2023 Muhurtham Dates: 20 రోజులు తప్పిస్తే అన్నీ మంచి ముహూర్తాలే.. సెప్టెంబర్‌లో కేవలం..
ABN, First Publish Date - 2023-08-18T16:13:31+05:30
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు వరుసగా ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్‌లో 20 రోజులు తప్పిస్తే మిగతా అంతా శుభకార్యాల రోజులే ఉన్నాయి. దీనికి సంబంధించి వేదపండితులు ముహూర్తాలు ఖరారు చేశారు. ఈ ముహూర్తాల తేదీలు కూడా ప్రకటించారు.
ఆషాఢ మాసం ఆ తర్వాత, అధిక శ్రావణ మాసం వరుసగా ఉండడంతో రెండున్నర నెలలుగా నగరంలో శుభకార్యాలకు ఫుల్‌స్టాప్ పడింది. అయితే గురువారం నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ఇక 19వ తేదీ నుంచి శుభ ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు జోరందుకోనున్నాయి.
నార్సింగ్ (ఆంధ్రజ్యోతి): ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు వరుసగా ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్‌లో 20 రోజులు తప్పిస్తే మిగతా అంతా శుభకార్యాల రోజులే ఉన్నాయి. దీనికి సంబంధించి వేదపండితులు ముహూర్తాలు ఖరారు చేశారు. ఈ ముహూర్తాల తేదీలు కూడా ప్రకటించారు. ఇందులో భాగంగా ఆగస్టులో చాలా పెళ్లి ముహూర్తాలు, సత్యనారాయణ వ్రతం, గృహ ప్రవేశాలు, ఇళ్ల నిర్మాణానికి భూమి పూజలు, కొత్త కార్యాలయాలు, కొత్త పనులు పెట్టుకోనున్నారు. ఇప్పటికే చాలా మంది పెళ్లిళ్ల కోసం ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, బ్యాండ్ మేళాలు, ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, పెళ్లిళ్లు చేసే పంతుల్లు, వాళ్లందరికీ రిజర్వేషన్ చేసి పెట్టుకున్నారు.
ఆగస్టు నెలలో 19, 20, 22, 24, 26, 29, 30, 31 తేదీల్లో ముహూర్తాలు ఉండగా, సెప్టెంబర్‌లో కేవలం 1, 2, 3, 6, 7, 8 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత పెద్దలకు పూజా కార్యక్రమాలు ఉన్నాయి. దీంతో 30 రోజులు పెద్దల కార్యక్రమాలు, నవరాత్రి ఉత్సవాలు ఉంటాయి. తిరిగి అక్టోబర్‌లో 18, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 31 తేదీలు, నవంబర్‌లో 1, 2, 8, 9, 16, 17, 18, 19, 22, 23, 24, 25, 28, 29, డిసెంబర్‌లో 3, 5, 6, 7, 8, 14, 15, 16, 17, 19, 20, 21, 24, 31 శుభ ముహూర్తాలుగా నిర్ణయించారు. ఈ నెల 19 నుంచి డిసెంబరు 31 వరకు సుమారు 53 మంచి ముహూర్తాలు ఉన్నట్టు పండితులు చెబుతున్నారు.
ఆగస్టులో 19, 20, 22, 24, 26, 29, 30, 31 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. 24వ తేదీ రాత్రి గం.3.42 నిలకు, 30 రాత్రి 11.30 ముహూర్తాలు బలమైన ముహూర్తాలని పురోహితులు చెప్పారు. సెప్టెంబరులో 1, 2, 3, 6, 7, 8 తేదీల్లో ముహూర్తాలు ఉండగా సెప్టెంబరు 1వ తేదీ రాత్రి 11.22 గంటలకు, రెండో తేదీ రాత్రి 11.18కు, 2.08కు, 3.06 గంటలకు, 3 రాత్రి 11.14కు, 3.02కు, 6 రాత్రి 2.50కు, 3.08కు, 7వ తేదీ పగలు 11.21, రాత్రి 1.49, గం.2.46 ని.లకు ముహూర్తాలు ఉన్నట్టు పండితులు సారథి, గోవిందవఝల వెంకట రమణమూర్తి శర్మ తెలిపారు. ఇందులో 1, 2, 6 తేదీల్లో మంచి ముహూర్తాలని వారు వివరించారు. తర్వాత నెల భాద్రపదం శూన్య మాసమని తిరిగి ఆశ్వీయుజం నుంచి మళ్లీ వివాహ ముహూర్తాలు ప్రారంభమవుతాయన్నారు.
మంచి ముహూర్తాలు ఇవీ..
అధిక మాసం తర్వాత శ్రావణ మాసంలో చాలా మంచి ముహూర్తాలతో మొదలౌతుంది. డిసెంబర్ వరకు ఏకధాటిగా ముహూర్తాలు ఉన్నాయి. కంగారు పడకుండా ప్రజలు వారి వారి అనుకూలానుసారం ఈ ముహూర్తాల తేదీలు నిర్ణయించుకోవాలి. అన్నీ మంచి ముహూర్తాలే. ఏదో ఒక్క రోజు బాగుందని అదే రోజు పెట్టుకుంటే ఖర్చు పెరుగుతుంది. అందరికీ ఇబ్బందులు ఏర్పడతాయి. ముహూర్తాలపై సెకెండ్ ఓపీనియన్ తీసుకున్నా ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఏ సిద్ధాంతి అయినా చూసి మంచి ముహూర్తమే చెబుతారు.
- పాలేరు రాజేశ్వర శర్మ, సిద్ధాంతి
ఇప్పటికే బుక్
ఆగస్టు, సెప్టెంబర్‌తో పాటు కొంతమంది నవంబర్‌లో జరిగే శుభకార్యాలకు ఇప్పుడే క్యాటరింగ్ బుక్ చేసుకున్నారు. చాలా మంది కూడా తేదీలు నిర్ణయించుకున్నారు. కాబట్టి చకచకా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు ఈ క్యాటరింగ్ కూడా బుక్ చేసుకుంటున్నారు. మాకు ఇప్పటికే చాలా వరకు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, సత్యానారాయణ వ్రతం, ఆర్డర్స్ నమోదు అయ్యాయి.
- ఉమేశ్‌సింగ్, క్యాటరింగ్ ఏజెన్సీ
Updated Date - 2023-08-18T16:13:34+05:30 IST