WPL opening ceremony : థిల్లాన్ పాట జోరు.. కియార, క్రితి నృత్యహోరు..
ABN, First Publish Date - 2023-03-05T00:32:15+05:30
బాలీవుడ్ అందాల తారలు కియార ఆడ్వాణీ, క్రితి సనన్ నృత్యాలతో హోరెత్తించగా, పంజాబీ సింగర్ ఏపీ థిల్లాన్ పాటలతో మైమరపించిన వేళ..తొలి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)
అదిరిన డబ్ల్యూపీఎల్ ఆరంభ వేడుకలు
ముంబై: బాలీవుడ్ అందాల తారలు కియార ఆడ్వాణీ, క్రితి సనన్ నృత్యాలతో హోరెత్తించగా, పంజాబీ సింగర్ ఏపీ థిల్లాన్ పాటలతో మైమరపించిన వేళ..తొలి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆరంభోత్సవం హుషారుగా సాగింది. ఇక్కడి డీవై పాటిల్ స్టేడియంలో శనివారం సాయంత్రం గంటపాటు జరిగిన ప్రారంభ వేడుకలు ఫ్యాన్స్‌ను ఓలలాడించాయి. పలు బాలీవుడ్ గీతాలకు కియార డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అనంతరం క్రితి సనన్ ప్రవేశించడంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెండింతలైంది. తన స్టెప్పులతో స్టేడియం మొత్తాన్ని క్రితి మరో లోకంలో విహరింపజేసింది. ఆపై థిల్లాన్ తన మృదుమధుర గీతాలతో ఫ్యాన్స్‌ను మంత్రముగ్దులను చేశాడు. మొత్తంగా కియార, క్రితి, థిల్లాన్ ప్రారంభోత్సవాన్ని వహ్..వా అనిపించారు. అనంతరం ఐదు జట్ల కెప్టెన్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, అలీసా హీలీ, మెగ్ లానింగ్, బెత్ మూనీ స్టేజ్‌పైకి వచ్చారు. వారందరి సమక్షంలో డబ్ల్యూపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించడంతో ప్రారంభోత్సవం ముగిసింది.
Updated Date - 2023-03-05T00:32:15+05:30 IST