ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telugu Politics: రాజకీయాల్లోకి ప్రముఖ తెలుగు క్రికెటర్? ఆ పార్టీలోకేనా?

ABN, First Publish Date - 2023-03-29T22:01:46+05:30

ఆ ప్రముఖ తెలుగు క్రికెటర్ రాజకీయ అరంగేట్రం ఖాయమేనా..? క్రికెట్ కెరీర్ ముగిసీ ముగియగానే నిర్ణయం తీసుకుంటారా? ఆయన ఆలోచనలు దీనినే చాటుతున్నాయా? అడుగులన్నీ ఆ పార్టీ వైపేనా? ..అంటే దీనికి ఔననే సమాధానమే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆ ప్రముఖ తెలుగు క్రికెటర్ రాజకీయ అరంగేట్రం ఖాయమేనా..? క్రికెట్ కెరీర్ ముగిసీ ముగియగానే నిర్ణయం తీసుకుంటారా? ఆయన ఆలోచనలు దీనినే చాటుతున్నాయా? అడుగులన్నీ ఆ పార్టీ వైపేనా? ..అంటే దీనికి ఔననే సమాధానమే వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ కావడం.. జాతీయ పార్టీగా మారిన ఆ పార్టీకి ఇలాంటి వారే కావాల్సి రావడం కూడా.. ఆ క్రికెటర్ కు కొంత కలిసొచ్చేలా ఉంది. మరి దీనికి ఎంతో సమయం లేదు.. మరికొన్ని నెలల్లో సంగతి తేలిపోనుంది.

అద్భుత ప్రతిభ.. దానికి తోడు నిలకడ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ నిబ్బరంగా ఆడగల స్థైర్యం.. అండర్ 16 స్థాయిలోనే దుమ్మురేపే ఇన్నింగ్స్.. అండర్ 19 దశలో దేశానికి సారథ్యం.. రంజీల్లోనూ చెలరేగాడు.. ఒకటీ రెండు సీజన్లయితే టీమిండియాలోకే.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆ క్రికెటర్ భారత జట్టుకు సుదీర్ఘ కాలం ఆడేవాడు. కెప్టెన్ కూడా అయ్యేవాడు. కానీ, బ్యాడ్ లక్. అయితేనేం.. అతడికి ఇప్పటికీ దేశవ్యాప్తంగా పేరు. టీమిండియాలోకి ఆలస్యంగా వచ్చినా మంచి ఇన్నింగ్సే ఆడాడు. మరోసారి బ్యాడ్ లక్ వెంటాడడంతో జట్టుకు దూరమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొనసాగుతున్నాడు. క్రీడా కెరీర్ పరంగా చరమాంకంలో ఉన్న అతడు ఈ సీజన్ ముగిశాక ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టనున్నట్లుగా కనిపిస్తోంది.

రా.. రా.. రాయుడు..

పైన చెప్పుకొన్నదంతా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు గురించి. ప్రస్తుతం 37 ఏళ్ల వయసున్న రాయుడు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఆడుతున్నాడు. ఈ సీజన్ తో అతడు కెరీర్ పై నిర్ణయం తీసుకునేలా కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రజలకు సేవ చేయాలన్నది లక్ష్యంగా చెబుతున్నాడు. మొదట్నుంచీ తనకు సమాజ సేవ అంటే ఇష్టమని.. చుట్టూ ఉన్నవాళ్లతో పాటు సమాజం కోసం పనిచేయాలన్న ఆసక్తి ఉందని అంటున్నాడు. క్రికెట్ కెరీర్ తర్వాత ప్రజలకు దగ్గరగా వారి మధ్యలోనే ఉండాలని అనుకుంటున్నానని కూడా స్పష్టం చేశాడు. వీలైనంత ఎక్కువ మందికి సేవ చేసే లక్ష్యంతో ఉన్నానని.. అందుకోసం పూర్తి నిబద్ధత, అంకితభావంతో ఉంటానని వివరిస్తున్నాడు. నిజాయతీగా సేవలు అందిస్తానని.. యువతకు స్ఫూర్తిగా నిలుస్తానని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందంటే ‘‘రాజకీయాలను తప్పకుండా’’ పరిశీలిస్తానని పేర్కొంటున్నాడు.

ఆ వ్యాఖ్యలన్నీ దానికే సంకేతం..

క్రికెట్ కాకుండా రాయుడు అంతరంగాన్ని పరిశీలిస్తే.. ప్రజా సేవ, చుట్టూ ఉన్నవారికి సాయం.. ఎక్కువమందికి ఉపయోగపడడం వంటి మాటలను చూస్తుంటే ఆయన అడుగులు ‘‘రాజకీయాల’’ వైపే ఉన్నట్లుగా తెలుస్తోంది. రాయుడు గుంటూరులో పుట్టాడు. హైదరాబాద్ లో పెరిగాడు. హైదరాబాద్ జట్టుకే రంజీ అరంగేట్రం చేశాడు. మధ్యలో ఆంధ్రకు మారాడు. తర్వాత బరోడాకు ఆడాడు. 2013లో టీమిండియాలోకి వచ్చాడు. 55 వన్డేలు ఆడి 1,694 పరుగులు చేశాడు. సగటు 47.05. ఆరు టి20ల్లోనూ ప్రాతినధ్యం వహించి 42 పరుగులు చేశాడు. ఇక 2010 నుంచి ఐపీఎల్‌ లో ఆడుతున్నాడు. ముంబయి ఇండియన్స్‌ (2013, 2015, 2017), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (2018, 2021) తరఫున అయిదు సార్లు ట్రోఫీ అందుకున్నాడు. ప్రస్తుతం 37 ఏళ్ల రాయుడి క్రికెట్ కెరీర్ చివరి దశలో ఉన్నాడు. దీంతో క్రియాశీల రాజకీయాల వైపు చూపుసారించే అవకాశాలు ఉన్నాయి.

అడుగులు ఆ పార్టీ వైపేనా..?

అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తే గనుక ఏ పార్టీలో చేరతారు? అన్నది పెద్ద ప్రశ్న. అయితే, అతడికి తెలంగాణలోని అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో సత్సంబంధాలున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు తాను పెద్ద అభిమానినని ఇటీవల సిద్దిపేటలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా జరిగిన క్రికెట్ టోర్నీ ప్రారంభ కార్యక్రమంలో స్పష్టంగా చెప్పాడు. తెలంగాణ లో గత పదేళ్లలో జరిగినంత డెవలప్ మెంట్ మరే రాష్ట్రంలోనూ జరగలేదని కూడా ప్రశంసించాడు. మరోవైపు రాయుడు అంటే కేసీఆర్ కు కూడా ప్రత్యేక అభిమానం ఉన్నట్లు కనిపిస్తుంది. 2014 నవంబరులో ఉప్పల్ స్టేడియంలో శ్రీలంకతో మ్యాచ్ కు ముందు ఆటగాళ్ల పరిచయం సందర్భంగా అంబటి రాయుడు చేతిని ముద్దాడి కేసీఆర్ ఆశ్చర్యపరిచారు. కాగా, రాయుడుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి టీమ్ మేట్. అంబటి ప్రతిభ గురించి చాలా గొప్పగా చెబుతారు కౌశిక్ రెడ్డి. ఇక ఇటీవల సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాయుడిని మంత్రి హరీశ్ రావు సిద్దిపేట తీసుకెళ్లి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వీటన్నిటి నేపథ్యంలో రాయుడు ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ లోనే చేరతారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ రెండు విధాలా లాభం

తెలుగు రాష్ట్రాలు ఎన్నికల ఏడాదిలో ఉన్నాయి.. మరీ ముఖ్యంగా తెలంగాణ ఇందులో ముందుంది. ఈ రాష్ట్రంలో ఏడెనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీల వ్యూహాలు పదునెక్కుతున్నాయి. మరికొన్ని నెలల్లో మరింత జోరందుకోనున్నాయి. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదనే వాతావరణం కనిపిస్తోంది. ఈ క్రమంలో పెద్దఎత్తున చేరికలు ఉండడం ఖాయం. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిన బీఆర్ఎస్ కు రాయుడు వంటి వారి చేరిక చాలా కీలకం. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు క్రికెటర్ గా జాతీయ స్థాయిలో రాయుడు పాపులర్ కాబట్టి బీఆర్ఎస్ కూడా అతడిని ‘‘రా రా రాయుడు’’ అని ఆహ్వానించడం ఖాయం. అంతేకాదు.. సామాజికవర్గ పరంగానూ రాయుడిది ఏపీలో కీలక పాత్ర కావడం గమనార్హం.

సిద్దిపేటలో ఫామ్ హౌస్.. కాళేశ్వరానికి ఎకర్ననర

క్రికెటర్ గా వచ్చిన ఆదాయాన్ని అంబటి రాయుడు రియల్ ఎస్టేట్ పై పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అందులోభాగంగానే రాయుడు సిద్దిపేట సమీపంలో కొంత భూమిని కొన్నాడు. ఫామ్ హౌస్ నిర్మించాడు. కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మాణం సందర్భంగా అందులో ఎకరన్నర భూమి ముంపునకు గురవగా.. రాయుడు స్వయంగా ముందుకొచ్చి సంతకం చేసి ఇచ్చారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు.

ఆ క్రికెటర్ల జాబితాలోకి..

రిటైరయ్యాక చాలామంది క్రికెటర్లు రాజకీయాల్లోకి వచ్చారు. ఇటీవలి కాలంలోనే చూస్తే గౌతమ్ గంభీర్ (బీజేపీ) తరఫున ఢిల్లీ ఎంపీ అయ్యారు. మనోజ్ తివారీ పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ టీఎంసీ ఎమ్మెల్యే. మాజీ మంత్రి కూడా. నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. పదిహేనేళ్ల కిందటే టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాదీ మహమ్మద్ అజహరుద్దీన్ కాంగ్రెస్ లో చేరి యూపీ నుంచి ఎంపీగా గెలిచారు. కీర్తి ఆజాద్, చేతన్ చౌహాన్, మొహమ్మద్ కైఫ్, వినోద్ కాంబ్లీ.. ఇలా చెప్పుకొంటూ పోతే జాబితా చాలా ఉంది.

కొసమెరుపు..: క్రికెట్ నుంచి రాజకీయాల్లో వచ్చిన తొలి ఆటగాడు టీమిండియా మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ. అయితే, ఈయన రెండుసార్లు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాల జోలికెళ్లలేదు.

Updated Date - 2023-03-29T22:02:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising