Virender Sehwag: శామ్ కరన్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడిన వీరేంద్ర సెహ్వాగ్
ABN, First Publish Date - 2023-04-21T17:38:21+05:30
ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు బలమంతా ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్(Shikhar Dhawan)లోనే ఉన్నట్టు తేలిపోయింది.
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు బలమంతా ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్(Shikhar Dhawan)లోనే ఉన్నట్టు తేలిపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరిగిన మ్యాచ్‌లో ధవన్ లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి పాలైంది. 150 పరుగులకే కుప్పకూలింది. ధవన్ గైర్హాజరీలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన శామ్ కరన్ (Sam Curran) జట్టులో స్ఫూర్తినింపడంలో విఫలమయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టు దారుణంగా విఫలమైంది. స్వయంగా శామ్ కరన్ కూడా బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. 12 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ను పంజాబ్ జట్టు వేలంలో రూ. 18.50 కోట్లకు దక్కించుకుంది.
24 ఏళ్ల కరన్ మంచి ఆల్‌రౌండరే. కాకపోతే అనుభవం మాత్రం అంతంతే. ధవన్ గైర్హాజరీలో కరన్ జట్టును నడిపించినప్పటికీ అనుభవ లేమి కొట్టొచ్చినట్టు కనిపించింది. మ్యాచ్ సందర్భంగా శామ్ తీసుకున్న నిర్ణయాలతోపాటు రనౌట్ కావడంపై టీమిండియా మాజీ బ్యాటర్ సెహ్వాగ్(Virender Sehwag) తీవ్రంగా స్పందించాడు. శామ్ కరన్‌ను రూ. 18 కోట్లు పెట్టి కొననైతే కొన్నారు కానీ, అనుభవాన్ని మాత్రం కొనలేకపోయారని అన్నాడు. అనుభవం అనేది ఆడితేనే వస్తుందని అన్నాడు.
రూ. 18 కోట్లు పెట్టి కొన్నారు కాబట్టి మ్యాచ్‌లను అతడు గెలిపించేస్తాడని అనుకుంటామని, కానీ అతడికి ఇప్పటికీ తగినంత అనుభవం లేదని సెహ్వాగ్ తేల్చి చెప్పాడు. మరీ దారుణంగా రనౌట్ అయ్యాడని, అక్కడసలు పరుగు తీయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించాడు. కెప్టెన్‌గా చేస్తున్నప్పుడు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లగలగాలని అన్నాడు. అనుభవ లేమి కారణంగా చివరికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని సెహ్వాగ్ విమర్శించాడు.
బెంగళూరు చేతిలో ఓటమితో పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఖాతాలో మూడు విజయాలు, మూడు పరాజయాలు ఉన్నాయి. ధవన్ త్వరలోనే జట్టులోకి వస్తాడని, జట్టు మళ్లీ గాడిన పడుతుందని పంజాబ్ ఫ్రాంచైజీ ఆశగా ఉంది.
Updated Date - 2023-04-21T17:38:21+05:30 IST