Vijayashanthi: థియేటర్లలో తినుబండారాలు.. నాడు లేని నిర్బంధం ఇప్పుడెందుకు?
ABN, First Publish Date - 2023-01-10T23:11:41+05:30
సినిమా హాల్స్‌లోకి తినుబండారాల అనుమతిపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) దుయ్యబట్టారు. థియేటర్లలోకి బయటి నుంచి..
సినిమా హాల్స్‌లోకి తినుబండారాల అనుమతిపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) దుయ్యబట్టారు. థియేటర్లలోకి బయటి నుంచి ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకురాకుండా అడ్డుకునే హక్కు.. హాళ్లు, మల్టీప్లెక్స్ యజమానులకు ఉందంటూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. ‘బయటి తినుబండారాలు థియేటర్‌లోకి అనుమతించొద్దు... సరే, ఇంటర్వెల్‌లో థియేటర్ బయట కొనుక్కుంటే అభ్యంతరం ఏమిటి?’ అని రాములమ్మ ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె సుప్రీం తీర్పుపై ఓ సుధీర్ఘ పోస్ట్ చేశారు. అందులో..
‘‘తినుబండారాలకు, తాగే శీతల పానీయాలకు, ప్యాకింగ్ మార్పుల వల్ల థియేటర్స్‌లో ఎమ్మార్పీ ఉండదు. అది వారి నియంతృత్వం కాబట్టి.
బయట తినుబండారాలు థియేటర్‌లోకి అనుమతించొద్దు... ఇది చట్టం కాబట్టి.
సరే, ఇంటర్వెల్‌లో థియేటర్ బయట కొనుక్కుంటే అభ్యంతరం ఏమిటి?
పేద, మధ్య తరగతి బిడ్డలు, థియేటర్ లోపలి భారీ ధరల్ని ఎందుకు భరించి తీరాలి?
లోనికి పదార్థాలు తేవద్దు ఓకే, మరి బయటకు వెళ్లి తినడానికి నిర్బంధం ఏమిటి?
ఏ 5స్టార్ హొటల్ అయినా బయటి ఆహారం తేవద్దని అంటుందేమో కానీ, దర్వాజాలు మూస్తాం... బయటకు వెళ్లరాదు అని అంటదా?
ఇంటర్వెల్ సమయంలో అన్ని సినిమా హాళ్లలోనూ, మల్టీప్లెక్స్‌లలోను, సినిమాలు ప్రదర్శించే మాల్స్‌లోను ప్రేక్షకులు బయటకొచ్చేందుకు అనుమతి ఇయ్యాల్సిందే...
ఆ మాటకొస్తే, కెఎఫ్‌సి, కోక్ లాంటి విదేశీ వస్తు ఉత్పత్తులు మాత్రమే అమ్మే థియేటర్ లోపటి స్టాల్స్ నుండి... మన స్థానిక దేశీయ, చిన్నస్థాయి అమ్మకాలు థియేటర్ బయట చేసే సంప్రదాయ వ్యాపార సముదాయాలకు అవకాశం ఎందుకివ్వరు?
పూర్వంలాగా మన సినిమా థియేటర్‌లలో ఇంటర్వెల్‌కు హాలు ప్రాంగణం నుంచి బయటకు వచ్చే పరిస్థితి కల్పించాలి. నాడు లేని నిర్బంధం ఇప్పుడెందుకు?
ఇంటర్వెల్‌లో ప్రేక్షకులు బయట ఆహారం కొన్నట్లయితే... వారి చేతుల అశుభ్రత సీట్లకు అంటుకుంటుందని భావిస్తే... మరి సినిమా ప్రారంభానికి ముందు థియేటర్‌లోకి వచ్చేవారు బయట తిన్న పదార్థాలకు, చేతులకు ఏమైనా స్కానింగ్ చేస్తున్నారా?
ఇది నిస్సందేహంగా పేద, మధ్యతరగతి ప్రజల హక్కులను హరించడం మాత్రమే...
అసలు ఈ థియేటర్లలో అడ్మిషన్ టికెట్స్ రేట్లను ఇష్టానుసారంగా పెంచుకోవడానికి ప్రభుత్వాలు ఇస్తున్న అనుమతులే సామాన్య ప్రేక్షకులకు, కుటుంబాలకు మోయలేని భారం. దానిపైన ఈ క్యాంటీన్ రేట్లు అపరిమిత దుర్మార్గం.
ఇట్లే నడిస్తే, వీటిపై సగటు ప్రజల, సామాన్య ప్రేక్షకుల ఉద్యమం త్వరలోనే తప్పదేమో...
జై శ్రీరామ్
భారతమాతకి జై
విజయశాంతి’’ అంటూ.. సినిమా టికెట్ల ధరలతోనే కాకుండా.. తినుబండారాల విషయంలో కూడా సామాన్య ప్రేక్షకులపై భారం మోపుతున్నారని రాములమ్మ (Ramulamma) ధ్వజమెత్తారు. (Vijayashanthi Post on Supreme Court Judgment)
Updated Date - 2023-01-10T23:25:17+05:30 IST