WC India X Pak Match : హైఓల్టేజ్ ఫైట్ నేడే
ABN, First Publish Date - 2023-10-14T01:00:43+05:30
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేని కారణంగా ఈ రెండు టీమ్స్ మధ్య ద్వైపాక్షిక సిరీ్‌సలు జరుగడం లేదు. ఇలా ఐసీసీ ..
నేడే భారత్ X పాక్ మ్యాచ్
మధ్యాహ్నం 2 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఎప్పుడు.. ఇంకెప్పుడు.. అంటూ క్రికెట్ ప్రపంచం
ఒళ్లంతా కాయలు కాచేలా ఎదురుచూసిన
సమయమిది.. ఇప్పటికి 11 మ్యాచ్‌లు జరిగినా..
అందరి చూపూ ఆ ఒక్క మ్యాచ్ గురించే. వరల్డ్‌క్‌పలో
పది జట్లున్నా.. ఆ రెండు టీమ్స్ ఎప్పుడు మైదానంలోకి
దిగుతాయన్న ఆలోచనలే. భావోద్వేగాలు పతాక స్థాయిలో ఉండే అసలు సిసలైన మ్యాచ్ అది. మీ అంచనా సరైందే..
‘వరల్డ్‌కప్ కా బాప్’ అనదగ్గ భారత్-పాకిస్థాన్
క్రికెట్ జట్ల గురించే ఇదంతా.
ప్రపంచకప్ మొత్తానికే హైఓల్టేజ్ మ్యాచ్‌కు అంతా సిద్ధం.
అక్షరాలా లక్షా 32 వేల మంది అభిమానుల సమక్షంలో.. పాక్ బౌలర్ల భరతం పట్టేలా హిట్‌మ్యాన్ పుల్ షాట్లు, విరాట్ కవర్ డ్రైవ్స్, రాహుల్ సొగసైన ఆట తీరు ఓవైపు కొనసాగితే..
బుమ్రా యార్కర్లు, సిరాజ్ సూపర్ స్వింగ్, కుల్దీప్ స్పిన్ మ్యాజిక్‌కు వికెట్లు నేలకూలుతుంటే చెవులు చిల్లులు పడేలా కరతాళ
ధ్వనులకు స్టేడియం హోరెత్తాల్సిందే. అందుకే.. మరికొన్ని
గంటల్లోనే ఆరంభమయ్యే ఈ మహా సమరం కోసం సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
1 పాక్‌తో తానాడిన ఎనిమిది వరల్డ్‌కప్ (3 వన్డే+ 5 టీ20) మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ ఒక్కసారి మాత్రమే 50లోపు అవుటయ్యాడు.
మ్యాచ్‌కు ముందు స్పెషల్ షో
అర్ధంతరంగా వరల్డ్‌కప్ ఆరంభ వేడుకలను రద్దు చేసిన బీసీసీఐ.. భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు మాత్రం ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 12.30 నుంచి సాగే ఈ ఈవెంట్‌లో సింగర్లు శంకర్ మహదేవన్, అరిజిత్ సింగ్, సుఖ్విందర్ సింగ్, నేహా కక్కర్ తమ గానామృతంతో అభిమానులను అలరించనున్నారు. అలాగే గోల్డెన్ టిక్కెట్ పొందిన సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ ఈ మ్యాచ్‌కు రానున్నారు.
అహ్మదాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేని కారణంగా ఈ రెండు టీమ్స్ మధ్య ద్వైపాక్షిక సిరీ్‌సలు జరుగడం లేదు. ఇలా ఐసీసీ టోర్నీల్లో ఇరు జట్ల పోరు తిలకించే భాగ్యం అభిమానులకు దక్కుతుంది. దీంట్లో భాగంగానే తాజా వన్డే వరల్డ్‌క్‌పలో శనివారం దాయాది జట్ల మధ్య ఆసక్తికర పోరుకు తెర లేవనుంది. ఇటీవలి ఆసియాక్‌పలో తలపడినా వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ జరుగలేదు. ఇప్పటిదాకా ఇరు జట్లు తమ ప్రత్యర్థులతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఊపు మీదున్నాయి. పాక్ జట్టయితే వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యధిక ఛేదన చేసిన జట్టుగా నిలిచింది. బలాబలాల విషయంలోనూ రెండు జట్లు సరిసమానంగా ఉన్నాయి. కానీ గతంలో ఇరు జట్ల ఏడు ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగితే భారత్ అజేయంగా నిలిచింది. కానీ ఈసారి పాక్ మరింత బలంగా కనిపిస్తోంది. తమ జైత్రయాత్ర సాగాలంటే భారత్ సత్తాకు మించి రాణించాల్సి ఉంటుంది.
పారాహుషార్..
కోట్లాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ పోలీసులు అత్యంత పకడ్బందీ భద్రతను ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా తమ సిబ్బందిగా అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. దీంతోపాటు జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్‌సీజీ), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్)లతో పాటు ఆరు వేల మంది పోలీసులు స్టేడియం పరిసరాల్లో విధులు నిర్వర్తిం చనున్నారు. ఈ వారం మొదట్లో నరేంద్ర మోదీ స్టేడియాన్ని పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ రాగా పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
బౌలింగే బలంగా..
భారత్‌తో జరిగే వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో లెఫ్టామ్ పేసర్ షహీన్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంటాడు. రెండేళ్ల క్రితం జరిగిన టీ20 ప్రపంచక్‌పలో రోహిత్, రాహుల్‌లను తొలి ఓవర్‌లోనే అవుట్ చేశాడు. ముఖ్యంగా రోహిత్ తన బౌలింగ్‌లో ఇబ్బందిపడుతుంటాడు. హరీస్ రౌఫ్, హసన్ అలీ ఇతర పేసర్లు. మరోవైపు స్పిన్నర్లు షాదాబ్, నవాజ్ ప్రభావం చూపడం లేదు. ఇక బ్యాటింగ్‌లో మహ్మద్ రిజ్వాన్ నిలకడగా రాణిస్తున్నాడు. శ్రీలంకపై ఓపెనర్‌గా వచ్చిన అబ్దుల్లా షఫీక్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే కెప్టెన్ బాబర్ ఆజమ్ మాత్రం చివరి ఐదు మ్యాచ్‌ల్లో 71 పరుగులు మాత్రమే సాధించాడు. అతడిపై స్పిన్నర్ కుల్దీ్‌పను ప్రయోగించాలని భారత్ భావిస్తోంది. మిడిలార్డర్‌లో సౌద్ షకీల్, ఇఫ్తికార్ ఆదుకునే సత్తా ఉన్నవారే.
గిల్ వచ్చేస్తున్నాడు!
ఈ ఆసక్తికర పోరులో భారత్ తుది జట్టుపై అందరి దృష్టీ నెలకొంది. డెంగీ నుంచి కోలుకున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పాక్‌తో మ్యాచ్ ఆడతాడా? లేడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడిప్పుడే కోలుకున్న అతడిని వెంటనే బరిలోకి దింపుతారా? అన్న సందేహాలున్నా.. కెప్టెన్ రోహిత్ మాత్రం 99శాతం గిల్ మ్యాచ్ ఆడతాడని స్పష్టం చేశాడు. శుక్రవారం నెట్ సెషన్‌లో పాల్గొన్న తను ఎలాంటి ఇబ్బంది పడలేదు. అశ్విన్ ఓవర్లలో భారీ షాట్లు ఆడడం కనిపించింది. మరోవైపు ఓపెనింగ్‌లో కుడి, ఎడమ చేతి కాంబినేషన్‌ను కొనసాగించాలనుకుంటే ఇషాన్ వైపు మొగ్గు చూపవచ్చు. పాక్ పేసర్ షహీన్‌ను ఎదుర్కొనేందుకు ఈ కాంబినేషన్ ఉపయోగపడుతుంది. అలాగే మూడో సీమర్‌గా షమి, శార్దూల్‌లలో ఎవరిని తీసుకోవాలనే డైలమాలో కెప్టెన్, కోచ్ ఉన్నారు. అఫ్ఘాన్‌పై శార్దూల్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక శార్దూల్ బ్యాటింగ్ చేయగలడనే భావిస్తున్నా, అతను ఇప్పటికి వరకు ఆ విభాగంలో రాణించలేకపోయాడు. ఏదిఏమైనా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడే గిల్ ఈ పిచ్‌పై రెండు శతకాలు, మూడు అర్ధసెంచరీలు చేయగా.. షమి కూడా వికెట్ల పండగ చేసుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో రోహిత్, విరాట్ అద్భుత ఫామ్‌లో ఉండడం ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఇక మిడిలార్డర్‌లో శ్రేయాస్, రాహుల్, హార్దిక్ బ్యాట్లు ఝుళిపిస్తే పరుగుల వరద ఖాయమే. కానీ అంతకంటే ముందు ప్రమాదకర పాక్ పేసర్లను ఒత్తిడి లేకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పేసర్లు బుమ్రా, సిరాజ్.. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ తుది జట్టులో ఉండనున్నారు. అశ్విన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
పిచ్, వాతావరణం
ఇక్కడి పిచ్ పేసర్లకు ఎక్కువగా అనుకూలించినా, భారీ స్కోర్లకు అవకాశం ఉంది. అలాగే ఉష్ణోగ్రత 36 డిగ్రీలుగా ఉండనుండడంతో వర్షం నుంచి ఇబ్బందేమీ లేదు. రాత్రి మంచు ప్రభావం కారణంగా టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కు మొగ్గు చూపవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), ఇషాన్/గిల్, విరాట్, శ్రేయాస్, రాహుల్, హార్దిక్, జడేజా, శార్దూల్/షమి, కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికార్, షాదాబ్, నవాజ్, హసన్ అలీ, షహీన్‌షా, హరీస్ రౌఫ్.
పాక్ జట్టు తమ చివరి 20 వన్డేల పవర్‌ప్లేలో ఒక్క సిక్సర్‌ను కూడా నమోదు చేయలేదు.
అప్పుడే సెల్ఫీ దిగుతా..
భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాక్ పేసర్ షహీన్ షా అఫ్రీది ఐదు వికెట్లపై కన్నేశాడు. శుక్రవారం ప్రాక్టీస్ ముగించుకుని పెవిలియన్‌కు చేరే క్రమంలో మీడియా ప్రతినిధులు అతడిని సెల్ఫీ అడిగారు. అయితే అందుకు సమాధానంగా.. ‘కచ్చితంగా సెల్ఫీ దిగుదాం. కానీ ఇప్పుడే కాదు. భారత్‌పై ఐదు వికెట్లు తీశాకే’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Updated Date - 2023-10-14T01:21:20+05:30 IST