Valentines' day: ఇప్పుడంతా మ్యాగీ చేసినంత ఫాస్ట్‌గా జరిగిపోవాలి...!
ABN, First Publish Date - 2023-02-14T13:22:52+05:30
స్కూల్ వయసులో పుట్టిన నా ప్రేమను ఆరేళ్ళు చదువుకోసం వాయిదా వేసాను.
స్కూల్ వయసు ప్రేమను దక్కించుకుందుకు, కష్టపడి చదువు పూర్తి చేసేవరకూ ఓపికపట్టిందామే, ఆమెను ప్రేమించినందుకు, ఆమె ప్రేమను పొందేందుకు అతను కూడా ఏదో ఉపాధి పొందాలని కష్టపడ్డాడు. ఇద్దరి మనసులు కలిసాకా, జీవితానికి కావలసిన ఆర్థికభరోసాను సాధించుకున్నారు. చులకనగా చూసే జనాలకు, బంధువులకు జీవితంలో నిలబడి, గెలిచి చూపించారీ జంట.. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆంధ్రజ్యోతి వెబ్ అందిస్తున్న మంజుల, రాజ్ కుమార్‌ల ప్రేమకథ ఇది.
ఈ వయసులో ప్రేమేంటి? ఏమంత పెద్దదానివైపోయావని, వాణ్ణి చూసావా? ఎలా ఉన్నాడో, జీవితంలో నిలదొక్కుకోవాలన్న ఆశలేదు. జులాయిలా తిరుగుతున్నాడు. పైగా దానికి ప్రేమనే పేరు పెట్టి నిన్ను కూడా వేసుకుని తిరుగుదామని చూస్తున్నాడేమో.. తిన్నగా స్కూల్ కెళ్ళు, నీ చదువు నువ్వు చదువుకో. లేదంటే మాతో పాటు పనికిరా..!
ఇదిగో ఇంట్లో ఇలా ఉండేది రాజ్ కుమార్ గురించి నా ప్రేమ విషయం తెలిసాకా.. మా ఇంట్లో పరిస్థితి. అంటే మేమంత ఉన్నవాళ్ళ ఏం కాదు. మామూలు మిడిల్ క్లాస్ కంటే కింద. నాపేరు మంజుల, మాది కరీంనగర్ జిల్లా మండలం, హుస్నాబాద్. సైకిల్ మీద వెళ్ళి జెడ్పీహెచ్ స్కూల్‌లో పదోతరగతి పూర్తి చేసాను. కనీసం బస్ సౌకర్యం లేని మా ఊరికి నాలా సైకిల్ మీద చదువుకోడానికి వెళ్ళే పిల్లలు ఎందరో. ఉదయం ఎనిమిది కిలోమీటర్లు, సాయంత్రం ఎనిమిది కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుని వెళ్ళి వచ్చేదాన్ని. చదువంటే ఉన్న ఇష్టం వల్ల కష్టమైనా తప్పేది కాదు.
ఈ క్రమంలోనే రాజ్ కుమార్‌తో పరిచయం అయింది. అతను బయటివాడేం కాదు, మా మేనత్త వాళ్ళు అతన్ని దత్తత తీసుకుని పెంచుకున్నారు. చిన్నతనం నుంచి తనతో పరిచయం, స్నేహం రెండూ ఉన్నాయి. మా అన్నయ్యతో రాజ్ కుమార్ తరచుగా మా ఇంటికి వచ్చి, పోతూ ఉండేవాడు. తను నాతో సరదాగా మాట్లాడేవాడు. తను నన్ను ఇష్టపడుతున్న విషయం నాకు తెలీదు. మా మేనత్తవాళ్ళే నన్ను రాజ్ కుమార్ ఇష్టపడుతున్న సంగతి చెప్పారు. అయితే అప్పటికి నేను స్కూల్ చదువులోనే ఉన్నాను. నాకు టైం కావాలని చెప్పాను. కొన్నిరోజులకి ఒప్పుకున్నాను. తనింట్లో ప్రేమ, పెళ్ళి విషయంలో అడ్డుచెప్పలేదు. కానీ మా ఇంట్లో చాలా అడ్డు పెట్టారు.
ఆడపిల్లలు ప్రేమించామని ఇంట్లో వాళ్ళకు చెప్పి ఒప్పించేయగలమని అనుకుంటారు. కానీ వాస్తవంలోకి వస్తే అది సాధ్యం కాదు. ప్రేమించుకున్నంత మాత్రంలోనే వెంటనే మాపెళ్లి కాలేదు. ఒక ఆరేళ్ళు ఇబ్బంది పడ్డాం. 2005 నుంచి మా ప్రేమలో పడిన కష్టాలు మాటల్లో చెప్పలేనివి. మొత్తానికి మా ఇష్టాన్ని అంగీకరించి 2010లో ఇద్దరి కుటుంబంలోని పెద్దలూ దగ్గరుండి మా పెళ్ళి చేసారు. అయితే మా మీద నమ్మకం రావడానికి మాత్రం కాస్త సమయం పట్టింది. మా పెద్దవాళ్లకు మేం జీవితంలో నిలబడగలమా లేదా అనేది నమ్మకం లేదు. ఇప్పుడు అందరం హ్యాపీగానే ఉన్నాం. ఇప్పుడు మాకు ఇద్దరు బాబులు. పెద్దవాడు రేవీంద్ర, ఏడో తరగతి, చిన్నవాడు వీరేంద్ర రెండో తరగతి చదువుతున్నారు.
మా ఆయన రాజ్ కుమార్ ఓ బిజినెస్‌లో కుదురుకున్నారు. నేను ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాను. మా ప్రేమకథలో పెద్దలు సపోర్ట్ దొరకడం అదృష్టమైంది. కాకపోతే కాస్త సమయం పట్టింది. ఓపికపట్టాం. వాళ్ళు దగ్గరకు తీసుకునేవరకూ ఏ బాదైనా మేం మా మనసుల్లోనే పడ్డాం. ఇప్పటి ప్రేమికుల గురించి నేనేం చెప్పలేను. ఎందుకంటే వాళ్ళది ప్రేమో కాదో వాళ్ళకే తెలీదు. స్కూల్ వయసులో పుట్టిన నా ప్రేమను ఆరేళ్ళు చదువుకోసం వాయిదా వేసాను. కానీ ఇప్పటి ప్రేమికులకు అంత సహనం ఉందనుకోను. ఇప్పుడంతా మ్యాగీ చేసినంత త్వరగా జరిగిపోవాలి.
Updated Date - 2023-02-14T13:27:55+05:30 IST