Picture Goes Viral: కాలినడకన స్విగ్గీ ఆర్డర్ డెలివరీలు.. వైరల్‌గా మారిన మహిళ ఫొటో.. అసలు విషయం ఏంటంటే..
ABN, First Publish Date - 2023-01-18T11:30:57+05:30
కాలినడకన స్విగ్గీ ఆర్డర్ డెలివరీలు చేస్తున్న మహిళ అంటూ ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Viral News: కాలినడకన స్విగ్గీ ఆర్డర్ డెలివరీలు చేస్తున్న మహిళ అంటూ ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫొటోలో ఆమె బుర్ఖా వేసుకుని వీపు వెనుక స్విగ్గీ బ్యాగుతో ఉండడం మనం చూడొచ్చు. దాంతో అందరూ ఆమె కాలినడకన స్విగ్గీ ఆర్డర్స్ డెలివరీ చేస్తుందని అనుకున్నారు. దీంతో ఈ ఫొటో క్షణాల వ్యవధిలోనే సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. కానీ, ఆ ఫొటోకు సంబంధించిన అసలు విషయం మాత్రం వేరే ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం అలా స్విగ్గీ బ్యాగుతో డోర్ టూ డోర్ డెలివరీలు చేస్తున్న మహిళ పేరు రిజ్వానా. ఆమెది లక్నో. ఆ స్విగ్గీ పేరుతో ఉన్న బ్యాగులో ఆమె డిస్పోసల్ గూడ్స్‌ను వీధులకు వెళ్లి ఇంటింటికి డెలివరీలు చేస్తుంది. అయితే, ఆమె స్విగ్గీలో పని చేయడం లేదు. కేవలం ఆ పేరుతో ఉన్న బ్యాగులో మాత్రమే అలా డిస్పోసల్ గూడ్స్‌ను తీసుకొచ్చి డోర్ టూ డోర్ తిరుగుతూ అమ్ముకుంటుంది.
ఆమెకు ఇంతకుముందు ఈ పని కోసం వేరే బ్యాగు ఒకటి ఉండేదట. కానీ, అది చిరిగిపోవడంతో ఇటీవలే ఈ స్విగ్గీ స్టిక్కర్స్‌తో ఉన్న కొత్త బ్యాగును రూ.50కి కొనుగోలు చేసిందట. అందులోనే ఇప్పుడు ఇలా డిస్పోసల్ గూడ్స్‌ను పెట్టుకుని తాను నివాసం ఉండే ప్రాంతంలోని చిన్న దుకాణాలు, ఇళ్లకు విక్రయించడం చేస్తుంది. ఇక ఫొటో వైరల్ కావడంతో ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఆమెను కలిసింది. ఆ సమయంలో రిజ్వానా ఈ విషయాలను వెల్లడించింది. డైలీ 6 నుంచి 7 కిలోమీటర్లు నడిచి ఇలా డెలివరీలు చేస్తున్నట్లు తెలిపింది. అలా రోజంతా కష్టపడితే తనకు మిగిలేది రూ. 60-70లు అని చెప్పింది. అంతేగాక తన వ్యక్తిగత విషయాలను కూడా ఈ సందర్భంగా ఆమె న్యూస్ ఏజెన్సీతో పంచుకుంది. తనకు నలుగురు పిల్లలని, భర్త మూడేళ్ల కింద వదిలేయడంతో వారిని తానే ఒంటరిగా పెంచి పోషిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
Updated Date - 2023-01-18T11:36:39+05:30 IST