Rashid Khan: పాపం రషీద్ ఖాన్.. రింకూ దెబ్బకు మరుగునపడిపోయిన హ్యాట్రిక్
ABN, First Publish Date - 2023-04-09T20:47:51+05:30
గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)-కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) మధ్య
అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)-కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) మధ్య జరిగిన ఐపీఎల్ 13వ మ్యాచ్ టీ20ల్లోని అసలైన మజాను అందించింది. మ్యాచ్ మధ్యలో అటూ ఇటూ ఊగిసలాడిన విజయం చివరికి కోల్‌కతా నైట్ రైడర్స్‌ను వరించింది. విజయ్ శంకర్ (63), సాయి సుదర్శన్ (53) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం 205 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) విధ్వంసకర ఆటతీరుతో గెలుపు దిశగా సాగింది. అయితే, 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేసిన అయ్యర్‌ను అల్జారీ జోసెఫ్ పెవిలియన్ చేర్చాడు. అయితే, ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్ వంటి బ్యాటర్లు ఉండడంతో విజయం కేకేఆర్‌దేనని అందరూ అనుకున్నారు. అయితే, అప్పుడే అద్భుతం జరిగింది.
గుజరాత్ స్టాండిన్ కెప్టెన్ రషీద్ ఖాన్(Rashid Khan) బంతితో జట్టు రూపురేఖలను అమాంతం మార్చేశాడు. వరుస బంతుల్లో ఆండ్రూ రసెల్ (1), సునీల్ నరైన్ (0), శార్దూల్ ఠాకూర్ (0)లను ఔట్ చేసి ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. కోల్‌కతాలో చేతుల్లోంచి విజయాన్ని అమాంతం లాగేసుకున్నాడు.
అయితే, అప్పటికే క్రీజులో ఉన్న రింకు సింగ్ అతడి పప్పులు ఉడకనివ్వలేదు. చివరి ఓవర్ చివరి ఐదు బంతులను భారీ సిక్సర్లుగా మలిచి స్టేడియంలో విలయం సృష్టించాడు. రింకూసింగ్ వీరబాదుడుకు యశ్ దయాళ్ బాధితుడిగా మారాడు. 4 ఓవర్లలో ఏకంగా 69 పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాదు, రింకూ మెరుపు ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ తొలి హ్యాట్రిక్ కొట్టుకుపోయింది. ఈ మ్యాచ్‌లో రింకూ ఒక్కసారిగా హీరోగా మారిపోతే యశ్ దయాళ్, రషీద్ ఖాన్ ఇద్దరూ బాధితులుగా మారిపోయారు.
Updated Date - 2023-04-09T20:47:51+05:30 IST