Babar Azam: బాబర్ ఆజమ్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీకి గుడ్‌బై
ABN, First Publish Date - 2023-11-15T19:48:15+05:30
పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వరల్డ్‌కప్ 2023 టోర్నీలో కెప్టెన్‌గా, ఆటగాడిగా ఘోరంగా విఫలం కావడంతో.. కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను కెప్టెన్‌గా రాజీనామా చేస్తున్నానని ప్రకటించాడు.
Babar Azam: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వరల్డ్‌కప్ 2023 టోర్నీలో కెప్టెన్‌గా, ఆటగాడిగా ఘోరంగా విఫలం కావడంతో.. కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను కెప్టెన్‌గా రాజీనామా చేస్తున్నానని ప్రకటించాడు. ఇది చాలా కష్టమైన నిర్ణయమని, అయితే కెప్టెన్సీకి రాజీనామా చేయడం ఇదే సరైన నిర్ణయమని ఎమోషనల్ అయ్యాడు. ఒక ఆటగాడిగా జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తానని, తన అనుభవంతో కొత్త కెప్టెన్‌కి పూర్తి మద్దతు ఇస్తానని చెప్పుకొచ్చాడు.
‘‘నేను అన్ని ఫార్మాట్లలోనూ (టీ20, వన్డే, టెస్టు) పాకిస్థాన్ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం. కానీ, ఈ పిలుపుకు ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను. కెప్టెన్‌గా తప్పకున్నా.. ఒక ఆటగాడిగా మూడు ఫార్మాట్‌లలోనూ పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తాను. నా అనుభవం, అంకితభావంతో కొత్త కెప్టెన్‌కి, జట్టుకు మద్దతు ఇస్తాను. తన మీద నమ్మకంతో కెప్టెన్సీ బాధ్యతని అప్పగించినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని బాబర్ ఆజమ్ చెప్పుకొచ్చాడు. 2019లో పాకిస్థాన్ జట్టుకి నాయకత్వం వహించాలని పీసీబీ నుంచి తనకొచ్చిన పిలుపు ఇంకా గుర్తుందని, ఈ నాలుగేళ్లలో తాను ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానన్నాడు. క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ గర్వాన్ని, గౌరవాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు. ఈ ప్రయాణంలో తనకు తిరుగులేని మద్దతిచ్చిన క్రికెట్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
కాగా.. వరల్డ్‌కప్ 2023 మెగాటోర్నీలో పాకిస్థాన్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చింది. లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని కేటగిరీల్లోనూ జట్టు విఫలమైంది. అందుకే.. ఈ మెగాటోర్నీలో పెద్దగా రాణించలేక, సెమీస్‌కి చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఇక బాబర్ ఆజమ్ గురించి మాట్లాడితే.. అతడు మొత్తం 9 మ్యాచ్‌ల్లో 40 సగటుతో 320 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు బాబర్ ఆజమ్ కెప్టెన్సీ పదవికి స్వస్తి పలికాడు కాబట్టి, అతని స్థానంలో ఎవరికీ ఆ బాధ్యతలు అప్పగిస్తారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Updated Date - 2023-11-15T19:48:16+05:30 IST