ఫైనల్లో.. టీమిండియా ప్రత్యర్థి ఎవరు?
ABN, First Publish Date - 2023-09-14T01:17:32+05:30
భారత జట్టు ఆసియా కప్ ఫైనల్‌కు చేరింది. సూపర్-4 రెండు మ్యాచ్‌లనూ గెలిచిన మనోళ్లు నాలుగు పాయింట్లను తమ ఖతాలో వేసుకున్నారు...
భారత జట్టు ఆసియా కప్ ఫైనల్‌కు చేరింది. సూపర్-4 రెండు మ్యాచ్‌లనూ గెలిచిన మనోళ్లు నాలుగు పాయింట్లను తమ ఖతాలో వేసుకున్నారు. ఇక తేలాల్సిందల్లా భారత్‌తో టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకొనే జట్టు ఏదనే ! ప్రస్తుతం పాకిస్థాన్, శ్రీలంక జట్లు చెరో రెండు పాయింట్లతో ఉన్నాయి. గురువారం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేత మాత్రమే నాలుగు పాయింట్లకు చేరి ఫైనల్ బెర్త్ చేజిక్కించుకుంటుంది. ఈనేపథ్యంలో పాక్-లంక పోరు సెమీఫైనల్ లాంటిదే. శ్రీలంకపై బాబర్ సేన నెగ్గితే టైటిల్ ఫైట్‌కు చేరుతుంది. అదే జరిగితే..ఆసియా కప్ చరిత్రలో భారత్-పాకిస్థాన్ తొలిసారి ఫైనల్లో ఢీకొంటాయి. టీమిండియా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో ఏడు సార్లు ఆసియా కప్‌ను అందుకొంటే..పాకిస్థాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. ఇక సూపర్-4లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్ ఫైనల్ రేసునుంచి ఇప్పటికే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. శుక్రవారం అంతగా ప్రాధాన్యంలేని మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో రోహిత్ సేనతో తలపడనుంది.
నేటి పోరు వర్షార్పణమైతే..
కొలంబోలో గురువారంనాడు భారీ వర్షం కురిసే అవకాశాలు 73 శాతం ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా లేదు. ఒకవేళ వానతో మ్యాచ్ రద్దయితే..పాకిస్థాన్ (-1.892) కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న శ్రీలంక (-0.200) ఫైనల్ బెర్త్ చేజిక్కించుకుంటుంది. భారత్ చేతిలో 228 పరుగుల భారీ తేడాతో పరాజయం కావడంతో పాక్ నెట్‌రన్‌రేట్ దారుణంగా పడిపోయింది. వాస్తవంగా ఆసియా కప్ కోసం భారత్-పాకిస్థాన్ జట్లే తలపడాలని కోట్లాదిమంది అభిమానులు ఆశిస్తారు. రెండు జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీ మొదటి మ్యాచ్ వర్షంతో రద్దవడంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు. ఇక సూపర్-4 మ్యాచ్‌ను సైతం వరుణుడు అడ్డుకున్నా..రిజర్వ్ డే ఉండడంతో పోరు కొనసాగింది.
Updated Date - 2023-09-14T01:17:32+05:30 IST