WPL RCB vs Delhi : బెంగళూరు ఐదోస్సారి..
ABN, First Publish Date - 2023-03-14T04:46:23+05:30
మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిన స్మృతి మంధాన సేన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకొంది.
మళ్లీ ఓడిన మంధాన సేన
6 వికెట్లతో ఢిల్లీ గెలుపు
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిన స్మృతి మంధాన సేన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకొంది. ఒత్తిడి నెలకొన్న సమయంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జొనాసెన్ (15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 29 నాటౌట్) దూకుడుగా ఆడడంతో.. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 150/4 స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు 14 ఓవర్లలో 68/3 స్కోరు మాత్రమే చేసింది. ఈ దశలో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొన్న ఎలీస్ పెర్రీ (52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67 నాటౌట్), రిచా ఘోష్ (16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ 4వ వికెట్‌కు 74 పరుగులు చేయడంతో.. టీమ్ పోరాడగలిగే స్కోరు చేయగలింది. శిఖ 3 వికెట్లు పడగొట్టింది. ఛేదనలో ఢిల్లీ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (0), మెగ్ లానింగ్ (15) విఫలమైనా.. క్యాప్సీ (24 బంతుల్లో 8 ఫోర్లతో 38), జెమీమా (32) జట్టును మ్యాచ్‌లో నిలిపారు. ఓ దశలో ఉత్కంఠ నెలకొన్నా.. మరిజానె కాప్ (32 నాటౌట్), జొనాసెన్ ఐదో వికెట్‌కు 45 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఢిల్లీని గెలిపించారు.
సంక్షిప్త స్కోర్లు: బెంగళూరు: 20 ఓవర్లలో 150/4 (పెర్రీ 67 నాటౌట్, రిచా 37; శిఖ 3/23);
ఢిల్లీ: 19.4 ఓవర్లలో 154/4 (క్యాప్సీ 38, జెమీమా 32; శోభన 2/27).
Updated Date - 2023-03-14T04:46:28+05:30 IST