ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sania Mirza: సానియా శకాంతం

ABN, First Publish Date - 2023-03-06T02:07:44+05:30

సొంతగడ్డపై జరిగిన వీడ్కోలు మ్యాచ్‌లో భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన రెండు మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ల్లోనూ సానియా జోడీ విజేతగా నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సొంత ఇలాఖాలో మ్యాచ్‌తో కెరీర్‌కు ఘన వీడ్కోలు

భావోద్వేగంతో కన్నీటి పర్యంతమైన టెన్నిస్‌ దిగ్గజం

మరింతమంది సానియాలను తయారు చేస్తానని ప్రకటన

భారత టెన్నిస్‌లో ఓ అద్వితీయ శకం ముగిసింది.. దేశంలో మహిళా టెన్నిస్‌కు పర్యాయపదంగా నిలిచిన హైదరాబాదీ.. ఊహకు కూడా రాని గ్రాండ్‌స్లామ్‌ ఘనతను సొంతం చేసుకున్న ప్రతిభాశాలి..

ఆరేళ్లకే రాకెట్‌ పట్టి.. ఆటే లోకంగా పెరిగి.. ఆపై దిగ్గజంగా ఎదిగి.. ఆత్మవిశ్వాసంతో ప్రతి దశలోనూ సవాళ్లను సమర్ధంగా దాటుకుంటూ ముందుకుసాగిన ధీశాలి..

రికార్డులను సొంతం చేసుకుని.. ఘన చరిత్రను ఖాతాలో వేసుకుని.. ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలిచిన సానియా మీర్జా తన ఇలాఖాలో ఆఖరాటతో కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది.

రెండు దశాబ్దాల క్రితం ఎక్కడైతే ప్రయాణం ప్రారంభించిందో.. అదే ఎల్బీ స్టేడియంలో.. కుటుంబ సభ్యులు, మిత్రులు, క్రీడా, రాజకీయ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో సానియా ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ఆడింది.

సుదీర్ఘ ప్రయాణంలో ఎదురైన ఒడిదొడుకులు.. అందిన ప్రోత్సాహం.. సాధించిన ఘనతలు అన్నీ తలుచుకుని.. భావోద్వేగంతో బైబై చెప్పింది.

ఇంతటితో నా బాధ్యత తీరలేదు.. దేశానికి మరింతమంది సానియాలు అవసరమని.. అలాంటివారిని తయారు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానంటూ హామీ ఇచ్చి ఆటలోలాగే అందరి మనసులు చూరగొంది.

ఎక్కడ మొదలైందో..అక్కడే ముగించి..

భావోద్వేగంతో సానియా కన్నీటిపర్యంతం

సొంతగడ్డపై ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ఆడిన సానియా మీర్జా

హాజరైన కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు, కేటీఆర్‌, యువరాజ్‌ సింగ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సొంతగడ్డపై జరిగిన వీడ్కోలు మ్యాచ్‌లో భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన రెండు మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ల్లోనూ సానియా జోడీ విజేతగా నిలిచింది. ఈ మ్యాచుల్లో సానియా, ఆమె బెస్ట్‌ ఫ్రెండ్‌ బెతానీ మాటెక్‌, కారా బ్లాక్‌, ఇవాన్‌ డోడిగ్‌, మరియన్‌ బర్తోలి పాల్గొన్నారు. ఇక, టెన్నిస్‌ కాంప్లెక్స్‌లోకి సానియా అడుగుపెట్టిన దగ్గర నుంచి కోర్టును వీడే వరకు ఆమె నామస్మరణతో స్టేడియం మార్మోగింది. మొత్తంగా 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు సానియా.. కుటుంబ సభ్యులు, మిత్రులు, అశేష అభిమాన సందోహం నడుమ ఘనంగా వీడ్కోలు పలికింది.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలోనే సానియా టెన్ని్‌సలో ఓనమాలు నేర్చుకుంది. 2002లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో తొలి పతకం సాధించిన సానియా ఆ తర్వాత 2004లో జరిగిన హైదరాబాద్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచి కెరీర్‌లో మొదటి డబ్ల్యూటీఏ టైటిల్‌ నెగ్గింది. ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ముగిశాక ఇచ్చిన వీడ్కోలు సందేశంలో కెరీర్‌లో సాధించిన విజయాలు, ఎదురైన ఒడిదుడుకులను తలుచుకుని సానియా భావోద్వేగానికి లోనై, కన్నీటి పర్యంతమైంది. సానియా ఆఖరి మ్యాచ్‌ను ప్రత్యేక్షంగా వీక్షించేందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, క్రీడామంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, శాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయ గౌడ్‌, మాజీ క్రికెటర్లు అజరుద్దీన్‌, యువరాజ్‌ సింగ్‌, హీరో దుల్కర్‌ సల్మాన్‌ తరలివచ్చారు.

యువరాజ్‌తో తలపడిన సానియా:

సానియా ఫేర్‌వెల్‌ మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌ సందడి చేశాడు. రెండు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు జరగగా.. సానియా-ఇవాన్‌ డోడిగ్‌ జంటతో యువరాజ్‌-బెతానీ మాటెక్‌ జోడీ తలప డింది. ఇందులో సానియా ద్వయం గెలిచింది.

మహిళా శక్తి చాటింది: కేటీఆర్‌

పురుషాధిక్యం కొనసాగుతున్న దేశ క్రీడారంగంలో మహిళా శక్తిని చాటిన గొప్ప క్రీడాకారిణి సానియా మీర్జా అని మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి ఒక సాధారణ క్రీడాకారిణిగా కెరీర్‌ను ప్రారంభించి, ప్రపంచ ప్రఖ్యాతి స్టార్‌గా ఆమె తన కెరీర్‌ను మలుచుకున్న తీరు యువ క్రీడాకారులకు ఆదర్శప్రాయమన్నారు. సానియాకు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉందో, భవిష్యత్‌లోనూ అన్ని విధాలా సహాయ సహకారలందిస్తామని కేటీఆర్‌ అన్నారు.

మరో సానియాను తయారు చేస్తా..

ఇంతకంటే గొప్ప వీడ్కోలు కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. కన్నీళ్లను ఆపుకోవాలని ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. టెన్ని్‌సను, మీ అభిమానాన్ని మిస్‌ అవుతున్నానని బాధగా ఉంది. నా కెరీర్‌కు ఎక్కడైతే పునాది పడిందో అక్కడే ఆటకు వీడ్కోలు పలకడం అదృష్టంగా భావిస్తున్నా. 2002లో జాతీయ క్రీడల్లో ఇక్కడ సాధించిన పతకం మొదలు, కెరీర్‌లో అందుకున్న విజయాలన్నీ కళ్ల ముందు కదలాడుతున్నాయి. టెన్ని్‌సను ఒక అబ్బాయి కెరీర్‌గా ఎంచుకోవాలంటేనే ఆలోచించే రోజుల్లో నేను ఆ క్రీడలోకి ప్రవేశించడం, ఈస్థాయికి రావడం ఇప్పటికీ ఒక కలలా ఉంది. దేశానికి సుదీర్ఘకాలం ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా, గర్వంగా భావిస్తున్నా. దేశానికి మరింత మంది సానియాలు అవసరం. కచ్చితంగా మరో సానియాను తయారు చేస్తా. ప్రభుత్వ సహకారంతో ఇందుకోసం శాయశక్తులా కృషి చేస్తా.

- సానియా మీర్జా

Updated Date - 2023-03-06T02:07:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising