Lucknow Supergiants: ‘సూపర్’ జెయింట్స్
ABN, First Publish Date - 2023-05-17T00:51:03+05:30
అటు బ్యాటింగ్‌లో.. ఇటు బౌలింగ్‌లో పట్టు వదలని పోరాటంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఆకట్టుకుంది. ఒత్తిడిని అధిగమిస్తూ ముంబై ఇండియన్స్‌పై 5 పరుగులతో నెగ్గింది.
ఆఖరి ఓవర్‌లో మొహిసిన్ మ్యాజిక్
ముంబైపై 5 రన్స్‌తో లఖ్‌నవూ విజయం
చెలరేగిన స్టొయినిస్
స్టొయినిస్(89 నాటౌట్)
లఖ్‌నవూ: అటు బ్యాటింగ్‌లో.. ఇటు బౌలింగ్‌లో పట్టు వదలని పోరాటంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఆకట్టుకుంది. ఒత్తిడిని అధిగమిస్తూ ముంబై ఇండియన్స్‌పై 5 పరుగులతో నెగ్గింది. చివరి ఓవర్‌లో ప్రత్యర్థికి 11 పరుగులు కావాల్సిన వేళ.. లఖ్‌నవూ పేసర్ మొహిసిన్ 5 పరుగులే ఇవ్వడంతో ముంబై కంగుతింది. అటు 15 పాయింట్లతో మూడో స్థానానికి చేరిన ఎల్‌ఎస్‌జీ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా లఖ్‌నవూ 20 ఓవర్లలో 3 వికెట్లకు 177 రన్స్ చేసింది. స్టొయినిస్ (47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 నాటౌట్), క్రునాల్ పాండ్యా (49 రిటైర్డ్ హర్ట్) రాణించారు. ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 172/5 స్కోరు చేసి ఓడింది. ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 59), రోహిత్ (25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 37), టిమ్ డేవిడ్ (19 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 32 నాటౌట్) పోరాడారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా స్టొయినిస్ నిలిచాడు.
బౌలర్ల పట్టు:
లఖ్‌నవూ ఆటకు భిన్నంగా ముంబై ఆరంభంలోనే చెలరేగింది. ఓపెనర్లు ఇషాన్, రోహిత్‌ల ఎదురుదాడికి 11 ఓవర్లలో 103 స్కోరుతో నిలిచింది. ఓవర్‌కు పది రన్‌రేట్‌తో ఈ జోడీ కదం తొక్కగా.. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత ముంబై ఆట గతి తప్పింది. మధ్య ఓవర్లలో ఎల్‌ఎస్‌జీ బౌలర్లు పట్టు బిగించారు. ఆఖర్లో డేవిడ్ బాదుడుతో ఆశలు రేపినా చివరి ఓవర్‌లో ఝలక్ తింది. ఆరంభంలో ఓపెనర్లు భారీ సిక్సర్లతో విరుచుకుపడడంతో పరుగులు అవలీలగా వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలోనే 58 పరుగులు సాధించింది.
ఏడో ఓవర్‌లోనూ ఇషాన్ 2 ఫోర్లు తీయగా.. పదో ఓవర్‌లో ఈ ప్రమాదకర జోడీకి బిష్ణోయ్ బ్రేక్ వేశాడు. రోహిత్‌ను అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత 11వ ఓవర్‌లో రెండు ఫోర్లతో ఇషాన్ 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. అయితే బిష్ణోయ్ తన తర్వాతి ఓవర్‌లో ఇషాన్‌ను అవుట్ చేయడంతో ముంబై ఇన్నింగ్స్ తడబడింది. సూర్యకుమార్ (7), నేహల్ (16) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 12 బంతుల్లో సమీకరణం 30 రన్స్‌కు మారడంతో డేవిడ్ 19వ ఓవర్‌లో 6,4,6తో 19 రన్స్‌తో అదరగొట్టాడు. అయితే చివరి ఓవర్‌లో మొహిసిన్ సూపర్ యార్కర్లతో ఐదు పరుగులే ఇచ్చి లఖ్‌నవూ శిబిరంలో సంతోషం నింపాడు.
ఆఖర్లో స్టొయినిస్ వీరంగం:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలం కావడంతో పాటు 17వ ఓవర్ వరకు వీరి ఆట కనాకష్టంగా సాగింది. 150 రన్స్ సాధించడమే కష్టం అనిపించిన వేళ.. ఆఖరి మూడు ఓవర్లలో స్టొయినిస్ ఉతికేయడంతో జట్టు భారీ స్కోరు చేసింది. అంతకుముందు ఓపెనర్‌గా బరిలోకి దిగిన దీపక్ హుడా (5), ప్రేరక్ మన్కడ్ (0)లను బెహ్రెన్‌డార్ఫ్ మూడో ఓవర్‌లోనే అవుట్ చేశాడు. అటు ఫామ్‌లో ఉన్న డికాక్ (16)ను స్పిన్నర్ చావ్లా దెబ్బతీయడంతో 35/3 స్కోరుతో జట్టు ఇబ్బందుల్లో పడింది. ఈ పిచ్‌పై పరుగులు రావడం కష్టంగా మారడంతో కెప్టెన్ క్రునాల్, స్టొయినిస్ ఓపికను కనబర్చారు. కుదరుకునేందుకు కాస్త సమయం తీసుకుంటూ నెమ్మదిగా స్కోరును పెంచారు. స్పిన్నర్ చావ్లా ఓవర్లలో ఇద్దరూ ఒక్కో సిక్స్ బాదడంతో 14 ఓవర్లలో స్కోరు వంద పరుగులకు చేరింది. అయితే 16వ ఓవర్ చివరి బంతికి క్రునాల్ 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గాయంతో మైదానం వీడాడు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 82 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత 18వ ఓవర్‌లో స్టొయినిస్ జట్టుకు ఊపిరి పోశాడు. జోర్డాన్ వేసిన ఈ ఓవర్‌లో స్టొయినిస్ 6,4,4,6,4తో 24 పరుగులు రాబట్టడంతో పాటు 36 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. చివరి రెండు ఓవర్లలో 30 రన్స్ కావడంతో లఖ్‌నవూ గట్టి స్కోరే సాధించింది.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
గుజరాత్ 13 9 4 0 18 0.835
చెన్నై 13 7 5 1 15 0.381
లఖ్‌నవూ 13 7 5 1 15 0.304
ముంబై 13 7 6 0 14 –0.128
బెంగళూరు 12 6 6 0 12 0.166
రాజస్థాన్ 13 6 7 0 12 0.140
కోల్‌కతా 13 6 7 0 12 –0.256
పంజాబ్ 12 6 6 0 12 –0.268
హైదరాబాద్ 12 4 8 0 8 –0.575
ఢిల్లీ 12 4 8 0 8 –0.686
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
స్కోరుబోర్డు
లఖ్‌నవూ:
దీపక్ హుడా (సి) డేవిడ్ (బి) బెహ్రెన్‌డార్ఫ్ 5, డికాక్ (సి) ఇషాన్ (బి) చావ్లా 16, ప్రేరక్ మన్కడ్ (సి) ఇషాన్ (బి) బెహ్రెన్‌డార్ఫ్ 0, క్రునాల్ (రిటైర్డ్ హర్ట్) 49, స్టొయినిస్ (నాటౌట్) 89, పూరన్ (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 177/3; వికెట్ల పతనం: 1–12, 2–12, 3–35, 3–117 (పాండ్యా రిటైర్డ్‌హర్ట్); బౌలింగ్: బెహ్రెన్‌డార్ఫ్ 4–0–30–2, జోర్డాన్ 4–0–50–0, హృతిక్ 3–0–20–0, పీయూష్ చావ్లా 3–0–26–1, ఆకాశ్ 4–0–30–0, గ్రీన్ 2–0–16–0.
ముంబై:
ఇషాన్ (సి) నవీన్ (బి) బిష్ణోయ్ 59, రోహిత్ (సి) హుడా (బి) బిష్ణోయ్ 37, సూర్యకుమార్ (బి) యశ్ ఠాకూర్ 7, నేహల్ వధేరా (సి/సబ్) గౌతమ్ (బి) మొహిసిన్ 16, టిమ్ డేవిడ్ (నాటౌట్) 32, విష్ణు వినోద్ (సి) పూరన్ (బి) యశ్ ఠాకూర్ 2, గ్రీన్ (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 20 ఓవర్లలో 172/5; వికెట్ల పతనం: 1–90, 2–103, 3–115, 4–131, 5–145; బౌలింగ్: క్రునాల్ 4–0–27–0, మొహిసిన్ 3–0–26–1, నవీన్ ఉల్ హక్ 4–0–37–0, యశ్ ఠాకూర్ 4–0–40–2, స్వప్నిల్ 1–0–11–0, రవి బిష్ణోయ్ 4–0–26–2.
Updated Date - 2023-05-17T00:51:03+05:30 IST