Indian doubles top shuttlers: ‘కొరియా’ను కొల్లగొట్టారు
ABN, First Publish Date - 2023-07-24T02:45:10+05:30
భారత డబుల్స్ టాప్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి జంట సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తోంది.
సాత్విక్ జోడీ ఖాతాలో మరో టైటిల్
ఫైనల్లో ప్రపంచ నెంబర్‌వన్ జంటకు షాక్
ప్రత్యర్థి వరల్డ్ నెం:1 జోడీ..
అందునా తొలి గేమ్ చేజారింది. ఇలాంటి పరిస్థితుల్లో పుంజుకోవడం చాలా కష్టం. కానీ, సాత్విక్ జంట అద్భుతం చేసింది. వెనుకంజలో ఉన్నా, మొక్కవోని ధైర్యంతో పోరాడింది. అగ్రశ్రేణి జోడీని ఓడించి.. కొరియా ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకొంది.
యోసు (కొరియా): భారత డబుల్స్ టాప్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి జంట సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తోంది. వెనుకంజలో నిలిచినా అసామాన్య పోరాటాన్ని ప్రదర్శించిన సాత్విక్ జోడీ.. టాప్‌సీడ్ ద్వయాన్ని ఓడించి కొరియా ఓపెన్ సూపర్ 500 టోర్నీ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన థ్రిల్లింగ్ ఫైనల్లో మూడో సీడ్ సాత్విక్-చిరాగ్ జోడీ 17-21, 21-13, 21-14తో ఇండోనేసియాకు చెందిన వరల్డ్ నెం.1 అల్ఫియాన్-అర్డియాంటో జంటపై మూడు గేమ్‌లపాటు పోరాడి గెలిచింది. ఈ ఏడాది నాలుగో టైటిల్‌ను సొంతం చేసుకొంది. అంతకుముందు స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షి్‌ప, ఇండోనేసియా టైటిళ్లను దక్కించుకొంది.
వెనుకంజలో ఉన్నా..
పుంజుకొని: తొలి గేమ్ ఆరంభం నుంచే అల్ఫియాన్ జోడీ దూకుడు కనబర్చింది. 16-19 స్కోరువద్ద సాత్విక్ జంట పుంజుకున్నా.. అల్ఫియాన్ ద్వయం మరో రెండు పాయింట్లు సాధించి మొదటి గేమ్‌ను సొంతం చేసుకొంది. కానీ, రెండో గేమ్‌లో సాత్విక్ ద్వయం బలంగా పుంజుకొంది. 17-11 స్కోరువద్ద వరుసగా పాయింట్లు సాధించిన సాత్విక్ జోడీ రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్ ఫలితాన్ని ఆఖరి గేమ్‌కు తీసుకెళ్లింది. నిర్ణాయక మూడో గేమ్‌లో జాగ్రత్తగా ఆడిన సాత్విక్-చిరాగ్‌లు 11-8తో ముందంజ వేశారు. విరామం తర్వాత భారత షట్లర్లు దూకుడు పెంచడంతో ఒత్తిడికి గురైన టాప్‌సీడ్ జోడీ పదేపదే తప్పిదాలు చేసింది. దీంతో 18-12తో ఆధిక్యం సాధించిన సాత్విక్ జంట.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను కైవసం చేసుకొంది.
అతడు నడాల్.. నేను ఫెడరర్
మేమిద్దరం టెన్నిస్ స్టార్లు ఫెడరర్, నడాల్ లాంటి మనస్తత్వం గలవాళ్లం. నేను ఫెడెక్స్ అభిమానినైతే.. చిరాగ్‌కు రఫా అంటే ఇష్టం. మా ఆట తీరుకూడా అలాగే ఉంటుంది. అతడిది దూకుడైన ఆటైతే.. నాది ప్రశాంతంగా ఉంటుంది. మ్యాచ్‌లో ఇద్దరి ఆలోచనలూ ఒకేలా ఉన్నా.. కోర్టులో స్పందించే తీరు చాలా భిన్నం. నడాల్ తరహాలో చిరాగ్ ప్రతి పాయింట్ కోసం పోరాడతాడు. కోర్టు మొత్తం కలియదిరుగుతాడు.
- సాత్విక్ సాయిరాజ్
.
ఏటీపీ చాలెంజర్ విజేత సుమిత్
తాంపెరె (ఫిన్లాండ్): భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగల్ కెరీర్‌లో నాలుగో ఏటీపీ చాలెంజర్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన తాంపెరె ఓపెన్ ఫైనల్లో నగల్ 6-4, 7-5తో దాలిబోర్ సివిసినా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి టైటిల్ దక్కించుకున్నాడు. ఇప్పటివరకు ఐదు ఏటీపీ చాలెంజర్ ఫైనల్స్‌లో ఆడిన నగల్, అందులో నాలుగు గెలవడం విశేషం. ఈ ఏడాది నగల్‌కు ఇది రెండో ఏటీపీ టైటిల్.
Updated Date - 2023-07-24T02:49:27+05:30 IST