Petrol Bunk: బాబోయ్.. ఇదేం వింత..? అయిదో అంతస్తులో పెట్రోల్ బంక్.. అంతపైకి ఎలా వెళ్తారంటూ నెట్టింట సెటైర్లు..!
ABN, First Publish Date - 2023-09-09T21:26:11+05:30
చైనాలోని ఓ భవనం ఐదో అంతస్తుపై పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. చైనా వారి క్రియేటివిటీకి అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఏర్పాట్లతో ప్రమాదాలు కూడా ఉంటాయని కొందరు పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పెట్రోల్ బంకులను సాధారణంగా నేలమీద ఏర్పాటు చేస్తారు. కానీ అయిదో అంతస్తులో పెట్రోల్ బంక్ ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా? లేదు కదూ! కానీ చైనాలో సరిగ్గా ఓ భవనం ఐదో అంతస్తులో పెట్రోల్ బంక్ నిర్మించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే, ఇలా అన్ని అంతస్తులపైన పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. వీడియో చూడగానే చాలా మందికి అసలు విషయం అర్థం కాలేదు. దీంతో, కొన్ని సెటైర్లు కూడా పేలాయి.
చైనాలోని(China) ఓ కొండ ప్రాంతంలో ఘాట్ రోడ్లు ఉన్నాయి. అక్కడే పెద్దపెద్ద అపార్ట్‌మెంటులు కూడా ఉన్నాయి. అక్కడ సీన్ ఎలా ఉందంటే తక్కువ ఎత్తులో ఉన్న భవనం చివరి అంతస్తు పక్కనే ఘాటు రోడ్డు వెళ్లేలా నిర్మాణాలు జరిపారు. మరి అలాంటి చోట పెట్రోల్ బంకుల కోసం ప్రత్యేకంగా స్థలం దొరకదు కాబట్టి భవనంపైనే దాన్ని ఏర్పాటు చేశారు(Petrol Pump on fifth floor). భవనం పైఅంతస్తుకు పక్కనే ఉన్న ఘాట్ రోడ్డులోని వాహనాలు ఇంధనం నింపుకునేందుకు ఆగుతున్నాయి. ఇందుకు వీలుగా భవనం పైఅంతస్తును రోడ్డుతో అనుసంధానం చేశారు. అంతేకాదు..భనవం మధ్య నుంచి వాహనాలు వెళ్లేలా కూడా రోడ్డు నిర్మించారు. ఇదంతా చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చైనా వాళ్ల క్రియేటివిటీ పీక్స్‌లో ఉందంటూ అనేక మంది కామెంట్ చేశారు.
అయితే, కొందరు నెటిజన్లకు ఈ ఏర్పాటు ప్రమాదకరంగా కూడా తోచింది. భనవం పై అంతస్తులో ఉన్న పెట్రోల్ బంక్‌లో ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే అగ్నికీలలు క్షణాల్లో భవంతి అంతా వ్యాపించొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఇది నెత్తి మీద పెద్ద బాంబు పెట్టుకున్నట్టు ఉందని ఇంకొందరు అన్నారు. అయితే, చైనా వారు ముందుజాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటి ఏర్పాట్లు చేసుకుని ఉండరని కొందరు వ్యాఖ్యానించారు. నెటిజన్లను ఇంతగా ఆశ్చర్యపరుస్తున్న ఈ వీడియోపై(Viral Video) మీరూ ఓ లుక్కేయండి మరి.
Updated Date - 2023-09-09T21:27:14+05:30 IST