IPL 2023: బెబ్బులిలా విరుచుకుపడిన రింకూ సింగ్.. స్టేడియంలో కేకలే!
ABN, First Publish Date - 2023-04-09T19:45:38+05:30
ఇక కోల్‌కతా(KKR) విజయానికి ఢోకా లేదనుకున్న సమయంలో గుజరాత్(GT) స్టాండిన్
అహ్మదాబాద్: ఇక కోల్‌కతా(KKR) విజయానికి ఢోకా లేదనుకున్న సమయంలో గుజరాత్(GT) స్టాండిన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తిప్పేశాడు. వరుస బంతుల్లో ఆండ్రూ రసెల్ (1), సునీల్ నరైన్ (0), శార్దూల్ ఠాకూర్ (0)లను వెనక్కి పంపి ఐపీఎల్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. దీంతో అప్పటి వరకు విజయం తమదేనన్న ఉత్సాహంలో మునిగిపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ శిబిరం నిరాశలో మునిగిపోయింది. ఇక బ్యాట్లు ఝళిపించేవారు ఎవరూ లేరు. ఉమేశ్ యాదవ్, రింకు సింగ్ క్రీజులో ఉన్నారు. ఉన్న బంతుల కంటే చేయాల్సిన పరుగులు రెండింతలు ఉన్నాయి. గెలుపు బాటలో ఉన్న గుజరాత్ ఆటగాళ్లలో ఆనందం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.
చివరి ఓవర్‌లో కోల్‌కతా గెలవాలంటే 29 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్నది రింకూసింగ్, ఉమేశ్ యాదవ్. ఆ జట్టు గెలుస్తుందని సగటు కేకేఆర్ అభిమాని కూడా ఊహించి ఉండడు. కానీ, రింకూసింగ్ శివాలెత్తాడు. అతడి దెబ్బకు గుజరాత్ ఫీల్డర్లు కకావికలమయ్యారు. వరుస సిక్సర్లతో స్టేడియాన్ని హెరెత్తించి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించి హీరోగా మారిపోయాడు.
యశ్ దయాళ్ వేసిన చివరి ఓవర్ తొలి బంతిని ఆడిన ఉమేశ్ యాదవ్ సింగిల్ తీసి రింకూకి స్ట్రైకింగ్ ఇచ్చాడు. ఇక అప్పుడు మొదలైంది అసలు మజా. చివరి ఐదు బంతులను ఒకదానివెంట ఒకటి సిక్సర్లుగా మలిచిన రింకూ సింగ్ గుజరాత్ చేతుల్లోంచి విజయాన్ని అమాంతం లాగేసుకున్నాడు. ఇంకేముందు.. గుజరాత్ శిబిరంలో నిరాశ ఆవహించగా, కేకేఆర్ శిబిరం సంతోషంతో ఎగిరి గంతులేసింది. మూడు వికెట్ల తేడాతో గెలుపొందిన కేకేఆర్‌కు ఇది రెండో విజయం కాగా, గుజరాత్‌కు ఇది తొలి పరాజయం.
గుజరాత్ నిర్దేశించిన 205 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కేకేఆర్ తొలి నుంచీ విజయం దిశగానే సాగింది. వెంకటేశ్ అయ్యర్ 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపించాడు. అయితే, అతడు అవుట్ కావడం, ఆ వెంటనే రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తీసుకోవడంతో విజయం గుజరాత్‌వైపు మొగ్గినా రింకూ సింగ్ బౌలర్ల ఆటలు సాగనీయలేదు. వరుస సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించి జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించిపెట్టాడు. మొత్తంగా 21 బంతులు ఎదుర్కొన్న రింకూ సింగ్ ఫోర్, ఆరు సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. కెప్టెన్ నితీశ్ రాణా 45 పరుగులు చేశాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు సాధించింది. విజయ్ శంకర్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా సాయి సుదర్శన్ 53, శుభమన్ గిల్ 39 పరుగులు చేశారు.
Updated Date - 2023-04-09T19:51:50+05:30 IST