Valentine Week 2023: పంజాబ్ సింహాన్నే ప్రేమలో పడేసిన డాన్సర్..!
ABN, First Publish Date - 2023-02-13T15:56:43+05:30
ప్రేమలో పడినందుకు రాజును శిక్షించాలని ఆలోచించిన ప్రజలు ఉండటం ఇదే ప్రధమం కాబోలు.
ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు పుడుతుందో చెప్పడం కష్టం. ఇప్పటి కాలంలోనే కాదు. రాజుల కాలంలోనూ ఈ ప్రేమ పుట్టేందుకు ఆమె అందంగా, రూపవతి అయితే సరిపోయేది. కాకపోతే అమ్మాయి మనసు దోచుకోవాలంటే గిఫ్ట్స్ ఇచ్చినట్టుగానే, అప్పటి రోజుల్లో భవంతులు, కోటలు కట్టేవారు రాణి పేరున. అంతేనా తమ పట్టపురాణిని చేసుకుని, రాణివాసంలో చోటిచ్చేసేవాడు రాజు. రాజుకి నచ్చడం అనే ఒక్క విషయంతో రాణి అయిపోయేది ఆ చక్కనమ్మ.. ఇలా మన చరిత్ర తవ్వుతున్న కొద్దీ బోలెడు ప్రేమకథలు, వాటికి సాక్ష్యాలుగా మిగిలిన కోటలు కోకొల్లలు. ప్రేమికులరోజు సందర్భంగా రాజా రంజిత్ సింగ్, కంజారి ప్రేమకథలోకి వెళితే..
అమృత్సర్, పంజాబ్ అంతటా మహారాజా రంజిత్ సింగ్ వీర, విజయాలు, అతని దైర్యం గురించి కథలు కథలుగా వింటాం. ఈ రాజు షేర్ - ఇ - పంజాబ్ అని ప్రసిద్ధి చెందాడు. అంటే పంజాబ్ సింహం అని అర్థం. పసి వయసులో సోకిన ఆటలమ్మ ( స్మాల్ పాక్స్ ) కారణంగా ఎడమ కంటి చూపుని కోల్పోయాడు. కానీ దైర్య సాహసాలతో, పరాక్రమంతో పంజాబ్‌కు రాజయ్యాడు. అప్పటి కాలంలో రాజా రంజిత్ సింగ్, అతని సైన్యం చాలా శక్తివంతమైందనే పేరుండేది. ఈ పరాక్రమం వల్లనే ఈరాజు చనిపోయేంత వరకూ అతని కోటపై, అతని రాజ్యంపై బ్రిటీష్ వారుగానీ, ముస్లిం ఆక్రమణదారులుగానీ దాడి చేయలేకపోయారు. పంజాబ్ లోని బంగారు ఆలయాన్ని నిర్మించడానికి తన ఖజానాలోని బంగారాన్నంతా రాజారంజిత్ సింగ్ దానం చేసాడు. ఇక రాజా సింగ్, పుల్ కంజారి ప్రేమకు సాక్ష్యంగా నిలిచిన పుల్ మోరన్ మహల్ గోడలకు వీరి ప్రేమకథ బాగా తెలుసు. మహారాజా రంజిత్ సింగ్‌కు దాదాపు ఇరవైమంది భార్యలు ఉన్నారు. అయితే అతని చాలా ప్రేమకథల్లో మోరన్ ఉన్న ప్రేమ బంధాన్నే ముఖ్యంగా ప్రత్యేకంగా చెపుతారు.
ఈ ప్రేమకథ ఎక్కడ ఎప్పుడు ప్రారంభమైంది..
మహారాజా రంజిత్ సింగ్ తరచుగా లాహోర్, అమృత్ సర్ మధ్య వాణిజ్యం, పరిపాలనా అవసరాల కోసం ప్రయాణించేవారు. అలాంటి ప్రయాణాల కోసం అతను మార్గమధ్యంలో నిర్మించుకున్న విశ్రాంతి గృహం ముందు ఆగాడు. అదే గ్రామం దేవదాసి కుటుంబానికి చెందిన మోరన్ సర్కార్ నృత్యాన్ని చూసి మోహించాడు. మోరన్ అద్భత నాట్యకారిణిగా పేరుపొందింది. ఒక రోజు రంజిత్ సింగ్ ముందు నాట్యం చేయడానికి బయలుదేరిన వెళుతుంటే ఆమె కాలి పాదరక్ష జారి కాలువలో పడిపోయింది. ఆ వెండి స్లిప్పర్ గురించి వెతికినా అది కొట్టుకుపోయింది. చెప్పులు లేని కాళ్ళతోనే దర్బారుకు చేరుకున్న మోరన్ నృత్యం చేయడానికి నిరాకరించింది.
అప్పటికే మోరన్‌ను ప్రేమిస్తున్న రాజా రంజిత్ సింగ్ ఆమెకు కలిగిన అసౌకర్యాన్ని గుర్తించి కాలువ ప్రదేశంలో 'పుల్ కంజారి' అనే పేరుతో వంతెనను నిర్మించాడు. పుల్ అంటే వంతెన అని అర్థం. రాజు ప్రేమను అర్థం చేసుకున్న మోరన్ అతనితో పెళ్ళికి అంగీకరించింది. అయితే మోరన్ ముస్లిం అమ్మాయి, ఈ విషయంలో మిగతా భార్యలకు, అతని సైన్యం, రాజ్య ప్రజలు అభ్యంతరంగా భావించారు. సిక్కుకాని అమ్మాయిని ప్రేమించినందుకు, పెళ్ళాడాలని చూస్తున్నందుకు అఖల్ తఖ్త్ అధిపతి, రాజును కొరడాలతో కొట్టి శిక్షించాలని తీర్మానించింది. దానికి రాజు వారికి క్షమాపణలు చెప్పాడు. మోరాన్ ప్రేమను మరిచిపోలేదు రంజిత్ సింగ్, ఆమె పేరు మీద నాణేలను ముద్రించాడు. ఆమె గుర్తుగా మసీదును కూడా నిర్మించాడు. ప్రేమలో పడినందుకు రాజును శిక్షించాలని ఆలోచించిన ప్రజలు ఉండటం ఇదే ప్రధమం కాబోలు.
నిజానికి పుల్ కంజారి అంటే నాట్యగత్తె అనే అర్థం కూడా ఉంది. అయితే అప్పటి ప్రజలు దీనిని అవమానంగా భావించి పుల్ మోరన్ అనే పేరుగా మార్చారు. పాకిస్థాన్ సరిహద్దు పుల్ మోరన్‌కు దగ్గరగా ఉంది. అందువల్ల విభజన సమయంలో ప్రజలు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళారు. అయితే దాని చుట్టుపక్కల ఇంకా కొందరు రైతులు ఉంటున్నారు. 1965, 71 మధ్యలో జరిగిన పాకిస్థాన్ యుద్ధంలో పుల్ కంజారీని ఆక్రమించింది. ప్రేమికులు కాలగర్భంలో కలిసిపోయినా వారి చిహ్నాలు ఇంకా మన కాలంతో కలిసి ప్రయాణిస్తున్నాయి.
Updated Date - 2023-02-13T16:07:15+05:30 IST