RCB: రజనీ ‘జైలర్’ సినిమాపై ఆర్సీబీ అభ్యంతరం.. సీన్ తొలగించాలని కోర్టు ఆదేశాలు
ABN, First Publish Date - 2023-08-28T19:12:08+05:30
రజనీకాంత్ జైలర్ సినిమాపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సినిమాలో తమను అవమానపరిచేలా ఉన్న సన్నివేశాన్ని తొలగించాలని పిటిషన్‌లో కోరింది. దీంతో సదరు సన్నివేశాన్ని సెప్టెంబర్ 1లోగా తొలగించాలని నిర్మాతలను కోర్టు ఆదేశించింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. రోబో తర్వాత తలైవర్‌కు నిఖార్సైన హిట్ పడిందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా భారీ హిట్ సాధించడంతో నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతోంది. అయితే అనూహ్య రీతిలో జైలర్ మూవీకి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాలో ఓ సీన్ తొలగించాలంటూ ఆర్సీబీ జట్టు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సదరు సన్నివేశం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు. దీంతో ఆ సన్నివేశాన్ని సెప్టెంబర్ 1లోగా తొలగించాలంటూ నిర్మాతలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
ఆ సన్నివేశంలో అభ్యంతరమేంటి?
జైలర్ మూవీ ఫస్టాఫ్‌లో మద్యం మత్తులో ఉన్న హీరో రజినీకాంత్‌ను ఇద్దరు విలన్ మనుషులు ఫాలో అవుతారు. చివరకు వారిని ఒక చోట కార్నర్ చేసిన రజినీ.. ఇద్దర్నీ చంపేస్తాడు. ఈ సీన్‌లో ఇద్దరు రౌడీల్లో ఒకరు ఆర్సీబీ జెర్సీ వేసుకుని ఉంటాడు. దీంతో ఈ సన్నివేశం పట్ల ఆర్సీబీ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీన్ కావాలనే పెట్టారంటూ మండిపడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో పోలిస్తే ఆర్సీబీని తక్కువగా చూపించాలనే జెర్సీని వేసుకున్న విలన్ సన్నివేశాన్ని చిత్రీకరించారని అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Asia Cup 2023: వదిలిపెట్టని ఫ్యాన్స్.. విరాట్ కోహ్లీని తిట్టిన మ్యాంగో మేన్ ఎక్కడ?
జైలర్ సినిమాలో ఆర్సీబీ జెర్సీ ధరించిన వ్యక్తిని రజనీకాంత్ చంపడం కారణంగా తమిళం, కన్నడ ప్రాంతాల మధ్య చిచ్చురేగే అవకాశం ఉందని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. గతంలో ఈ రెండు టీమ్స్ అభిమానులు గొడవ పడి చంపుకునే వరకు వెళ్లింది. ఒక ఆర్సీబీ ఫ్యాన్.. తన టీంను అవమానించాడంటూ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిని కత్తితో పొడిచాడు. ఈ నేపథ్యంలో జైలర్ సినిమాలో సీన్ మరింత వివాదాస్పదంగా మారింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 1 తర్వాత అన్ని థియేటర్లలో ఆర్సీబీ జెర్సీ ఉన్న సన్నివేశాన్ని తొలగించాలి. లేకపోతే కోర్టు ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఓటీటీ, శాటిలైట్ ప్రసారాల్లోనూ ఈ సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగించాల్సి ఉంటుంది. కాగా కోర్టు ఆదేశాల మేరకు ఈ సీన్‌ను జైలర్ మూవీ నిర్మాతలు ఎప్పుడు తొలగిస్తారో చూడాలి.
Updated Date - 2023-08-28T19:12:08+05:30 IST