Men's Hockey World Cup: ఫేవరెట్ ఫోర్
ABN, First Publish Date - 2023-01-11T02:52:42+05:30
మరో రెండురోజుల్లో పురుషుల హాకీ ప్రపంచ కప్‌నకు తెరలేవనుంది. 13 నుంచి 29 వరకు ఒడిశాలోని భువనేశ్వర్, రూర్కెలా వేదికలుగా జరగనున్న మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు బరిలో దిగుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): మరో రెండురోజుల్లో పురుషుల హాకీ ప్రపంచ కప్‌నకు తెరలేవనుంది. 13 నుంచి 29 వరకు ఒడిశాలోని భువనేశ్వర్, రూర్కెలా వేదికలుగా జరగనున్న మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు బరిలో దిగుతున్నాయి. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో అర్జెంటీనా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే పోరుతో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇక బలమైన స్పెయిన్, ఇంగ్లండ్ జట్లతో కూడిన గ్రూప్ ‘డి’లో భారత్ బరిలో దిగుతోంది. దాంతో క్వాలిఫయింగ్ రౌండ్ టీమిండియాకు సవాలే. ఇకపోతే..టోర్నీలో తలపడుతున్న టాప్-4 జట్లను పరిశీలిస్తే..
బెల్జియం:
డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం భువనేశ్వర్‌లో అడుగుపెట్టినపుడు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఎయిర్‌పోర్టుకు తరలివచ్చి స్వాగతం పలకడం ఆ జట్టు క్రేజ్‌కు నిదర్శనం. జర్మనీ, జపాన్, సౌత్‌కొరియా వంటి హేమాహేమీ జట్లతో కూడిన గ్రూప్ ‘బి’లో బెల్జియం అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. భువనేశ్వర్‌లో 14న కొరియాతో మ్యాచ్ ద్వారా బెల్జియం తన పోరాటాన్ని ఆరంభిస్తుంది. ఫెలిక్స్ డెనాయెర్ సారథ్యంలోని బెల్జియం గత టోర్నీ మాదిరే సత్తా చాటి ట్రోఫీని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. అదే జరిగితే పాకిస్థాన్ (1978,1982), జర్మనీ (2002, 2006), ఆస్ట్రేలియా (2010, 2014) తర్వాత ఈ ఫీట్ సాధించిన తొలి జట్టుగా బెల్జియం నిలుస్తుంది.
జర్మనీ:
ఈసారి టోర్నీలో ఆడుతున్న అన్ని జట్లలో కంటే జర్మనీలోనే ఎక్కువమంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నారు. ప్రపంచ హాకీలో ఘనమైన చరిత్ర కలిగిన ఆ జట్టు మూడోసారి కప్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 14న జపాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
నెదర్లాండ్స్:
థియరీ బ్రింక్‌మన్ కెప్టెన్సీలో నెదర్లాండ్స్ జట్టు నాలుగోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడడమే ధ్యేయంగా బరిలో దిగుతోంది. ఆ జట్టు..14న రూర్కెలాలో జరిగే తొలి పోరులో మలేసియాను ఢీకొంటుంది. 1973, 1990, 1998లో టైటిల్ గెలిచిన డచ్ జట్టు..గత రెండు టోర్నీలలో ఫైనల్‌కు చేరింది. చిలీ, మలేసియా, న్యూజిలాండ్‌తో కలిసి గ్రూప్ ‘సి’లో నెదర్లాండ్స్ తలపడుతోంది.
ఆస్ట్రేలియా:
అర్జెంటీనా, ఫ్రాన్స్, సౌత్‌కొరియాతో కలిసి గ్రూప్ ‘ఎ’లో ఆస్ట్రేలియా ఉంది. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఈసారి టోర్నమెంట్‌లో అతి పటిష్టమైన జట్టుగా చెప్పాలి. మూడుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా..వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక విజయాలు, అత్యధిక గోల్స్ చేసిన జట్టు రికార్డును కలిగివుంది. ఇప్పటివరకు జరిగిన టోర్నీలలో 92 మ్యాచ్‌లు ఆడి 69 గెలుపొందింది.
Updated Date - 2023-01-11T02:52:47+05:30 IST