ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Programmable Robot: ఈ రోబోట్లని మీరే ప్రోగ్రాం చేయచ్చు..!

ABN, First Publish Date - 2023-04-18T13:07:31+05:30

ఎఐ, రోబోటిక్స్‌ టెక్నాలజీలు రెండూ అందరికీ చేరువైనప్పుడు - పిల్లల టాయ్ ప్రపంచం ఊహించని స్థాయిలోకి మారిపోతుంది. ఫ్యూచర్‌ ఎలా ఉండబోతోంది అనడానికి ప్రస్తుత ప్రపంచంలో ఉన్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెడీగా ఉన్న రోబోట్‌ని ... ఉన్నది ఉన్నట్టుగా వాడుకోవడం ఒక పద్ధతి. కానీ దాని షేపుని కూడా మనకి కావలసినట్టుగా డిజైన్ చేసుకోవడం ఇంకా అడ్వాన్స్‌డ్‌ విషయం. అంతే కాకుండా.. అది ఏమేం పనులు చేయాలో ఆ ఫీచర్స్‌ని కూడా మనమే ప్రోగ్రాం చేసుకుంటే.. దాన్ని కావాల్సినట్టుగా మనమే నడిపిస్తే ...? అది మరింత అద్భుతం అవుతుంది. మరి అలా ఎడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో ముందుకొస్తున్నాయి కొన్ని ప్రోగ్రామబుల్‌ రోబోట్స్‌. వాటిలో కొన్నిటిని పరిచయం చేసుకుందామా?

లూనా (Loona)

దీని పేరు లూనా. ఎంతో ముచ్చటగా ఉండే ఒక ప్లే రోబోట్. రోబోట్ గానే కాదు.. ఒక పెట్‌గా, ఫ్రెండ్ గా కూడా పనికి వస్తుందని అంటున్నారు దీని క్రియేటర్స్‌. దీంట్లో చాట్‌జీపీటీ మాదిరిగా ఏఐ క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఇది మన జెశ్చర్స్ ని కూడా గుర్తుపట్టగలుగుతుంది. మనం చిటిక వేసినా, పిలిచినా ఆ విషయాన్ని తన కెమెరా ద్వారా గుర్తిస్తుంది. సెన్సిటివ్‌ మైకులూ పవర్‌ఫుల్‌ సిపియు దీంట్లో ఉన్నాయి. ఇది విజువల్ రికగ్నిషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వాయిస్ కమాండ్స్‌తో కూడా పనిచేస్తుంది. ఇండియన్ కరెన్సీ లో దీని ఖరీదు 30 వేల రూపాయల వరకు ఉంటుంది.

అలాగే ఇది కేవలం ఒక ప్లే టాయ్‌గా మాత్రమే కాదు. హోమ్‌ని మోనిటర్ చేయడానికి ఉపయోగపడే సెక్యూర్‌ డివైజ్‌గా కూడా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో కొన్ని రోబోటిక్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌ వచ్చాయి. చార్జ్ అయిపోతే... వాటంతటవే అవి పవర్‌సోర్స్‌ దగ్గరికి వెళ్లి రిఛార్జ్ చేసుకుంటున్నాయి. అదే విధంగా - ఈ రోబోట్‌ కూడా కూడా ఛార్జ్‌ అయిపోతే వెంటనే వెళ్లి తనని తను ఛార్జ్‌ చేసుకుంటుంది.

దీని షేప్‌ని కూడా మనం మార్చుకోవచ్చు. అలంకరణాలు చేసుకోవచ్చు. ఇది ఇంట్లో వాళ్ళని గుర్తు పడుతుంది. ఒక కుక్క యజమానిని గుర్తుపట్టినట్టుగా - ఇంట్లో వ్యక్తుల్ని విడివిడిగా గుర్తు పడుతుంది. ముఖ్యంగా పిల్లలకి ఈ ఫీచర్‌ ఎంతో నచ్చుతుంది.

దీని తల మీద రెండు కొమ్ములు ఉంటాయి. అవి సెన్సర్స్ గా పని చేస్తాయి. కొన్ని ముఖ్యమైన జెశ్చర్స్‌ ని ఇది చాలా బాగా అర్థం చేసుకుంటుంది. చేతివేళ్లతో చిటికెలు వేసినా, ఇటు వెళ్లూ అటు తిరుగూ ... అంటూ వేళ్లు చూపించినా దీనికి అర్థమైపోతుంది. అంటే దాదాపుగా ఇది ఒక లైవ్‌ పెట్ లాగా పనిచేస్తుందన్నమాట!

మరో విశేషం ఏంటంటే.. ఇది మన ఉనికిని కనిపెట్టి... మన వెంట వస్తుంటుంది. ఒక కుక్క తోకాడించినట్టుగా ఇది తన కొమ్ముల్ని ఆడిస్తూ ఉంటుంది. తిరిగేటప్పుడు ఆబ్జెక్ట్స్ అడ్డం వస్తే... తప్పుకుని ప్రయాణిస్తుంది. చుట్టూ ఉన్న వస్తువుల్ని చూసి గమనించి తెలుసుకుంటుంది. వాటిని బట్టి దారి మార్చుకుంటుంది. మన మాటని కూడా ఇది బాగా గుర్తుపట్టగలుగుతుంది. ఈ కాలంలో మనుషులైనా మాట వినకపోవచ్చు. కానీ ఇది కచ్చితంగా మాట వింటుంది... మనం చెప్పినట్టు చేస్తుంది - అని చెబుతున్నారు దీని క్రియేటర్లు.

లూనా రోబోట్‌... ఒక కుక్క మాదిరిగానే పనిచేస్తుంది. ఒక బాల్ వేసి తీసుకురమ్మంటే ... తన ముందు చక్రాలతో ఆ బాల్ ని పట్టి తెచ్చి మన ముందు పెడుతుంది. యాక్చువల్ గా ఇది డాగ్‌ పెట్‌ని ఆదర్శంగా తీసుకునే దీన్ని తయారు చేశారు. విశేషం ఏంటంటే... ఇంట్లో ఉన్న ప్రాణం ఉన్న పెట్‌డాగ్‌ పట్ల కేర్‌ తీసుకోవడంలో ఈ రోబోట్‌ డాగ్‌ ఎంతో ఉపయోగపడుతుందట. అన్నట్టు లూనా వీడియోల్ని కూడా రికార్డు చేస్తుంది. పైగా దీన్ని మనకు కావాల్సినట్టుగా ప్రోగ్రాం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కోడ్ యాడ్ చేయడం ద్వారా దీనికి కొత్త కొత్త ట్రిక్స్ నేర్పచ్చు. బాగుంది కదా?

XGO Mini రోబోట్

ఆ మధ్య బోస్టన్‌ డైనమిక్స్ వాళ్ళు.. స్పాట్ అనే ఒక రోబోట్ ని తయారు చేశారు. అది తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని స్పష్టంగా గుర్తిస్తూ - నాలుగు కాళ్లతో ముందుకు పరుగులు తీస్తుంటే ... కొంతమంది భయం కూడా వ్యక్తం చేశారు. ఫ్యూచర్లో రోబోట్లు మరీ ఎక్కువైపోతాయా, మానవాళికి భయానకమైన పరిస్థితులు తీసుకు వస్తాయా - అంటూ ఆందోళనతో కూడిన కామెంట్లు కూడా వినిపించాయి.

అయితే అంత పవర్‌ఫుల్‌గా కాకపోయినా.. స్పాట్ లాగే ఒక స్మార్ట్ రోబోట్ ని మనకు మనమే తయారు చేసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు XGO రోబోట్ వాళ్ళు. మనకి నచ్చినట్టు దాని ఫీచర్స్‌ని కస్టమైజ్‌ కూడా చేసుకోవచ్చు.

XGO Mini అనే ఈ రోబోట్ ని చూడండి నాలుగు కాళ్లతో ఇది ఎన్నో రకాలుగా నడవగలుగుతుంది. దీనికి ఒక ముఖం లాంటి ఒక స్క్రీన్ కూడా ఉంటుంది. చెప్పాలంటే ఇది కూడా ఒక రోబోట్ డాగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది. దీంట్లో ఏఐ మాడ్యూల్ కూడా ఉంది. లూవూ డైనమిక్స్ వాళ్ళు తయారుచేసిన ఈ రోబోట్‌ని మనం మనకి కావలసిన విధంగా ప్రోగ్రాం చేసుకోవచ్చు. ఇది పరుగులు తీస్తుంది, గంతులు వేస్తుంది, ఎక్సర్సైజులు చేస్తుంది, అనేక కోణాల్లో వంగగలుగుతుంది, అనేక దిక్కుల్లో తిరగగలుగుతుంది. అలాగే ఎత్తులు కూడా ఎక్కగలుగుతుంది, దిగగలుగుతుంది. దారిలో ఏదైనా అడ్డం ఉంటే - వాటిని తప్పించుకుని స్మార్ట్‌గా ప్రయాణం చేయగలుగుతుంది. ఇంకా స్మార్ట్‌ విషయం ఏంటంటే - ఇరుకైన స్థలాల్లో దూరవలసి వచ్చినప్పుడు తన హైట్ ని కూడా ఎడ్జస్ట్ చేసుకోగలుగుతుంది.

దీని కదలికల్నీ, ఫీచర్స్‌నీ మనం పూర్తిగా ప్రోగ్రాం చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ని యాడ్ చేయచ్చు. అనేక కొత్త స్కిల్స్ ని కూడా దీనికి అందించవచ్చు. వినోదానికి విజ్ఞానానికి మాత్రమే కాదు ఒక పెట్‌ ప్రేమని కూడా ఇది తెలియజేస్తుంది అని అంటున్నారు వీళ్ళు. అయితే దీన్ని పిల్లలు ఆడుకునే ఒక ఆట వస్తువుగానూ, జస్ట్‌.. ఒక ప్రోగ్రామబుల్‌ రోబోట్ గానూ మాత్రమే చూడలేం. మనుషుల్ని గుర్తుపట్టే ఒక సెక్యూరిటీ డివైజ్‌గా కూడా దీన్ని వాడవచ్చు.

ClicBot Robot

రోబోట్లను తయారుచేసి కావలసిన షేపుల్లో తయారు చేసుకునే విధంగా రోబోట్ కిడ్స్ ఇప్పుడు లభిస్తున్నాయి. తయారుచేసుకోవడం మాత్రమే కాదు వాటి ఫీచర్స్ ని కూడా మనం కష్టమైజ్‌ చేసుకునేందుకూ ప్రోగ్రాం చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటోంది. ఐపాడ్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా ఆ రోబోట్ లని కంట్రోల్ చేయచ్చు. చిన్నపిల్లలు కూడా వీటిని ఈజీగా వాడచ్చు. ఇలాంటి వాటివల్ల - పిల్లలకి రోబోటిక్స్ పట్ల మాత్రమే కాకుండా - ప్రోగ్రామింగ్ పట్ల కూడా అవగాహన బాగా పెరుగుతుంది. కస్టమైజ్డ్‌ రోబోట్లని డిజైన్‌ చేసే ప్రోగ్రామింగ్‌ కిట్స్‌ అనేకం ఉన్నప్పటికీ - క్లిక్‌బాట్‌ రోబోట్ ని మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మామూలుగా రోబోట్ల విషయంలో పార్ట్స్‌ని అతకాలంటే అనేక స్క్రూలు వాడాల్సి ఉంటుంది, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఇది అలా కాదు.

దీనికి సరయిన స్థిరమైన రూపమే ఉండదు. పార్టులు పార్టులుగా ఉంటుంది. అందువల్ల దీన్ని చిత్ర విచిత్రమైన షేపుల్లో అనేక అనేక రోబోట్ల రూపంలోకి మనం మార్చుకోవచ్చు. ఇన్ని కాళ్ళే ఉండాలి, ఇన్ని చేతులే ఉండాలి అనే నియమం కూడా లేకుండా చిత్రమైన టాయ్‌స్‌ లాగా అనేక రూపాలతో ఈ క్లిక్‌బాట్‌ రోబోట్స్‌ని తయారుచేసుకోవచ్చు. పైగా అసలు స్క్రూలు వాడాల్సిన అవసరమే ఉండదు.

రోబోట్లని తయారు చేసిన తరవాత వాటిని ఐప్యాడ్ ద్వారా ప్రోగ్రాం చేసుకోవడం ఓకే. అంతకంటే గొప్ప ఏంటంటే... అసలు ఈ రోబోట్లను తయారు చేసేటప్పుడే ఐప్యాడ్‌కి వీటిని కనెక్ట్ చేయచ్చు. మనం రోబోట్ని తయారు చేస్తుంటే ... ఆ షేప్‌ అక్కడ స్క్రీన్‌ మీద లైవ్‌గా కనిపిస్తుంది. అలా లైవ్ గా తెరమీద చూస్తూ కావాల్సిన రూపంలో రోబోట్‌ని డిజైన్ చేయచ్చు.

క్లిక్‌బాట్‌ రోబోట్‌లో అనేక మాడ్యూల్స్‌ ఉంటాయి. బ్రెయిన్ అనే ఒక మెయిన్ మాడ్యూల్ ఉంటుంది. స్క్రూలు అవసరం లేకుండా వివిధ పార్టుల్ని కలపడం కోసం కొన్ని జాయినింగ్‌ మాడ్యూల్స్‌స్ ఉంటాయి. స్కెలిటన్ పేరుతో ఎముకల పార్ట్స్‌ కొన్ని ఉంటాయి. పుట్‌ అతకచ్చు. లేదా వీల్స్‌ కూడా ఉంటాయి. వాటినీ అతకచ్చు. ఇంకా హోల్డర్స్, ఫుట్‌ పార్టులు సక్షన్ కప్స్, సెన్సర్స్, గ్రాస్పర్స్‌ ఇలా చాలా ఉంటాయి. వీటన్నిటినీ అతికి మనం అనేక షేపుల్లో రోబోట్లని తయారుచేయచ్చు. తయారుచేసిన రోబోట్‌ని రిమోట్ ద్వారా కూడా యాక్సెస్ చేయచ్చు. అన్నీ మనమే తయారు చేసుకోవచ్చు. కేవలం ఒకే ఒక్క రోబోట్ షేప్ తో తృప్తి పడిపోవాల్సిన అవసరం లేకుండా రకరకాల ఆకారాల్లో చేసుకోవచ్చు. ఈ క్లిక్‌బాట్‌ రోబోట్‌ మనం ఇచ్చిన షేపుని బట్టీ ఫీచర్స్‌ని బట్టీ పనిచేస్తుంది. ఒకటి గోడలు ఎక్కగలుగుతుంది. ఒకటి యాక్టివ్ కెమెరా లా పనిచేస్తుంది. ఒకటి పార్టీలో డాన్సర్ లా కూడా పనిచేస్తుంది. అంతా మన ఇష్టం.

సో... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ... ఈ రెండిటిని కలిపి అనేక కిడ్ రోబోట్స్ తయారవుతున్నాయి ఇప్పుడు. ఇవి ఇటు కేవలం టాయ్స్ గా మాత్రమే కాకుండా ... అటు విజ్ఞానాన్ని పెంచే టెక్నికల్ డివైజెస్ గా కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే క్లిక్‌బాట్‌ కంటే మరింత ఫ్లెక్సిబుల్‌గా రోబోట్లని తయారుచేసే అవకాశం కల్పిస్తోంది ఎక్స్-కిట్.

ఎక్స్-కిట్‌ ఉంటే.. మనం కోరుకున్న ఎలాంటి డిజైన్ నైనా ఎలాంటి రూపాన్నయినా సృష్టించి వెంటనే దానికి యాక్షన్స్ అందించవచ్చు. త్రీడీ ప్రింటర్ సాయంతో మనకి కావాల్సిన, నచ్చిన ఎలాంటి షేప్‌నయినా ప్రింట్ తీసుకోవడమే కాకుండా ... మనకు కావలసిన ఆకారాన్ని సృష్టించి దాన్ని ప్రోగ్రాం చేసి... మనకి కావలసిన వినోదాన్ని సృష్టించుకునే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా ... లేని వస్తువుల్ని సృష్టించి వాటికి ప్రాణం పోయడం లాంటిదే ఇది! ఇదో అద్భుత అవకాశం.

ఎక్కడో మనం ఏదో ఒక పుస్తకంలో ఏదో ఒక షేప్ చూస్తే ... అలాంటి షేప్ ని మనం త్రీడీ ప్రింటర్ ద్వారా ప్రింట్‌ తీయచ్చు. ఆ షేప్‌లోని రకరకాల పార్ట్‌ల్ని ప్రింట్ తీసి వాటిని కలపచ్చు. ఆ తరవాత కదిలేలా చేయచ్చు.

ఎక్స్‌ కిట్లో ఇప్పటికే 60 కి పైగా రెడీమేడ్ ఆకారాలున్నాయి. వీటిలో వాహనాలు జంతువులు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని కూడా మనం ఛేంజ్‌ చేసుకోవచ్చు. రకరకాల పార్టుల్ని నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఫైనల్‌గా అవి మెకానికల్ గా పనిచేసేలా చేయొచ్చు. ఆ కదలికల్ని నచ్చినట్టుగా ప్రోగ్రాం చేసుకోవచ్చు. అంటే - ఎక్స్‌ కిట్‌ లాంటిది ఉంటే... పిల్లలు ఏకకాలంలో రోబోటిక్స్, ప్రోగ్రామింగ్, మెకానిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటినీ నేర్చుకున్నట్టవుతుంది.

రోబోట్ అంటే ఇలాగే ఉండాలి, టాయ్ అంటే ఇలా ఉండాలి.. అనే లిమిటేషన్ లేదిప్పుడు. మన ఊహకి తగినట్టుగా ఎలాంటి రూపాన్నయినా తయారు చేసి, ఆ తయారుచేసిన దానికి ప్రాణం పోయచ్చు. అలాంటి అద్భుత అవకాశాన్ని ఇప్పుడు ఈ రోబో క్రియేషన్ కిట్స్‌ అందిస్తున్నాయి 200 డాలర్ల లోపే లభించే ఈ కిట్స్‌ ... పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇవి మాత్రమే కాదు.. ఇలాంటివే ఎన్నో రోబో కిట్స్‌ .. కిడ్‌ రోబోట్స్‌.. చాలా ఉన్నాయి.. డ్యాష్‌ అండ్‌ డాట్‌... రోబో వండర్‌ కైండ్ ... కిండర్‌ ల్యాబ్‌కి చెందిన కిబో... ఇలా చాలా లిస్ట్‌ చెప్పవచ్చు.

భవిష్యత్తులో ఏఐ మరింత వేగవంతం అవుతుంది. ప్రోగ్రామింగ్ మరింత సులువైపోతుంది. అప్పుడు ఎఐ, రోబోటిక్స్‌ టెక్నాలజీలు రెండూ అందరికీ చేరువైనప్పుడు - పిల్లల టాయ్ ప్రపంచం ఊహించని స్థాయిలోకి మారిపోతుంది. ఫ్యూచర్‌ ఎలా ఉండబోతోంది అనడానికి ప్రస్తుత ప్రపంచంలో ఉన్న ఉదాహరణలు ఈ ప్రోగ్రామబుల్‌ కిడ్‌ బాట్సే మరి!

Updated Date - 2023-04-18T14:18:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising