇంకొకరిని ఇచ్చి పెళ్ళిచేయడం నాకూ ఇష్టం లేదమ్మా.. నీకు నచ్చినట్టే చేద్దాం అన్నారు. అప్పుడు నాన్న నాకన్నా ఎక్కువగా నాగురించి ఆలోచించారు అనిపించింది. ఇదంతా ఒక్క రాత్రిలోనో. ఒక్క నెలలోనో, ఒక్క సంవత్సరంలోనో జరిగిపోయింది కాదు. పదేళ్ల నిరీక్షణ. దాని ఫలితమే మా పెళ్ళి, దాని ఫలితమే మా బిడ్డలు ఆధ్యా, ధృవీష్ మా ప్రేమకు ప్రతిరూపాలు.

ఇది కూడా చదవండి: మాట, పాట, పద్యం అన్నీ స్పాట్‌లోనే రికార్డింగ్!

ఆర్థికంగా నిలబడలేమని, నరేష్ ను నమ్మలేమని ఎందరో బంధువులు అనుమానించారు. నీ జీవితాన్ని రిస్క్ లో పడేసుకుంటున్నావన్నారు. అయినా నేను తనని నమ్మాను. తను చేయి ఎన్ని కష్టాలు వచ్చినా నేను చేయివదలనని నమ్మారు. ఆ నమ్మకమే ఇద్దరినీ కలిపింది. పెళ్ళి తరవాత నరేష్ మంచి వ్యక్తిత్వం, మా ఆనందకరమైన కాపురమే జవాబు చెప్పింది. ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటాం. ఉన్నదాంట్లోనే పిల్లల చిన్న చిన్న కోరికలు తీర్చి ఆనంద పడతాం. అత్తగారింట్లో అంతా నన్ను అర్థం చేసుకున్నారు. మిగతావారితో పోల్చుకోకుండా నాకు నచ్చినట్టు లైఫ్ నడుస్తుంది. భార్యాభర్తలు ఒకే మాట మీద నడిస్తే చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చినా సర్దుకుపోతాయి. ఇద్దరి మధ్యలోకీ మూడో వ్యక్తి వచ్చే అవకాశమే ఉండదు. ఇప్పటి వాళ్లకు ఇది తెలియకనో, లేక ఓపిక లేకనో సంసారాలు పాడు చేసుకుంటున్నారు. ఇద్దరిదీ ఒకే మాటైతే తగాదాలు రావు. ఆవేశపడకుండా సమస్యను పరిష్కరించుకునే ఓపిక కావాలంతే..

ప్రేమించుకుని, పెళ్ళిచేసుకుని జీవితంలో నిలబడటం అంటే ఏ ఒక్కరితోనో అయిపోదు దీనికి ఇద్దరూ సహకరించుకుంటేనే సాధ్యం అవుతుంది. నాకన్నా ఆయన ఆలోచన ముందుంటుంది. సమస్యకు వెంటనే స్పందించే గుణం నచ్చుతుంది. అర్థంచేసుకునే విధానం ఇంకా ఇష్టం. ఉద్యోగం చేసుకుంటూ ఇల్లూ, పిల్లలూ ఇలా బిజీగా గడిచిపోతున్న రోజులో తనతో ఒక్క క్షణం మాట్లాడినా రిలాక్స్ అవుతాను. నవ్వుతూ పలకరిస్తే ఒత్తిడంతా మరిచిపోయి, అంతకన్నా ఇంకేం వద్దనిపిస్తుంది. సంతోషాన్ని వెతికే విధానం అందరికీ తెలియదు. సమస్యలే వెతికితే అవే కనిపిస్తాయి మన చుట్టూ.. జర్నలిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నానంటే దానికి ఆయన సపోర్ట్ చాలా ఉంది. నా వైపు నుంచి ఆర్థికపరమైన సపోర్ట్ ఇంటికి ఉండాలని ఎప్పుడూ చూస్తాను. నాన్న మమ్మల్ని ఆడపిల్లల్లా సున్నితంగా పెంచలేదు. ధైర్యంగానే తిరగనిచ్చేవారు. నాన్నలానే నరేష్ కూడా ధైర్యం ఇస్తారు.

ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరువు హత్యల గురించి చూస్తున్నప్పుడు, వృత్తి పరంగా వాటి గురించి రాయాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది. ఏం పోయింది తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే సమస్య ఉండదుకదా అని.. ! కన్నబిడ్డల్ని చంపేసి ఏం సుఖంగా ఉంటారు వీళ్ళు అనిపిస్తుంది. అవి రాస్తుంటే కన్నీళ్ళు తిరుగుతాయి. సమస్య ఉంటే బిడ్డల్ని వదులుకున్నా పరవాలేదు, కానీ చంపేయడం అంటే అది ఎంత పాషాణమైన హృదయమై ఉండాలి. అదే ఆలోచన వస్తే నేను చాలా అదృష్టవంతురాలి అనుకుంటాను. ఇప్పటి తల్లిదండ్రులు బిడ్డల్ని అర్థం చేసుకోవాలి. అలాగే ప్రేమికులు కూడా ఆవేశ నిర్ణయాలు తీసుకోకూడదు. కలలుగన్న జీవితం చేజిక్కించుకోవాలంటే ఓపిక, ధైర్యం చాలా అవసరం.

- శ్రీశాంతి మెహెర్.

Updated Date - 2023-02-12T22:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising