ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Valentine Week 2023: కులాల కంచెలో పూసిన గులాబీ..!

ABN, First Publish Date - 2023-02-10T15:06:24+05:30

మా బాబుని కూడా కులమతాలు బేధాలు లేకుండా పెంచుతాం.

Valentine's Day 2023
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ ఎందుకు, ఎప్పుడు పుడుతుందో చెప్పాలంటే దేవుడివల్ల కూడా కాదు. ప్రేమకు బీదా, గొప్ప అంటూ, కుల, మతాలను అడ్డు పెట్టి కక్ష సాధించే సమాజంలో మార్పు ఎప్పుడు వస్తుందో సరిగ్గా తెలీదు. ప్రేమించడం నేరంగా చూసే వారికి ఈ ప్రేమకథ నేరంగానే కనిపించినా, ప్రేమ తరువాత జీవితాన్ని అందుకోవాలని చూసేవారికి దైర్యాన్ని ఇస్తుంది. నిజానికి ప్రేమలేని చోటెక్కడుంది.

తల్లిదండ్రులుగా కఠినంగా ప్రవర్తించే పెద్దలకు జీవితంలో నిలబడి, గెలిచి చూపించారీ జంట. ఏ కులం అడ్డుగా పెట్టారో ఆ కంచెలోనే గులాబి పూవులా వికసించింది వారి జీవితం. అందమైన దాంపత్యంలో, బిడ్డతో ఆనందంగా సాగిపోతున్న సతీష్, శ్వేతల ప్రేమకథ ఇది..

శ్వేతా, సతీష్‌లు ఇద్దరూ స్కూల్‌లో క్లాస్‌మేట్స్, ఇద్దరూ కలిసే స్కూల్‌కి వెళ్లేవారు. పదోతరగతి అయిపోయాకా దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు. ఈలోపు ఇద్దరి మధ్య పరిచయం లేదు. మళ్ళీ ఫేస్బుక్‌లో తిరిగి పరిచయం అయ్యాకా సరదామాటలు, కబుర్ల మధ్య, ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. అప్పుడే చిన్నప్పటి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారనే విషయాన్ని ఇంట్లో చెప్పడానికి ఆరునెలలు పట్టింది. తీరా ఇంట్లోవాళ్ళకు ప్రేమ విషయం చెపితే శ్వేత కులం తక్కువదన్నారు సతీష్ ఇంట్లోవాళ్ళు. ఇక శ్వేత తల్లిదండ్రులు ప్రేమించిందని తెలీగానే అందరి తల్లిదండ్రుల్లానే ప్రవర్తించారు. నిజం చెప్పాలంటే మరీ కర్కశంగా, కృరంగా ప్రవర్తించారు ఆమె తల్లిదండ్రులు.. వారి ప్రేమ కథలోకి వెళితే.. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 సందర్భంగా వాలెంటైన్స్ వీక్ Valentine'S Day ప్రత్యేక కథనం ఆంధ్రజ్యోతి వెబ్ నుంచి..

1. మీ పెళ్ళి అనుకున్నాకా మీ వైపున నిలిచి మీకు సపోర్ట్ ఇచ్చిన వారేవరైనా ఉన్నారా?

పెళ్లి విషయంలో మా ఇంట్లో ఒప్పుకోకపోవడంతో కుల నిర్మూలన సంఘం కార్యదర్శి కృష్ణచంద్ గారిని కలిసి మా పరిస్థితి చెప్పాము. ఆయన మా స్థితి అర్థం చేసుకొని అండగా నిలిచారు. పెళ్ళి అయ్యాకా మేం ఇద్దరం చాలా కష్టపడ్డాం. జీవితంలో నిలదొక్కున్నాం. ఇదంతా జరిగిపోయిందని, ఇప్పుడు బావున్నామని పాత జ్ఞాపకాలు మాసిపోవుకదా..పడిన బాధల నుంచి మరింత బలంగా నిలబడ్డాం. నిలబడతాం కూడా.

2. పెద్దల నుంచి పెళ్లి విషయంలో మీ ఇద్దరూ ఎదుర్కున్న ఇబ్బందులు ఏమిటి?

ఒకటని కాదు. చాలా ఫేస్ చేసాం. కులం మాత్రమే కారణంగా చెపుతున్నా, అసలు మా పెద్దలకు ప్రేమ వివాహమే ఇష్టం లేదు. గొప్పగా ఆస్తి లేదని, పోషించలేనని, వాళ్ల మాట పోతుందని, ఇలా చాలా విధాలుగా మాటలతో బాధపెట్టేవారు. చీదరించుకునేవారు. ఎంత నచ్చజెప్పాలని చూసినా ఏదో గొడవతోనే మా సంభాషణ ముగిసేది. బంధువులైతే మా జీవితాలను పీడించి సంతోష పడ్డారు. మా ప్రేమ చచ్చిపోతుందని ఒకరి మీద ఒకరికి మనసు విరిచేయాలనే ప్రయత్నాలు చాలా ఎక్కువగా జరిగేవి. అన్నీ దాటి రావడానికి మేము చాలా ఓపిక పట్టాల్సివచ్చింది.

ఇది కూడా చదవండి: ఈ జనాల ఆలోచనలు ఎప్పుడు మారతాయో..!

3. శ్వేతా.. మీ ప్రేమ విషయం తెలిసాకా.., మీ బంధువులు ఎలాంటి సలహాలు ఇచ్చారు, వాళ్ళ నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉంది. ఇబ్బంది వాతావరణం ఏదైనా ఉండేదా?

మా బంధువులు నన్ను చాలా హింసించారు, సతీష్‌ని కొట్టారు. తరువాత నేను వినకపోవడంతో తననే ఇచ్చి పెళ్లి చేస్తామని నమ్మించి పోలీస్ స్టేషన్లో తనకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పమన్నారు. నాకు వేరే సంబంధాలు చూశారు. సతీష్ దృష్టిలో నాకు వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని, తను నన్ను వదిలేయాలని సొంత కూతురని కూడా చూడకుండా తప్పుడుగా చూపించాలని చూశారు నావాళ్ళు.

4. మగవారికన్నా ఆడపిల్ల ప్రేమించింది అనగానే ఇంట్లో వాళ్ల రియాక్షన్, ట్రీట్ చేసే తీరు వేరేగా ఉంటుంది. ఇది మీరేమన్నా ఫేస్ చేసారా?

ఇంట్లో ప్రేమించాను అని చెప్పగానే మా ఇంట్లో అమ్మానాన్న నాతో మాట్లాడటం మానేశారు. ఇంట్లో తినకూడదని చెప్పారు. అన్నం తినకుండా వారికి నచ్చ చెప్పాలని చూశాను. నేను బయట తింటున్నా కూడా ఒక్కరోజు కూడా అమ్మానాన్న నన్ను ఇంట్లో తినమని చెప్పలేదు. కారణం వారు చెప్పిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకోను అన్నానని. అలాగే సతీష్‌ని ప్రేమించాను అని. నన్ను చిన్నతనం నుంచి కనిపెంచిన వాళ్ళు ఇంత కఠినంగా మారిపోతారని అసలు ఊహించలేదు. ఇంత వ్యతిరేకత కులం గురించి మాత్రమే కాదు. వాళ్ళ ఇష్టం నామీద రుద్దడం కుదరదలేదని కూడా. ఎన్నో మాటలు నావాళ్ళ నుంచే పడ్డాను. ఆడపిల్లకు స్వేచ్ఛ ఉందని చెపుతున్న పేపర్లు, సమాజం, పెద్దవాళ్ళు ప్రేమ విషయంలో, పెళ్ళి విషయంలో ఎందుకు ఇవ్వరు. ఆడపిల్లని బ్రతకనివ్వండి అంటారు, మహాలక్ష్మి అంటారు. ఇవ్ననీ నీతులు మాత్రమే.. నిజంలోకి వస్తే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంతా కులగజ్జితో ఒళ్ళు, మనసు పాడుచేసుకుని బతుకుతున్నారు.

5. మీ వారిలో మీకు నచ్చిన విషయం ఎంటి. అలాగే నచ్చనిది కూడా

మా వాళ్ళు తనని కొడుతున్నా కూడా.. నేనే కావాలని, నా కోసం ఏమైనా చేస్తానని నమ్మకం నాకు ఇచ్చాడు తను అర్థం చేసుకునే గుణం సతీష్‌లో నాకు బాగా నచ్చింది. నామీద చూపించే ప్రేమ చాలు, అదే మరే విషయంలోనైనా అర్థంచేసుకునేలా చేస్తుంది. అసలు తనలో నచ్చని విషయం అంటూ నాకు ఏదీ లేదు. ఎందుకంటే నేను ఏది చెప్పినా నా మాటకు విలువిస్తాడు.

6. మీ ఆవిడలో మీకు నచ్చే విషయం.. అలాగే నచ్చనిది?

తనలో నాకు నచ్చే విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతూ, చీదరించుకుంటున్నా కూడా భయపెట్టినా వాళ్ల బెదిరింపులకు లొంగకుండా పోలీసులకు ఫోన్ చేసి ధైర్యంగా నేనంటే ఇష్టం అని చెప్పింది. తన దైర్యం అంటే నాకు చాలా ఇష్టం. ఎంత కష్టమైనా, ఇష్టంగా భావించి ఆ కష్టాలలో తోడుంటుంది.

శత్రువులైనా ఆపదలో ఉన్నారంటే జాలి చూపించే దయా గుణం చూపిస్తాం. అలాంటిది కన్నబిడ్డకు కోరుకున్న జీవితాన్ని ఇవ్వడానికి పెద్దవాళ్ళు పెట్టిన హింస మాటల్లో చెప్పలేనిది. నేను వాళ్ళ బిడ్డను పోషించగలనో లేనో అని చూసి ఉంటే ఎంత బాధపెట్టినా తీసుకునేవాడినేమో.. కానీ కులాల పట్టింపులతో రాక్షసంగా ప్రవర్తించడాన్ని ఎప్పటికీ జీర్ణించుకోలేను. తల్లితండ్రులుగా బిడ్డల్ని అర్థం చేసుకోవడం రాని తల్లిదండ్రులుగా వాళ్ళు మా ప్రేమకథలో శత్రువులుగానే మిగిలిపోతారు. నిజానికి పుట్టుకనిచ్చినవాళ్ళు ఎలా బిడ్డలపట్ల ప్రవర్తించకూడదో చెప్పేందుకు మా పెద్దలే రుజువు. ఎన్ని కష్టాలు పడినా నన్ను నమ్మి వచ్చిన తనులో లోపాలను వెతకలేను.. నాకు తనలో ఒక్కలోపం కనిపించినా మా ప్రేమను అవమానించినట్టే, తనలో నాకు నచ్చని దంటు ఏమీ లేదు.

7. కలలు గన్న జీవితాన్ని అందుకున్నారు, మరి కన్నవాళ్ళ ప్రేమను అందుకున్నారా?

కలలు కన్న జీవితం అయితే అందుకున్నాము మాకు ఒక బాబు కూడా, ఇంకా మా ఇంట్లో ఇరువైపులా కులాలు అడ్డుగోడలు మాత్రం తొలిగిపోవటం లేదు. కులం వల్ల అమ్మాయిని చిన్న చూపు చూడడం అబ్బాయికి ఆస్తి లేదని అమ్మాయి ఇంట్లో విలువ ఇవ్వకపోవడం. ఇవన్నీ ఎప్పటికి తొలగిపోతాయో తెలీదు. కానీ నా బిడ్డకు కులం అనే గోడలు అడ్డుకాకూడదని మాత్రం కోరుకుంటాను.

8. భవిష్యత్ ఎలా ఉండాలని ప్లాన్ చేసుకున్నారు? పెద్దల ఆలోచనలో మార్పు ఏదైనా ఆశిస్తున్నారా?

ఉన్నన్ని రోజులు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని, ఉన్నదాంట్లో సర్దుకుంటూ ఇలాగే జీవితం గడపాలని కోరుకుంటున్నాం. ఎవరైనా ఆపదలో ఉంటే మాకు తోచినంత సహాయం చేస్తాం. మా బాబుని కులమతాలు బేధాలు లేకుండా పెంచాలనుకున్నాం. మా ప్రేమకు ప్రతిరూపం వాడు. మనిషికి బ్రతకటానికి కావలసింది తినటానికి ఆహారం మాత్రమే., కులం కూడుపెట్టుదు. ఒంట్లో ప్రవహించే రక్తం అన్ని కులాలకూ ఒకే రంగిచ్చాడు దేవుడు. ఆపదలో ఉంటే కులం అడిగి రక్తం ఇస్తామా..? సహాయం చేయాలనే గుణం కావాలికానీ.. కులం అనే అడ్డుగోడలు ఎందుకు? ఈ కులం అనేది శాశ్వతంగా పోవాలి. కుల హత్యలు ఎక్కడా జరగకూడదని, మనుషులంతా ఒకటే అనే భావం అందరిలో ఉండాలని మాత్రం కోరుకుంటాం.. మాతో పాటు సమాజంలో ఉన్న అందరూ ఇది గుర్తించాలని ఆశిస్తున్నాము.

ప్రతి తల్లిదండ్రులు ప్రేమ అనగానే కులం కాదని ఆస్తి లేదని ఆలోచిస్తారు అలా ఆలోచించకుండా వారిద్దరూ వారి జీవితంలో సంతోషంగా అర్థం చేసుకొని ఉండగలుగుతారా లేదా అని ఆలోచించాలి. వారిని అర్థం చేసుకుని అండగా నిలబడాలని మాత్రం ఆశిస్తున్నాం.

-శ్రీశాంతి మెహెర్

Updated Date - 2023-02-10T15:06:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising