WPL Auction: మహిళా ప్లేయర్లపై కోట్లు కుమ్మరిస్తున్న ఫ్రాంచైజీలు.. ఆర్సీబీకి మంధాన, ముంబైకి హర్మన్‌ప్రీత్
ABN, First Publish Date - 2023-02-13T15:57:51+05:30
మహిళా క్రికెటర్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి
ముంబై: మహిళా క్రికెటర్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. ముంబై వేదికగా ప్రారంభమైన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో మహిళా ప్లేయర్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఈ వేలంలో పాల్గొన్న అమ్మాయిల జాబితాలో మొత్తం 409 మంది ఉన్నారు. వీరిలో 246 మంది భారత క్రికెటర్లు కాగా, ఐసీసీ పూర్తి సభ్య దేశాల నుంచి 155 వేలంలో ఉన్నారు. ముంబై ఇండియన్స్(MI), ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు( RCB), గుజరాత్ జెయింట్స్(Gujarat Giants), యూపీ వారియర్జ్( UP Warriorz) ఫ్రాంచైజీలు మొత్తం 90 మందిని దక్కించుకోనున్నాయి.
ఈ ఏడాది ఒక్కో ఫ్రాంచైజీ రూ. 12 కోట్లు వెచ్చించేందుకు బీసీసీఐ(BCCI) అనుమతినిచ్చింది. ఒక్కో జట్టులో 18 మంది క్రికెటర్లు ఉంటారు. వీరిలో ఆరుగురు విదేశీ ప్లేయర్లు. కనిష్ఠ ధర రూ. 10 లక్షలుకాగా.. గరిష్ఠ ధర రూ.50 లక్షలుగా నిర్ణయించారు. టీమిండియా క్రికెటర్లందరితోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా క్రీడాకారిణులకు చక్కటి ధర లభించే అవకాశాలున్నాయి.
స్మృతికి భారీ ధర
ఊహించినట్టుగానే టీమిండియా ప్లేయర్ స్మృతి మంధానా(Smriti Mandhana)కు భారీ ధర పలికింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 3.4 కోట్లకు స్మృతిని దక్కించుకుంది. ఆ తర్వాతి ఆస్ట్రేలియా ప్లేయర్ యాష్ గార్డనర్ (Ash Gardner)కు ఎక్కువ ధర లభించింది. గుజరాత్ జెయింట్స్ ఆమెను రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur )ను ముంబై రూ. 1.8 కోట్లకు కొనుగోలు చేయగా, ఆస్ట్రేలియా అమ్మాయి ఎల్లిస్ పెర్రీ(Ellyse Perry)ని కూడా ఆర్సీబీ దక్కించుకుంది. ఆమె కోసం రూ. 1.8 కోట్లు వెచ్చించింది. అలాగే, ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ ఎక్లెస్టోన్(Sophie Ecclestone)ను యూపీ వారియర్జ్ రూ. 1.8 కోట్లకు కొనుగోలు చేయగా, న్యూజిలాండ్ అమ్మాయి సోపీ డివైన్ (Sophie Devine ను ఆర్సీబీ రూ. 50 లక్షలకు సొంతం చేసుకుంది.
Updated Date - 2023-02-13T16:22:34+05:30 IST