Stuart Broad James Anderson: ఈ పేసర్లకు వేయాలి.. ‘‘వెయ్యి వికెట్ల’’ వీరతాడు
ABN, First Publish Date - 2023-02-19T21:38:58+05:30
ఒకరికి 40 ఏళ్లు దాటాయి.. మరొకరికి 37 నడుస్తున్నాయి.. అయినా వారిద్దరూ మైదానంలో దుమ్మురేపుతున్నారు.. ఒకరితో ఒకరు పోటీ పడి అరుదైన రికార్డులను ఖాతాలో..
ఒకరికి 40 ఏళ్లు దాటాయి.. మరొకరికి 37 నడుస్తున్నాయి.. అయినా వారిద్దరూ మైదానంలో దుమ్మురేపుతున్నారు.. ఒకరితో ఒకరు పోటీ పడి అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకుంటున్నారు. తమ తోటివారంతా రిటైరై పోయి.. కామెంట్రీ చెప్పుకొంటూనో, కోచింగ్ ఇచ్చుకుంటూనో కాలం గడుపుతుంటే.. వారిద్దరు మాత్రం వయసు మీద పడుతున్న కొద్దీ పదును దేలుతున్నారు.. తాజాగా మరే జంటకూ సాధ్యం కానీ.. భవిష్యత్‌లో మరే జంట కూడా అందుకోలేని రికార్డును సొంతం చేసుకున్నారు.
పేస్ బౌలర్ల జంట రికార్డులకే రికార్డు..
ఉమ్మడిగా 133 టెస్టులు.. పడగొట్టిన వికెట్లు 1009. ఇదీ ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ జంట జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ఘనత. న్యూజిలాండ్ తో
న్యూజిలాండ్‌లో జరిగిన తొలి టెస్టు (పింక్)లో వీరిద్దరూ సంయుక్తంగా వెయ్యి వికెట్లు తీసిన బౌలర్లుగా రికార్డు నెలకొల్పారు. అంతేకాదు.. టెస్టు క్రికెట్ లో జంటగా 1000 వికెట్లు తీసిన తొలి పేస్ ద్వయం వీరే. న్యూజిలాండ్ తో టెస్టులో వీరద్దరూ కలిసి 12 వికెట్లు తీశారు. దీంతో కివీస్ రెక్కలు విరిగాయి. ఈ టెస్టుకు ముందు వీరు 997 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన మెక్‌గ్రాత్, షేన్‌వార్న్ ద్వయం (1001) మొదటి స్థానంలో ఉండేది.
వీరి ప్రత్యేకతలెన్నో..
మెక్ గ్రాత్-షేన్ వార్న్ ద్వయం వెయ్యి వికెట్లపైగా పడగొట్టినప్పటికీ.. వీరిలో మెక్ గ్రాత్ పేసర్, వార్న్ స్పిన్నర్. కానీ, అండర్సన్, బ్రాడ్ ఇద్దరూ పేసర్లే. మరో విశిష్టత ఏమంటే మెక్ గ్రాత్/వార్న్ హయాంలో ఎడాపెడా బాదేసే టి20లు లేవు. కానీ, ఇంగ్లండ్ పేస్ జంట అండర్సన్, బ్రాడ్ ఇద్దరూ తక్కువ సంఖ్యలో అయినా టి20లు ఆడారు. కాగా, వీరు ఇద్దరూ 6 అడుగుల పైగా పొడగరులు. స్వింగ్ కింగ్ గా పేరొందిన అండర్సన్ దాదాపు 6.2 అడుగులుంటే, బౌన్స్ తో బెంబేలెత్తించే బ్రాడ్ ఎత్తు 6.5 అడుగులపైనే. కుడి చేతివాటం పేస్ తో ప్రత్యర్థుల పనిపట్టే వీరు.. బ్యాటింగ్ చేసేది మాత్రం ఎడమచేతివాటంతో.
మొత్తంగా 338 టెస్టులు.. 1,253 వికెట్లు
అండర్సన్ టెస్టు అరంగేట్రం 2004లో జింబాబ్వే మీద జరిగింది. ఆ తర్వాత మూడేళ్లకు బ్రాడ్ 2007లో శ్రీలంకతో టెస్టు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. కాగా, అండర్సన్ ఇప్పటివరకు 178 టెస్టులు ఆడి 682 వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ 160 మ్యాచ్ ల్లో 571 వికెట్లు తీశాడు. మొత్తం కలిపి 1,253 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. జంటగా తీసిన 1,009 వికెట్లను పక్కనపెట్టి చూస్తే విడివిడిగా వీరు తీసినవి 244 వికెట్లే కావడం గమనార్హం.
200 టెస్టులు దాటేస్తారా?
ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక మ్యాచ్‌లు ఆడింది. భారత బ్యాటింగ్ దేవుడు సచిన్ టెండూల్కర్ (200). 2013లో సచిన్ రిటైరయ్యాక ఇక ఈ రికార్డు మరెవరికీ దక్కదని భావించారు. కానీ, అండర్సన్ ఊపు చూస్తుంటే 200 టెస్టులు దాటేలా ఉన్నాడు. 40వ ఏట కూడా అతడి చురుకుదనం చూస్తే మరో 22 టెస్టులు ఆడి సచిన్ రికార్డును చేరుకోవడం.. దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక 37 ఏళ్ల బ్రాడ్ రెండు, మూడేళ్లు టెస్టులు ఆడొచ్చు. కానీ, 200 టెస్టులకు 40 టెస్టుల దూరంలో ఉన్నాడు.
వెటరన్లు అయినా పరుగాపలేదు..
వయసు మీద పడుతున్నా ఈ ద్వయంలో పదును తగ్గలేదు. న్యూజిలాండ్ గడ్డపై తొలి టెస్టులో వీరి దూకుడు చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. వాస్తవానికి ఇంగ్లండ్‌కు వీరద్దరిని మించిన పేస్ బౌలింగ్ ప్రత్యామ్నాయాలు దొరకడం లేదు. జోఫ్రా ఆర్చర్‌కు గాయాల బెడద.. ఓలీ రాబిన్సన్ ఇప్పుడిప్పుడే నిలదొక్కకుంటున్నాడు.. క్రిస్ వోక్స్ వంటి వారున్నా నాణ్యమైన బౌలర్‌గా ఎదగలేదు. అందుకనే ఇంగ్లండ్ అండర్సన్-బ్రాడ్‌పై ఆధారపడుతోంది.
సిక్సు సిక్సులు కొట్టించుకుని..
ఒకే ఓవర్లో 6 సిక్సులు.. టి20 లీగ్ లు వచ్చాక ఇప్పుడు ఈ రికార్డు తేలికైంది కానీ.. ఓ 15 ఏళ్ల కిందటైతే అరుదే. టీమిండియా డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచ కప్ లో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టిన సీన్ మనందరి మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఒకదానిని మించి ఒకటి అన్నట్లుగా ఉన్న ఈ షాట్లు అభిమానులను ఎంతగానో అలరించాయి. అయితే, నాడు యువరాజ్ చేతిలో బలైంది ఎవరో తెలుసా? ఇంకెవరు.. స్టువర్ట్ బ్రాడ్. కాగా, మరో బౌలరైతే ఆ పరాభవంతో కుంగిపోయేవాడేమో..? కానీ, బ్రాడ్ నేలకు కొట్టిన బంతిలా ఉవ్వెత్తున ఎగిరాడు. ఈ తర్వాత రెండు నెలలకే టెస్టు క్రికెట్ లోకి వచ్చిన అతడు అత్యంత విజయవంతమైన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
* కాగా, శ్రీలంక పేస్ బౌలర్ చమిందా వాస్, దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉమ్మడిగా 95 టెస్టుల్లో 895 వికెట్లు పడగొట్టారు.
* విండీస్ పేస్ ద్వయం అంబ్రోస్, వాల్ష్ 95 టెస్టుల్లో 762 వికెట్లు తీశారు. ప్రస్తుతం ఆడుతున్నవారి విషయానికొస్తే ఆసీస్ పేసర్ స్టార్క్, స్పిన్నర్ లయన్ 73 టెస్టుల్లో 580 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
Updated Date - 2023-02-19T21:39:23+05:30 IST