IPL 2023: కోల్‌కతాలో చెన్నై బ్యాటర్ల బీభత్సం!
ABN, First Publish Date - 2023-04-23T21:34:13+05:30
ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) బ్యాటర్లు బీభత్సం సృష్టించారు. పరుగుల సునామీతో
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) బ్యాటర్లు బీభత్సం సృష్టించారు. పరుగుల సునామీతో మైదానాన్ని చుట్టేశారు. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఆ సునామీలో చిక్కుకుని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. బ్యాట్‌కు బంతికి బంతికి మధ్య సాగిన పోరులో బ్యాట్‌దే పై చేయి అయింది. నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయిన చెన్నై 235 పరుగుల భారీ స్కోరు సాధించి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సొంత మైదానంలోనే సవాలు విసిరింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన కోల్‌కతా(KKR) మూల్యం చెల్లించుకుంది. చెన్నై బ్యాటర్లు ఎడాపెడా బాదుతుంటే కోల్‌కతా బౌలర్లు ప్రేక్షకులుగా మారి చూడడం తప్ప అడ్డుకట్ట వేయలేకపోయారు. రుతురాజ్ గైక్వాడ్‌తో మొదలైన విధ్వంసం చివరి వరకు కొనసాగింది. కాన్వే, రహానే, దూబే, జడేజా క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్టే చెలరేగిపోయారు. బ్యాట్‌తో శివాలెత్తిపోయారు. పరుగుల వర్షం కురిపించారు.
ఈ మ్యాచ్‌లో మొత్తం ముగ్గురు అర్ధ సెంచరీలు చేశారు. కాన్వే 56 (40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అజింక్య రహానే 71 ( 29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శివం దూబే 50 (21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులు చేశారు. రవీంద్ర జడేజా 8 బంతులు ఆడి రెండు సిక్సర్లతో 18 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో కుల్వంత్ ఛేజ్రోలియా 2 వికెట్లు తీసుకున్నాడు.
Updated Date - 2023-04-23T21:37:53+05:30 IST