IPL SRH vs KKR : బ్రూక్ బాదేశాడు
ABN, First Publish Date - 2023-04-15T03:48:50+05:30
13, 3, 13.. ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్‌ల్లో హ్యారీ బ్రూక్ స్కోర్లివి. రూ.13.25 కోట్లతో కొనుగోలు చేసినా జట్టుకు భారంగా మారిన ఈ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్.. ఎట్టకేలకు జూలు విదిల్చాడు. ఇదిగో నా సత్తా అంటూ ఏకంగా అజేయ శతకంతో అదరగొట్టాడు.
23 రన్స్‌తో సన్‌రైజర్స్ విజయం
రాణా, రింకూ పోరాటం వృథా
కోల్‌కతాకు తప్పని ఓటమి
హ్యారీ బ్రూక్ (55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 నాటౌట్)
13, 3, 13.. ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్‌ల్లో హ్యారీ బ్రూక్ స్కోర్లివి. రూ.13.25 కోట్లతో కొనుగోలు చేసినా జట్టుకు భారంగా మారిన ఈ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్.. ఎట్టకేలకు జూలు విదిల్చాడు. ఇదిగో నా సత్తా అంటూ ఏకంగా అజేయ శతకంతో అదరగొట్టాడు. అతడికి జతగా మార్‌క్రమ్ కూడా చెలరేగడంతో సన్‌రైజర్స్ అలవోకగా 220+ స్కోరు సాధించింది. ఇక భారీ ఛేదనలో 20 రన్స్‌కే మూడు వికెట్లు పడినా కోల్‌కతా అద్భుతంగానే పోరాడింది. కెప్టెన్ నితీశ్ రాణా, రింకూ సింగ్ మెరుపు అర్ధ సెంచరీలతో మ్యాచ్‌ను ఆఖరి ఓవర్‌కు తెచ్చినా ఫలితం లేకపోయింది.
బ్రూక్ చేసిన సెంచరీ ఈ ఐపీఎల్ సీజన్‌లోనే మొదటిది.
ఐపీఎల్‌లో ఎక్కువసార్లు (14) డకౌట్ అయిన రెండో బ్యాటర్‌గా నరైన్. మన్‌దీప్ సింగ్ (15) టాప్‌లో ఉన్నాడు.
కోల్‌కతా: సన్‌రైజర్స్ గాడిలో పడింది. మరోసారి ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకుంటూ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మురిపించింది. ఓపెనర్ హ్యారీ బ్రూక్ (55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 నాటౌట్) తుఫాన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బౌలర్లు సైతం రాణించడంతో శుక్రవారం కోల్‌కతాతో జరిగిన ఈ మ్యాచ్‌లో 23 రన్స్ తేడాతో హైదరాబాద్ ఘనవిజయం అందుకుంది. ముందుగా సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసింది. మార్‌క్రమ్ (26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 50), అభిషేక్ శర్మ (17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32), క్లాసెన్ (6 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 16 నాటౌట్) వేగంగా ఆడారు. రస్సెల్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసి ఓడింది. నితీశ్ రాణా (41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 75), రింకూ సింగ్ (31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 58 నాటౌట్) పోరాటం సరిపోలేదు. మార్కండే, జాన్సెన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా బ్రూక్ నిలిచాడు.
రాణా, రింకూ మాత్రమే.. : 229 పరుగుల భారీ ఛేదనలో కోల్‌కతా ఇన్నింగ్స్ ఆరంభంలోనే తడబడినా.. కెప్టెన్ నితీశ్ రాణా, రింకూ సింగ్ మాత్రం రన్‌రేట్ తగ్గకుండా భారీ షాట్లతో చెలరేగారు. కానీ లక్ష్యం మరీ ఎక్కువ కావడంతో చేసేదేమీ లేకపోయింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన భువనేశ్వర్ మూడో బంతికే గుర్బాజ్ (0)ను అవుట్ చేశాడు. ఇక జాన్సెన్ నాలుగో ఓవర్‌లో వరుసగా వెంకటేశ్ అయ్యర్ (10), నరైన్ (0)ల పనిబట్టడంతో 20/3 స్కోరుతో కేకేఆర్ కష్టాల్లో పడింది.
అయితే ఉమ్రాన్ ఓవర్‌లో రాణా 4,6,4,4,4,6తో చెలరేగి 28 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లేలో 62 రన్స్‌తో పుంజుకుంది. రాణాకు జగదీశన్ (36) సహకరించడంతో నాలుగో వికెట్‌కు 62 పరుగులు జత చేరాయి. తొమ్మిదో ఓవర్‌లో జగదీశన్‌ను మార్కండే అవుట్ చేశాడు. అటు రస్సెల్ (3) ఎప్పటిలాగే నిరాశపరిచాడు. 12వ ఓవర్‌లో సిక్సర్ బాదిన రాణా 25 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన రింకూ సింగ్ సైతం తన శైలిలోనే ఆడాడు. 16వ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో వణికించాడు. చివరి నాలుగు ఓవర్లలో 70 రన్స్ కావాల్సిన దశలో ఓ సిక్సర్ బాదిన రాణాను నటరాజన్ అవుట్ చేయడంతో ఆరో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 19వ ఓవర్‌లో 3 ఫోర్లతో రింకూ 16 రన్స్ సాధించగా సమీకరణం ఆరు బంతులు.. 32కి మారింది. దీంతో రింకూ ఈ మ్యాచ్‌ను ఎలా ముగిస్తాడోననే ఆసక్తి వ్యక్తమైంది. కానీ ఉమ్రాన్ తొలి బంతికే శార్దూల్ (12) వికెట్‌ను తీసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇవ్వడంతో రైజర్స్ సంబరాల్లో మునిగింది.
హ్యారీ ఎదురుదాడి: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్‌కు హ్యారీ బ్రూక్ అదరగొట్టే ఆటతీరుతో భారీస్కోరు అందించాడు. ముఖ్యంగా పేసర్లను బ్రూక్ ఓ ఆటాడేసుకున్నాడు. తొలి ఓవర్‌లోనే మూడు ఫోర్లతో బాదుడుకు తెర లేపి.. మూడో ఓవర్‌లో రెండు సిక్సర్లతో 15 రన్స్ రాబట్టాడు. అయితే ఐదో ఓవర్‌లో మయాంక్ అగర్వాల్ (9), రాహుల్ త్రిపాఠి (9)లను అవుట్ చేసి రస్సెల్ గట్టి షాకే ఇచ్చాడు. కానీ బ్రూక్ ధాటికి పవర్‌ప్లేలో రైజర్స్ 65 పరుగులు సాధించడం విశేషం. అనంతరం స్పిన్నర్ల కట్టుదిట్టమైన బంతులకు 8-11 ఓవర్ల మధ్య జట్టు స్కోరు నెమ్మదించింది. అటు 12 బంతుల్లోనే 32 పరుగులు చేశాక స్పిన్నర్ల బౌలింగ్‌లో బ్రూక్ నెమ్మదించాడు. అలాగే 45 పరుగుల వద్ద అతడిచ్చిన రిటర్న్ క్యాచ్‌ను సుయాష్ వదిలేయగా, చివరికి 32 బంతుల్లోనే లీగ్‌లో తొలి ఫిఫ్టీని పూర్తి చేశాడు. మరోవైపు కెప్టెన్ మార్‌క్రమ్ 12వ ఓవర్ నుంచి ధనాధన్ ఆటతో స్కోరులో వేగం పుంజుకుంది. ఆ ఓవర్‌లో 6,6,4 బాది 16 రన్స్ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లోనూ 4,6తో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఐదో బంతికి మరో భారీ షాట్ కోసం ప్రయత్నించి రస్సెల్‌కు మార్‌క్రమ్ క్యాచ్ ఇచ్చాడు. అప్పటికే రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం సమకూరింది. 15వ ఓవర్‌లో పేసర్ ఫెర్గూసన్‌కు బంతి ఇవ్వడంతో బ్రూక్ 6,4,4,4,4తో ఏకంగా 23 రన్స్ రాబట్టాడు. మరో ఎండ్‌లో అభిషేక్ మాత్రం స్పిన్నర్లు సుయాష్, నరైన్ ఓవర్లలో ధాటిని కనబరుస్తూ బౌండరీలతో హోరెత్తించాడు. 16వ ఓవర్‌లో రెండు ఫోర్లు, 17వ ఓవర్‌లో 4,6తో చెలరేగాడు. ఈ ఇద్దరి జోరుకు 18వ ఓవర్‌లోనే స్కోరు 200 చేరింది. అయితే 19వ ఓవర్ తొలి బంతికి అభిషేక్‌ను అవుట్ చేసిన రస్సెల్ కండరాలు పట్టేయడంతో మైదానం వీడాడు. కానీ ఇదే ఓవర్‌లో క్లాసెన్ రెండు, బ్రూక్ మరో ఫోర్‌తో చెలరేగగా.. ఆఖరి ఓవర్‌లో బ్రూక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
స్కోరుబోర్డు
సన్‌రైజర్స్: హ్యారీ బ్రూక్ (నాటౌట్) 100, మయాంక్ అగర్వాల్ (సి) వరుణ్ (బి) రస్సెల్ 9, రాహుల్ త్రిపాఠి (సి) రహ్మనుల్లా (బి) రస్సెల్ 9, మార్‌క్రమ్ (సి) రస్సెల్ (బి) వరుణ్ 50, అభిషేక్ శర్మ (సి) శార్దూల్ (బి) రస్సెల్ 32, క్లాసెన్ (నాటౌట్) 16, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 228/4; వికెట్ల పతనం: 1-46, 2-57, 3-129, 4-201; బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 3-0-42-0, ఫెర్గూసన్ 2-0-37-0, నరైన్ 4-0-28-0, రస్సెల్ 2.1-0-22-3, వరుణ్ చక్రవర్తి 4-0-41-1, సుయాశ్ శర్మ 4-0-44-0, శార్దూల్ ఠాకూర్ 0.5-0-14-0.
కోల్‌కతా: రహ్మనుల్లా (సి) ఉమ్రాన్ (బి) భువనేశ్వర్ 0, జగదీశన్ (సి/సబ్) ఫిలిప్స్ (బి) మార్కండే 36, వెంకటేశ్ అయ్యర్ (సి) మార్‌క్రమ్ (బి) జాన్సెన్ 10, నరైన్ (సి) మార్‌క్రమ్ (బి) జాన్సెన్ 0, నితీశ్ రాణా (సి) వాషింగ్టన్ (బి) నటరాజన్ 75, రస్సెల్ (సి) జాన్సెన్ (బి) మార్కండే 3, రింకూ సింగ్ (నాటౌట్) 58, శార్దూల్ (సి) వాషింగ్టన్ (బి) ఉమ్రాన్ 12, ఉమేశ్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 205/7; వికెట్ల పతనం: 1-0, 2-20, 3-20, 4-82, 5-96, 6-165, 7-197; బౌలింగ్: భువనేశ్వర్ 4-1-29-1, జాన్సెన్ 4-0-37-2, నటరాజన్ 4-0-54-1, ఉమ్రాన్ మాలిక్ 2-0-36-1, మయాంక్ మార్కండే 4-0-27-2, వాషింగ్టన్ సుందర్ 2-0-20-0.
Updated Date - 2023-04-15T03:48:50+05:30 IST