Harbhajan Singh: అనుష్క, అథియా శెట్టిలపై హర్భజన్ సెక్సిస్ట్ వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లు
ABN, First Publish Date - 2023-11-19T20:00:11+05:30
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తాజాగా కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హిందీలో కామెంటరీ చేసిన ఆయన.. అనుష్క శర్మ, అథియా శెట్టిలపై ‘సెక్సిస్ట్’ వ్యాఖ్యలు చేశాడు. కెమెరామేన్ అనుష్క, అథియాలను..
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తాజాగా కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హిందీలో కామెంటరీ చేసిన ఆయన.. అనుష్క శర్మ, అథియా శెట్టిలపై ‘సెక్సిస్ట్’ వ్యాఖ్యలు చేశాడు. కెమెరామేన్ అనుష్క, అథియాలను చూపించినప్పుడు.. ‘‘వారి మధ్య సంభాషణ సినిమాల గురించి జరుగుతుందా? లేక క్రికెట్ గురించా? ఎందుకంటే వాళ్లకు క్రికెట్ గురించి ఎంత అవగాహన ఉందో తెలీదు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో.. నెటిజన్లు అతనిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
హర్భజన్ చేసిన ‘సెక్సిస్ట్’ వ్యాఖ్యల వీడియోని షేర్ చేస్తూ.. ‘‘హిందీ వ్యాఖ్యాతల్లో ఒకరైన హర్భజన్ అనుష్క శర్మ, అథియా శెట్టికు క్రికెట్‌పై ఎంత అవగాహన ఉందన్న విషయంపై బహిరంగంగానే వెక్కిరిస్తున్నారు. ఇంకెన్నాళ్లు ఇలాగే వాగుతారు? మనలో ఇంకెప్పుడు మార్పు వస్తుంది? అనుష్క శర్మ కేవలం ఒక సినీ సెలెబ్రిటీ మాత్రమే కాదు, ఇటీవల సెంచరీల పరంగా చరిత్ర సృష్టించిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య కూడా. అలాంటి మహిళపై ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు చేయడం నిజంగా విచారకరం’’ అని ఒక యూజర్ నిప్పులు చెరిగాడు. సబ్జెక్ట్ ఏదైనా.. స్త్రీ ద్వేషమనేది రోజురోజుకీ పెచ్చుమీరిపోతోందని.. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ హర్భజన్ వ్యాఖ్యలేనంటూ మరొక యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచి గుర్తింపు, మాజీ క్రికెటర్ అయిన హర్భజన్ లాంటి వ్యక్తి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా జుగుప్సాకరం. అవగాహన ఉందా? లేదా? అనే సంగతి పక్కనపెడితే.. వాళ్లిద్దరు తమ భాగస్వామ్యులకు (కోహ్లీ-అనుష్క, కేఎల్ రాహుల్-అథియా), అలాగే భారత జట్టుకి మద్దతు తెలిపేందుకు మైదానానికి విచ్చేశారు. వారికి కనీసం గౌరవం అనేది ఇవ్వాలి. సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీనే పెళ్లాడిన హర్భజన్‌కు.. కోట్లాదిమంది ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలియకపోతే ఎలా? ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.
Updated Date - 2023-11-19T20:00:12+05:30 IST