Aadhar Sim Cards Scam: ఓరి నాయనో.. ఇదేందయ్యా ఇది.. ఒకే ఆధార్ కార్డుపై 658 సిమ్ కార్డులా?
ABN, First Publish Date - 2023-08-11T22:07:00+05:30
ప్రస్తుత ఆధునిక యుగంలో టెక్నాలజీ వినియోగం పెరగడంతో పాటు సైబర్ మోసాలు కూడా పెచ్చుమీరిపోతున్నాయి. ట్రెండ్‌కి తగినట్టుగానే సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తూ.. నేరాలకు పాల్పడుతున్నారు.
ప్రస్తుత ఆధునిక యుగంలో టెక్నాలజీ వినియోగం పెరగడంతో పాటు సైబర్ మోసాలు కూడా పెచ్చుమీరిపోతున్నాయి. ట్రెండ్‌కి తగినట్టుగానే సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తూ.. నేరాలకు పాల్పడుతున్నారు. ‘డీజే టిల్లు’ సినిమాలోని ‘బనియన్‌కి తెలియకుండా డ్రాయర్ లాగేయాలి’ అనే డైలాగ్ తరహాలోనే.. వ్యక్తులను బురిడీ కొట్టించి, భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఓ వ్యక్తి కేవలం ఒకే ఆధార్ కార్డుపై 658 సిమ్ కార్డులు తీసుకున్న మరో ‘సైబర్ క్రైమ్’ వెలుగులోకి వచ్చింది.
ఒకప్పుడు ఒక సిమ్ కార్డ్ కొనాలంటే నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వినియోగదారుల్ని పిలిచి మరీ, ఉచితంగా సిమ్ కార్డులు ఇచ్చే రోజులు వచ్చేశాయి. దీన్నే కొందరు దుండగులు ఆసరాగా చేసుకొని.. లెక్కలేనన్ని సిమ్ కార్డులు తీసుకుంటున్నారు. వీటిని సైబర్ మోసాలకు వినియోగించుకుంటున్నారు. ఇది గమనించిన టెలికమ్యునికేషన్ల శాఖ.. సిమ్ కార్డుల మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేసే ఒక టూల్ కిట్ ద్వారా.. సిమ్ కార్డు మోసాలను బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఒకే ఆధార్ కార్డుపై 658 సిమ్ కార్డులు తీసుకున్న వ్యవహారం బట్టబయలైంది.
విజయవాడలోని గుణదలలో ఒకే ఆధార్ కార్డుపై ఏకంగా 658 సిమ్‌కార్డులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా.. సత్యనారాయణపురంకు చెందిన నవీన్ అనే యుకుడు ఈ సిమ్ కార్డులని రిజిస్టర్ చేసినట్లు తేలింది. దీంతో.. సిమ్ కార్డులను వెంటనే రద్దు చేయాల్సిందిగా సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లకు పోలీసులు లేఖ రాశారు. ఈ విచారణ సమయంలోనే.. అజిత్‌సింగ్‌నగర్, విస్సన్నపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో మరో 150 సిమ్ కార్డులను నకలి పత్రాలతో అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఈ సిమ్ కార్డుల సర్వీసుల్ని సైతం ఆపేయాలని అధికారులు సూచించినట్టు తెలిసింది.
నిజానికి.. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఒక ఆధార్ కార్డుపై తొమ్మిది సిమ్ కార్డులు తీసుకోవడానికి వెసులుబాటు ఉంది. పెద్ద కుటుంబాలకు ఎక్కువ కనెక్షన్లు తీసుకోవడానికి వీలుగా.. ఈ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అయితే.. కొందరు ఈ అవకాశాన్ని సద్వినియోపరచుకుంటూ, ఎక్కువ మొత్తంలో సిమ్ కార్డులు కొనుగోలు చేస్తున్నారు. మనకు తెలియకుండానే, మన ఆధార్‌పై సిమ్ కార్డులు తీసుకునే ఛాన్స్ ఉందని పోలీసులు అంటున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మీ ఆధార్‌పై సిమ్ కార్డులు లేకపోతే.. వెంటనే బ్లాక్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. లేకపోతే.. సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Updated Date - 2023-08-11T22:07:00+05:30 IST