Wimbledon : ఎలా కొట్టాడంటే..
ABN, First Publish Date - 2023-07-18T04:25:55+05:30
‘ఇంతటి నైపుణ్యం కలిగిన ఆటగాడిని గతంలో నేనెప్పుడూ ఎదుర్కోలేదు.. అతడో పర్ఫెక్ట్ ప్లేయర్’ వింబుల్డన్ ఫైనల్ ముగిశాక టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ అన్న మాటలివి. అవును.. కార్లోస్ అల్కరాస్ గురించే ఇదంతా. 20 ఏళ్ల ఈ స్పెయిన్ స్టార్
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
‘ఇంతటి నైపుణ్యం కలిగిన ఆటగాడిని గతంలో నేనెప్పుడూ ఎదుర్కోలేదు.. అతడో పర్ఫెక్ట్ ప్లేయర్’ వింబుల్డన్ ఫైనల్ ముగిశాక టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ అన్న మాటలివి. అవును.. కార్లోస్ అల్కరాస్ గురించే ఇదంతా. 20 ఏళ్ల ఈ స్పెయిన్ స్టార్ ఇప్పుడు ప్రపంచ టెన్నిస్‌పై తనదైన ముద్ర వేసేందుకు రెడీగా ఉన్నాడు. ఆరంభంలో క్లేకోర్టు స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నా.. యూఎస్ ఓపెన్ రూపంలో తొలి గ్రాండ్‌స్లామ్ అందుకుంది మాత్రం హార్డ్‌కోర్ట్‌పైనే. అలాగే తాజాగా గ్రాస్ కోర్టుపైనా చెలరేగి ప్రఖ్యాత వింబుల్డన్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇతర గ్రాండ్‌స్లామ్స్ గెలుపు ఎలా ఉన్నా గ్రాస్ కోర్టుల్లో ఆడి విజేతగా నిలవడం టెన్నిస్ ఆటగాళ్లకు అంత సులువు కాదు. కానీ ఇంకా కుర్ర ఛాయలుపోని అల్కరాస్ మాత్రం అత్యంత వేగంగా అన్ని కోర్టులకు అలవాటు పడిపోతున్నాడు. ముఖ్యంగా ఫెడరర్, నడాల్ లేని చోట ఎనిమిదో వింబుల్డన్ ఖాయమనుకున్న జొకోవిచ్‌కు.. ఆరేళ్ల తర్వాత సెంటర్ కోర్టులో ఓటమి రుచి చూపించాడు. అయితే అతడిని అల్కరాస్ ఓడించడం వెనుక పెద్ద ప్లానింగే ఉంది. పైగా గ్రాస్ కోర్టులో అతడికిది కేవలం నాలుగో టోర్నీయే. అందుకే కోచ్ జువాన్ కార్లోస్ ఫెరెరో తన శిష్యుడిని చాంపియన్‌గా చేసేందుకు తగిన ప్రణాళిక రచించాడు. బరిలోకి దిగడానికి ముందే ఈ కోర్టులపై ఆండీ మర్రే, రోజర్ ఫెడరర్, జొకోవిచ్‌ల ఆటతీరును ఇద్దరూ క్షుణ్ణంగా పరిశీలించారు. గంటల కొద్దీ వారి వీడియోలను చూస్తూ ఈ త్రయం ఆటను కాపీ కొట్టారట. అలాగే సెమీస్‌లో మెద్వెదేవ్‌ను ఓడించడంతో అల్కరాస్‌కు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎందుకంటే.. మెద్వెదేవ్ ఆట కాస్త జొకోవిచ్‌ను పోలి ఉంటుంది. ఫైనల్లోనూ అదే తరహా ఆటను ప్రదర్శించాలని భావించి సక్సెస్ అయ్యాడు. ఎక్కువగా వీరు బేస్‌లైన్ దగ్గర ఉండి ఆడేందుకు ఇష్టపడతారు. అందుకే జొకోను పదేపదే నెట్ దగ్గరికి రప్పించి అతడి లయను దెబ్బతీశాడు. దీంతో జొకోవిచ్ మైదానంలో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఓసారి తన రాకెట్‌ను నెట్‌కు బలంగా కొట్టి విరిచేశాడు. అలాగే సర్వీస్ వేసేందుకు కూడా ఎక్కువ సమయం తీసుకుంటూ అంపైర్ మందలింపునకు కూడా గురయ్యాడు. ఏదిఏమైనా వరల్డ్ నెంబర్‌వన్‌గా తన స్థానాన్ని పటిష్ఠం చేసుకుంటూ.. అల్కరాస్ నూతన శకానికి నాంది పలుకుతాడనడంలో సందేహం లేదు.
నువ్వు.. సూపర్
జొకోవిచ్‌ను ఓడించి వింబుల్డన్ గెలిచిన అల్కరాస్‌పై క్రీడా ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. ఇందులో తన దేశానికే చెందిన రఫెల్ నడాల్‌తో పాటు బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. ‘ఫైనల్ పోరు ఎంతో అద్భుతంగా సాగింది. ఇద్దరు ఆటగాళ్లు గొప్పగా ఆడారు. టెన్నిస్‌లో తదుపరి సూపర్‌స్టార్ ఎదుగుదలను మనం చూస్తున్నాం. గతంలో ఫెడరర్ కెరీర్‌ను గమనించినట్టుగానే, మరో 10-12 ఏళ్లు నేను అల్కరాస్‌ను ఫాలో అవుతాను. అతడికి నా అభినందనలు’ అంటూ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. ‘అల్కరాస్.. నీ విజయంతో మాకు ఎనలేని సంతోషాన్ని కలిగించావు. స్పెయిన్ టెన్నిస్‌లో మనందరి మార్గదర్శి మనోలో సాంటానా కూడా ఎక్కడున్నా నీ విజయాన్ని చూసి ఉప్పొంగిపోయి ఉంటాడు. గట్టిగా నీకో హగ్ ఇస్తున్నా. ఈ గెలుపును ఆస్వాదించు చాంపియన్’ అని ట్వీట్ చేసి తమ దేశ టెన్నిస్ వారసుడిని నడాల్ కొనియాడాడు.
టాప్-10లోకి..
వింబుల్డన్‌తో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్న మహిళల విజేత మార్కెటా వొండ్రుసోవా ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటింది. ప్రపంచ 42వ ర్యాంక్‌తో ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో అడుగుపెట్టిన ఈ చెక్ రిపబ్లిక్ స్టార్.. ఆ విజయంతో ఇప్పుడు ఏకంగా 32 స్థానాలు ముందంజ వేసింది. ఫలితంగా తాజా టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో వొండ్రుసోవా పదో ర్యాంకుతో టాప్-10లోకి చేరింది. వింబుల్డన్ క్వార్టర్స్‌లోనే ఓడినా స్వియటెక్ టాప్ ర్యాంక్‌ను మాత్రం నిలబెట్టుకుంది. సెమీస్‌లోనే వెనుదిరిగిన సబలెంకా 2వ ర్యాంక్‌లో, రిబకినా 3వ ర్యాంక్‌లో కూడా మార్పులేదు. పురుషుల సింగిల్స్‌లో కొత్త చాంపియన్‌గా అవతరించిన అల్కరాస్ తన నెంబర్‌వన్ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకున్నాడు. టైటిల్ కోల్పోయిన జొకోవిచ్ టాప్-2లోనే కొనసాగుతున్నాడు.
Updated Date - 2023-07-18T04:26:54+05:30 IST