దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు
ABN, First Publish Date - 2023-11-02T04:05:02+05:30
చైనాలో ముగిసిన పారా ఆసియా క్రీడల్లో రికార్డుస్థాయిలో 111 పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు...
పారా అథ్లెట్లకు ప్రధాని మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ: చైనాలో ముగిసిన పారా ఆసియా క్రీడల్లో రికార్డుస్థాయిలో 111 పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పతక గ్రహీతలందరినీ బుధవారం ఇక్కడి మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో కలుసుకున్న మోదీ.. వారితో చాలాసేపు ముచ్చటించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘ఈ తొమ్మిదేళ్లలో దేశ క్రీడారంగంలో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రభుత్వ అండతో ప్రతి ఒక్కరూ క్రీడలవైపు వడివడిగా అడుగులేస్తున్నారు. మన అథ్లెట్లు అద్భుతంగా రాణిస్తూ దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. 2030 యూత్ ఒలింపిక్స్, 2036 విశ్వ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. వాటి ఆతిథ్యం భారత్‌కు రావాలన్నది మా ఆకాంక్ష’ అని అన్నారు. ఇక, రెండు చేతులు లేకున్నా కాళ్లతోనే బాణాలు సంధిస్తూ అంతర్జాతీయ వేదికపై అదరగొడుతున్న జమ్మూ కశ్మీర్‌కు చెందిన పారా ఆర్చర్, 16 ఏళ్ల శీతల్ దేవిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. పారా ఆసియా క్రీడల్లో 2 పతకాలు సాధించిన శీతల్ అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
Updated Date - 2023-11-02T04:05:02+05:30 IST