U-19 T20 World Cup India : భారత్ జగజ్జేత
ABN, First Publish Date - 2023-01-30T01:35:52+05:30
భారత మహిళలు తొలిసారి ఐసీసీ టైటిల్‌తో మురిశారు. ఆరంభ అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌లో షఫాలీ సేన విశ్వవిజేతగా నిలిచింది. పేసర్ టిటాస్ సాధు (4-0-6-2) నిప్పులు చెరిగే బంతులకు స్పిన్నర్ పర్శవీ చోప్రా (2/13), అర్చనా దేవి (2/17) చక్కని సహకారం అందించడంతో..
అండర్-19 మహిళల ప్రపంచకప్ కైవసం
ఫైనల్లో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం
అమ్మాయిలు అదరహో
అండర్-19 టీ20 ప్రపంచకప్ విజేత భారత్
నిప్పులు చెరిగిన సాధు
బ్యాట్‌తో అదరగొట్టిన త్రిష, సౌమ్య
ఫైనల్లో ఇంగ్లండ్ చిత్తు
మనమ్మాయిలు పట్టు వదల్లేదు.. సిసలైన ప్రత్యర్థి ఎదురైనా బెదరలేదు.. అండర్-19 టి20 ప్రపంచకప్‌లో ఆరంభం నుంచే సత్తా చాటుతూ ఫైనల్ చేరిన భారత్.. అంతిమ సమరంలో అంతకుమించిన ప్రదర్శనతో అదరహో అనిపించింది. ఇంగ్లండ్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి జగజ్జేతగా అవతరించింది.
మన అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. భారత క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. సీనియర్ జట్టు మూడుసార్లు ఐసీసీ వరల్డ్‌కప్ ఫైనల్ చేరినా నెరవేరని కలను.. చిచ్చరపిడుగులు అదిరే ఆటతో సుసాధ్యం చేశారు. తొలిసారిగా నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచక్‌పలో టీమిండియాను విశ్వ విజేతగా నిలిపారు.
ఉమెన్ క్రికెట్‌లో భారత్‌కు తొలి ఐసీసీ టైటిల్‌ను అందించారు. పేసర్ టిటాస్ బంతితో విజృంభించగా.. తెలుగమ్మాయి త్రిష బ్యాట్‌తో కీలకపాత్ర పోషించింది. దీంతో మెగా ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఏడు వికెట్లతో చిత్తు చేసిన భారత్.. ఎట్టకేలకు కలల కప్‌ను ముద్దాడింది.
పోచె్‌ఫస్ర్టూమ్: భారత మహిళలు తొలిసారి ఐసీసీ టైటిల్‌తో మురిశారు. ఆరంభ అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌లో షఫాలీ సేన విశ్వవిజేతగా నిలిచింది. పేసర్ టిటాస్ సాధు (4-0-6-2) నిప్పులు చెరిగే బంతులకు స్పిన్నర్ పర్శవీ చోప్రా (2/13), అర్చనా దేవి (2/17) చక్కని సహకారం అందించడంతో.. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టీమిండియా బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. ర్యానా మెక్‌డొనాల్డ్ (19) టాప్ స్కోరర్. సోనమ్, మన్నత్, షఫాలీ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసి గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. గొంగడి త్రిష (29 బంతుల్లో 3 ఫోర్లతో 24), సౌమ్య తివారి (37 బంతుల్లో 3 ఫోర్లతో 24 నాటౌట్) విజయానికి బాటలు వేశారు. హనా బాకర్, గ్రేస్, అలెక్సా తలో వికెట్ దక్కించుకొన్నారు. మ్యాచ్ వీక్షణకు వచ్చిన జావెలిన్ ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా.. అమ్మాయిల్లో జోష్ నింపాడు. టిటా్‌సకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కగా.. ఇంగ్లండ్ కెప్టెన్ గ్రేస్ స్ర్కీవెన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచింది.
కూల్‌గా నడిపించిన త్రిష, సౌమ్య: లక్ష్యం స్వల్పం కావడంతో భారత జట్టు గెలుపుపై ఎటువంటి అనుమానాల్లేవు. అందుకు తగ్గట్టే ఓపెనర్ షఫాలీ (15) 4, 6తో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. అయితే, మూడో ఓవర్‌లో బాకర్ బౌలింగ్‌లో అలెక్సా అందుకొన్న లోక్యాచ్‌తో వెనుదిరిగింది. మరో ఓపెనర్ శ్వేత షహ్రావత్ (5)ను స్ర్కీవెన్స్ వెనక్కి పంపడంతో టీమిండియా శిబిరంలో చిన్నపాటి కలకలం రేగింది. ఈ దశలో క్రీజులో ఉన్న సౌమ్యకు జత కలసిన త్రిష పరిస్థితిని చక్కదిద్దింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 55 బంతుల్లో 46 పరుగులు జోడించి సునాయాసంగా గెలిపించారు. 12వ ఓవర్‌లో ఎల్లీ బౌలింగ్‌లో త్రిష రెండు వరుస ఫోర్లతో బ్యాట్‌ను ఝుళిపించింది. ఆ తర్వాతి ఓవర్‌లో త్రిష.. మరో భారీ షాట్‌కు యత్నించి బౌల్డ్ అయింది. గెలుపునకు మరో 3 పరుగులు కావాల్సి ఉండగా.. సౌమ్య విన్నింగ్స్ షాట్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
వణికించిన సాధు..: పేస్ సంచలనం టిటా్‌సతోపాటు లెగ్ స్పిన్నర్ పర్శవి చోప్రా దెబ్బకు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ పేకమేడను తలపించింది. ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజులో నిలిచేందుకు యత్నించకపోవడంతో.. పట్టుమని 70 పరుగులు కూడా చేయలేక పోయింది. దీంతో మరో 17 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.
స్కోరు బోర్డు
ఇంగ్లండ్: స్ర్కీవెన్స్ (సి) త్రిష (బి) అర్చన 4, హీప్ (సి అండ్ బి) టిటాస్ 0, హాలెండ్ (బి) అర్చన 10, స్మేల్ (బి) టిటాస్ 3, మెక్‌డొనాల్డ్-గే (సి) అర్చన (బి) పర్శవి 19, పవ్లీ (ఎల్బీ) పర్శవి 2, అలెక్సా (సి) సోనమ్ (బి) మన్నత్ 11, గ్రోవ్స్ (రనౌట్/తివారి) 4, బాకర్ (స్టంప్డ్) రిచా (బి) షఫాలీ 0, సోఫియా (సి అండ్ బి) సోనమ్ 11, ఎల్లీ అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 17.1 ఓవర్లలో 68 ఆలౌట్; వికెట్ల పతనం: 1-1, 2-15, 3-16, 4-22, 5-39, 6-43, 7-53, 8-53, 9-68; బౌలింగ్: టిటాస్ సాధు 4-0-6-2, అర్చనా దేవి 3-0-17-2, పర్శవి చోప్రా 4-0-13-2, మన్నత్ కశ్యప్ 3-0-13-1, షఫాలీ 2-0-16-1, సోనమ్ యాదవ్ 1.1-0-3-1.
భారత్: షఫాలీ (సి) అలెక్సా (బి) బాకర్ 15, శ్వేత (సి) బాకర్ (బి) స్ర్కీవెన్స్ 5, సౌమ్య (నాటౌట్) 24, త్రిష (బి) అలెక్సా 24, హృషిత బసు (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 14 ఓవర్లలో 69/3; వికెట్ల పతనం: 1-16, 2-20, 3-66; బౌలింగ్: హనా బాకర్ 4-1-13-1, సోఫియా 2-0-16-0, గ్రేస్ స్ర్కీవెన్స్ 3-0-13-1, జోసీ గ్రోవ్స్ 2-0-9-0, అలెక్సా 2-0-8-1, ఎల్లీ అండర్సన్ 1-0-10-0.
మెరిసిన త్రిష..
తుది పోరులో ఎంతో ఒత్తిడి నెలకొన్నా.. త్రిష సంయమనంతో ఆడింది. ఫామ్‌లో ఉన్న షఫాలీ, శ్వేత స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో.. అభిమానుల్లో ఎక్కడో అనుమానం రేగింది. కానీ, సౌమ్యతో కలసి త్రిష తెలివిగా స్కోరు బోర్డును నడిపించింది. బంతి ప్రమాదకరంగా తిరుగుతున్నా నేర్పుగా ఆడుతూ పరుగులు రాబట్టింది. చెత్త బంతులను మాత్రం బౌండ్రీ దాటించింది. జట్టు మెరుగైన స్థితిలో నిలిపిన తర్వాత రెండు వరుస బౌండ్రీలతో గెలుపు ముంగిట నిలిపింది. స్కాట్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన త్రిష అర్ధ శతకంతో రాణించింది.
రూ. 5 కోట్ల నజరానా
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ రివార్డు ప్రకటించింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి ట్రోఫీ అందుకున్న షఫాలీ బృందానికి రూ. 5 కోట్లు నజరానా ఇస్తున్నట్టు బోర్డు కార్యదర్శి జై షా తెలిపాడు. ‘భారత్‌లో మహిళల క్రికెట్ అత్యుత్తమ స్థాయికి చేరుతుందనడానికి ఈ ప్రపంచకప్ విజయమే తార్కాణం. అద్భుత ప్రదర్శన కనబరచిన మన అమ్మాయిల జట్టు, సహాయ సిబ్బందికి రూ. 5 కోట్లు రివార్డు అందజేస్తున్నాం’ అని జై షా ట్వీట్ చేశారు. అలాగే యువ భారత జట్టును వచ్చేనెల ఒకటిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే మూడో టీ20 మ్యాచ్‌కు ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
Updated Date - 2023-01-30T01:35:54+05:30 IST