IPL PK vs RR : రాయల్స్‌పై పంజా
ABN, First Publish Date - 2023-04-06T01:13:45+05:30
ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో రాణించిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
గువాహటి: ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో రాణించిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శిఖర్ ధవన్ (56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86 నాటౌట్), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) అదరగొట్టగా.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ నాథన్ ఎలిస్ (4/30) నాలుగు వికెట్లతో వెన్ను విరవడంతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 197 పరుగులు చేసింది. హోల్డర్ 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో రాజస్థాన్ ఓవర్లన్నీ ఆడి 192/7 స్కోరుకే పరిమితమైంది. సంజూ శాంసన్ (42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెట్‌మయర్ (18 బంతుల్లో 36), రఽధువ్ జురెల్ (15 బంతుల్లో 32 నాటౌట్) ఏడో వికెట్‌కు 26 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యంతో ఆశలు రేపారు. అయితే, చివరి 6 బంతుల్లో విజయానికి 16 పరుగులు కావాల్సి ఉండగా.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య అద్భుతంగా బౌలింగ్ చేసిన కర్రాన్ 10 పరుగులు మాత్రమే ఇచ్చి కింగ్స్‌ను గెలిపించాడు. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
భయపెట్టిన జురెల్, హెట్‌మయర్: ఛేదనలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (11), అశ్విన్ (0)ను అర్ష్‌దీప్ ఆరంభంలోనే అవుట్ చేసి దెబ్బకొట్టాడు. కానీ, బట్లర్ (19), శాంసన్ మూడో వికెట్‌కు 31 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. సిక్స్‌తో ఖాతా తెరిచిన శాంసన్.. ఆ తర్వాత ఎడాపెడా బౌండ్రీలతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. కాగా, 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జీవనదానం లభించినా.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఎలిస్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచిచ్చి బట్లర్ వెనుదిరిగాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి రాయల్స్ 57/3తో నిలిచింది. కానీ, ఆ తర్వాతి 5 ఓవర్లు పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ బౌండ్రీలను అరికట్టడంతో శాంసన్, పడిక్కళ్ (21) ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలో ఎలిస్ బౌలింగ్‌లో అనవసర షాట్‌తో శాంసన్ వికెట్ పారేసుకోవడంతో.. రాయల్స్ కష్టాల్లో పడింది. కాగా, 15వ ఓవర్‌లో దూకుడుగా ఆడుతున్న రియాన్ పరాగ్ (20), పడిక్కళ్‌ను ఎలిస్ అవుట్ చేయడంతో ఓటమి లాంఛనమే అనిపించింది. కానీ, చాహల్ బదులు సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన జురెల్, హెట్‌మయర్ ఎదురుదాడి చేస్తూ ఆశలు రేపారు. చివరి 3 ఓవర్లలో 53 పరుగులు కావాల్సి ఉండగా.. 18వ ఓవర్‌లో 19 పరుగులు, ఆ తర్వాతి ఓవర్‌లో 18 రన్స్ రాబట్టడంతో.. లక్ష్యం ఆఖరి ఓవర్‌లో 16 పరుగులకు దిగివచ్చింది. కానీ, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కర్రాన్ రాజస్థాన్ గెలుపును అడ్డుకొన్నాడు. జురెల్ వారిస్తున్నా...లేని పరుగుకోసం పరిగెత్తి హెట్‌మయర్ రనౌటయ్యాడు. ఇక చివరి 2 బంతుల్లో 11రన్స్ చేయాల్సిన దశలో స్ట్రయికింగ్‌కు వచ్చిన హోల్డర్ ఐదో బంతికి కేవలం ఒకే పరుగు చేశాడు. దీంతో ఆరో బంతికి జురెల్ బౌండ్రీ కొట్టినా ఫలితం లేకపోయింది.
చెలరేగిన ధవన్, సిమ్రన్: ప్రభ్‌సిమ్రన్ మెరుపులు.. కెప్టెన్ శిఖర్ ధవన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో పంజాబ్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్ సిమ్రన్ ధనాధన్ ఆరంభాన్నివ్వడంతో.. పవర్‌ప్లేలో స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ధవన్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ.. తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేశాడు. రెండో ఓవర్‌లోనే సిక్స్ బాదిన సిమ్రన్.. ఆసిఫ్ వేసిన నాలుగో ఓవర్‌లో మూడు ఫోర్లు, సిక్స్‌తో 19 పరుగులు రాబట్టాడు. దీంతో ఆరు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ 63/0తో నిలిచింది. 28 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకొన్న సిమ్రన్.. 10వ ఓవర్‌లో హోల్డర్ బౌలింగ్‌లో బట్లర్ అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాజపక్స (1) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో ధవన్‌కు జత కలసిన జితేష్ (27) స్కోరు వేగం పెంచే ప్రయత్నం చేశాడు. చాహల్ వేసిన 12వ ఓవర్‌లో 4,4,6తో 18 పరుగులు పిండుకోగా.. జట్టు స్కోరు సెంచరీ మార్క్ దాటింది. మరోవైపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొన్న ధవన్ వరుస బౌండ్రీలతో గేర్ మార్చాడు. కాగా, భారీ షాట్ ఆడే క్రమంలో చాహల్ బౌలింగ్‌లో జితేష్ క్యాచవుట్ కావడంతో.. రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత సికందర్ రజా (1)ను అశ్విన్, షారుక్ ఖాన్ (11)ను హోల్డర్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు పంపారు. అయితే, ఆఖరి ఓవర్లో హోల్డర్ కేవలం ఏడు పరుగులే ఇవ్వడంతో పంజాబ్ స్కోరు డబుల్ సెంచరీ మార్క్‌కు కొద్ది దూరంలోనే నిలిచిపోయింది.
స్కోరుబోర్డు
పంజాబ్ కింగ్స్:
ప్రభ్‌సిమ్రన్ (సి) బట్లర్ (బి) హోల్డర్ 60, ధవన్ (నాటౌట్) 86, రాజపక్స (రిటైర్డ్ హర్ట్) 1, జితేశ్ (సి) పరాగ్ (బి) చాహల్ 27, సికందర్ (బి) అశ్విన్ 1, షారుక్ (సి) బట్లర్ (బి) హోల్డర్ 11, సామ్ కర్రాన్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 197/4; వికెట్ల పతనం: 1-90, 1-92 (రిటైర్డ్ హర్ట్), 2-158, 3-159, 4-196; బౌలింగ్: బౌల్ట్ 4-0-38-0, ఆసిఫ్ 4-0-54-0, అశ్విన్ 4-0-25-1, హోల్డర్ 4-0-29-2, చాహల్ 4-0-50-1.
రాజస్థాన్ రాయల్స్: జైస్వాల్ (సి/సబ్) షార్ట్ (బి) అర్ష్‌దీప్ 11, అశ్విన్ (సి) ధవన్ (బి) అర్ష్‌దీప్ 0, బట్లర్ (సి అండ్ బి) ఎలిస్ 19, సంజూ (సి/సబ్) షార్ట్ (బి) ఎలిస్ 42, పడిక్కళ్ (బి) ఎలిస్ 21, రియాన్ (సి) షారుక్ (బి) ఎలిస్ 20, హెట్‌మయెర్ (రనౌట్) 36, జురెల్ (నాటౌట్) 32, హోల్డర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 192/7; వికెట్ల పతనం: 1-13, 2-26, 3-57, 4-91, 5-121, 6-124, 7-186; బౌలింగ్: కర్రాన్ 4-0-44-0, అర్ష్‌దీప్ 4-0-47-2, హర్‌ప్రీత్ 2-0-15-0, ఎలిస్ 4-0-30-4, రాహుల్ చాహర్ 4-0-31-0, సికందర్ 2-0-24-0.
Updated Date - 2023-04-06T12:17:44+05:30 IST