Pragnananda: టైబ్రేక్‌కు తీసుకెళ్లాడు
ABN, First Publish Date - 2023-08-21T04:29:49+05:30
ఫిడే వరల్డ్ కప్ చెస్ సెమీఫైనల్‌లో 18 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద అద్భుతంగా ఆడుతున్నాడు. 31 ఏళ్ల అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరౌనాతో నువ్వా..నేనా అనేలా తలపడుతున్నాడు.
ఫాబియానోతో రెండో గేమ్‌నూ డ్రా చేసిన ప్రజ్ఞానంద
నేడు తేలనున్న సెమీస్ ఫలితం
ఫైనల్లో కార్ల్‌సన్
చెస్ వరల్డ్ కప్
బాకు (అజర్‌బైజాన్): ఫిడే వరల్డ్ కప్ చెస్ సెమీఫైనల్‌లో 18 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద అద్భుతంగా ఆడుతున్నాడు. 31 ఏళ్ల అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరౌనాతో నువ్వా..నేనా అనేలా తలపడుతున్నాడు. వరల్డ్ నెం.3 ఫాబియానోను సెమీస్ తొలి గేమ్‌లో 78 ఎత్తుల్లో నిలువరించిన ప్రజ్ఞానంద..ఆదివారంనాటి రెండో గేమ్‌లోనూ అతడికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తెల్లపావులతో ఆడిన చెన్నై టీనేజర్ గేమ్‌లో చాలాభాగం వెనుకంజలోనే నిలిచాడు. అయినా పట్టువీడకుండా పోరాడి 47 ఎత్తుల్లో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. దాంతో భారత ఆటగాడితో ఫాబియానో అర పాయింట్ పంచుకోక తప్పలేదు. ప్రజ్ఞానంద-కరౌనా చెరో పాయింట్‌తో ఉండడంతో.. విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేకర్ నిర్వహిస్తారు. నెం.1 మాగ్నస్ కార్ల్‌సన్ ఊహించినట్టుగానే ఫైనల్‌కు చేరాడు. స్థానిక గ్రాండ్‌మాస్టర్ అబసోవ్ నిజత్‌తో జరిగిన సెమీఫైనల్ రెండో గేమ్‌ను కార్ల్‌సన్ డ్రా చేశాడు. శనివారం జరిగిన మొదటి గేమ్‌లో నెగ్గడంతో 1.5-0.5తో కార్ల్‌సన్ తుదిపోరుకు చేరాడు. ఈ టోర్నీలో కార్ల్‌సన్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి.
Updated Date - 2023-08-21T04:31:24+05:30 IST