IPL 2023 RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. ఈ కీలక పేసర్ అందుబాటులో లేనట్టే!
ABN, First Publish Date - 2023-02-23T21:05:18+05:30
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టుకు ఉన్న పాపులారిటీ వేరు. 16వ సీజన్ కోసం ఆ జట్టు ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండగా ఆర్సీబీ ఇప్పుడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) గాయం కారణంగా ఇప్పటికే జట్టుకు దూరం కాగా, ఇప్పుడా జట్టు కీలక పేసర్ జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood) కూడా గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసే హేజిల్‌వుడ్ జట్టుకు దూరం కావడం పెద్ద దెబ్బేనని అంటున్నారు. నిజానికి ఆ జట్టుకు అతడో పెద్ద ఆస్తిగానే చెప్పొచ్చు. 2022 ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టాడు. వనిందు హసరంగ(Wanindu Hasaranga) తర్వాత జట్టులో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా రికార్డులకెక్కాడు. పవర్ ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేయగలడు కూడా. ఓవర్‌కు ఏడు పరుగుల కంటే తక్కువ ఇస్తుంటాడు. అంతేకాదు, పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన ఘనత కూడా అతడికే సొంతం.
అలాంటి కీలక బౌలర్ కొన్ని మ్యాచ్‌లకు దూరం కాబోతున్నాడన్న వార్త ఆ జట్టును కలవరపెడుతోంది. ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో జరిగే తొలి మ్యాచ్ నాటికి కోలుకోవాలని ఆశిస్తోంది. అయితే, అది జరిగేనా? అన్నది అనుమానమే. కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కూడా జోష్ హేజిల్‌వుడ్ దూరమయ్యాడు.
Updated Date - 2023-02-23T21:05:20+05:30 IST