Women IPL: ఉమెన్స్ ఐపీఎల్ బిడ్డింగ్‌లో సంచలన రికార్డ్.. మెన్స్ ఐపీఎల్ 2008 రికార్డ్ బద్ధలు
ABN, First Publish Date - 2023-01-25T16:18:45+05:30
ఉమెన్స్ ఐపీఎల్ (Womens IPL) ఫ్రాంచైజీల బిడ్డింగ్‌లో సంచలనం నమోదయ్యింది. మొత్తం 5 ఫ్రాంచైజీల కోసం దాఖలైన బిడ్ల ఉమ్మడి వ్యాల్యూయేషన్ ఏకంగా రూ.4669.99 కోట్లుగా నమోదయ్యింది.
ముంబై: ఉమెన్స్ ఐపీఎల్ (Womens IPL) ఫ్రాంచైజీల బిడ్డింగ్‌లో సంచలనం నమోదయ్యింది. మొత్తం 5 ఫ్రాంచైజీల కోసం దాఖలైన బిడ్ల ఉమ్మడి వ్యాల్యూయేషన్ ఏకంగా రూ.4669.99 కోట్లుగా నమోదయ్యింది. పురుష ఐపీఎల్ (Mens IPL) ఆరంభ సంవత్సరం 2008లో ఫ్రాంచైజీల బిడ్ల కంటే ఎక్కువ వ్యాల్యూయేషన్ నమోదవ్వడం సంచలన రికార్డ్‌గా మారింది. ఈ విషయాన్ని బీసీసీఐ (BCCI) సెక్రటరీ జయ్ షా (Jay Shah) ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. అత్యధికంగా అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం రికార్డ్ స్థాయిలో రూ.1289 కోట్ల భారీ బిడ్ దాఖలైంది. అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేటు లిమిటెడ్ (Adani Sportsline Pvt ltd) అత్యధిక బిడ్‌తో ఈ జట్టుని దక్కించుకుంది. ఇక రూ.912.99 కోట్ల మొత్తంతో ముంబై జట్టుని (Mumbai) ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ (Indiawin Sports Pvt Ltd) దక్కించుకుంది. బెంగళూరు జట్టుని రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ (Royal Challengers Sports Pvt Ltd) రూ.901 కోట్లతో దక్కించుకుంది. రూ.810 కోట్లతో ఢిల్లీ జట్టుని జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేటు లిమిటెడ్ (JSW GMR Cricket Pvt Ltd) సొంతం చేసుకుంది. ఐదవ జట్టయిన లక్నో జట్టుని (Lucknow) రూ.757 కోట్ల మొత్తంతో క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ (Capri Global Holdings Pvt Ltd) దక్కించుకుంది.
మహిళా క్రికెట్‌లో విప్లవానికి నాంది: జయ్‌షా
ఉమెన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీల బిడ్డింగ్ భారీ వ్యాల్యూయేషన్ పలకడంపై బీసీసీఐ సెక్రటరీ జయ్‌షా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ మెన్స్ ఐపీఎల్ 2008 ప్రారంభ రికార్డును బద్ధలు కొడుతూ ఉమెన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీల బిడ్డింగ్ రికార్డ్ ధర పలికిన ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. బిడ్స్ రూపంలో మొత్తం రూ.4669.99 కోట్లు సమకూర్చుకున్నాం. ఫ్రాంచైజీల విన్నర్లకు అభినందనలు. ఈ పరిణామం మహిళ క్రికెట్‌లో విప్లవానికి నాంది పలుకుంది. బాటలు వేస్తుంది’’ అని జయ్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-01-25T16:32:52+05:30 IST