Aadhaar Data: ఆధార్‌పై సైబర్ నేరగాళ్ల కన్ను.. వారికి చెక్ పెట్టాలంటే ఇలా చేయండి
ABN, First Publish Date - 2023-11-27T19:14:05+05:30
ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోయాయి. రకరకాల మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. చివరికి ఆధార్ బయోమెట్రిక్ డేటాను సైతం విడిచిపెట్టడం లేదు.
Aadhaar Biometric Data: ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోయాయి. రకరకాల మార్గాల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. చివరికి ఆధార్ బయోమెట్రిక్ డేటాను సైతం విడిచిపెట్టడం లేదు. ఆ డేటాని వినియోగించి, దుర్మార్గపు పనులకు తెగబడుతున్నారు. ఐటెండిటీని దొంగలించి, తమ స్వప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు. డార్క్ వెబ్‌లో లక్షల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం విక్రయించబడుతోందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే.. ఆధార్ నంబర్‌లతో సహా తమ బయోమెట్రిక్ డేటాను సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం అవసరమైతే తప్ప.. సాధారణ సమయాల్లో బయోమెట్రిక్ డేటాను లాక్ చేయొచ్చు. ఆధార్ బయోమెట్రిక్‌ని లాక్ చేస్తే.. ఆధార్ కార్డ్ హోల్డర్ వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు, ముఖ గుర్తింపు డేటాతో సహా వ్యక్తిగత, బయోమెట్రిక్ సమాచారాన్ని సురక్షితంగా భద్రపరచుకోవచ్చు. బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడం ద్వారా.. ఆ ఆధార్ కార్డ్‌కి లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలకు అనధికారిక యాక్సెస్ లేదా డేటా దుర్వినియోగం జరగదు. ఇంకో విషయం.. బయోమెట్రిక్ డేటాని లాక్ చేశాక, దాన్ని అన్‌లాక్ చేసేంతవరకు ఆధార్ ప్రామాణీకరణ కోసం ఉపయోగించలేరు.
ఆధార్ బయోమెట్రిక్‌ని ఎలా లాక్ చేయాలి?
* ముందుగా UIDAI (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) వెబ్‌సైట్ లేదా mAadhaar యాప్‌ని విజిట్ చేయాలి.
* మీ ఆధార్ నంబర్, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఉపయోగించి.. మీ ఆధార్ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
* My Aadhar సెక్షన్‌లో బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ నావిగేట్ చేశాక.. మరోసారి ఆధార్ నంబర్ నమోదు చేసి, ఓటీపీతో ధృవీకరించాల్సి ఉంటుంది.
* అప్పుడు లాక్ బటన్ మీద క్లిక్ చేసి బయెమెట్రిక్ డేటాని లాక్ చేయొచ్చు. అన్‌లాక్ చేయాలనుకుంటే అన్‌లాక్ బయోమెట్రిక్స్‌పై క్లిక్ చేయాలి.
Updated Date - 2023-11-27T19:22:02+05:30 IST