Channels Charges: కేబుల్.. గుబులు!
ABN, First Publish Date - 2023-02-19T01:49:46+05:30
కేబుల్ టీవీ ప్రసార రంగంలో మళ్లీ కలకలం రేగింది. పే చానల్స్ యజమానులు పెంచిన ధరలు అమలు చేయటానికి కేబుల్ ఆపరేటర్లు ఒప్పుకోకపోవడంతో వివాదం ముదిరిపాకాన పడింది. ఈ నేపథ్యంలోనే ప్రసారాలు నిలిపేస్తున్నట్టు బ్రాడ్ కాస్టర్లు ప్రకటించారు.
పే చానల్స్ చార్జీలు 25 - 35 శాతం పెంపు
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఆపరేటర్లు
ప్రసారాల నిలిపివేతకు బ్రాడ్‌కాస్టర్లు సిద్ధం
రెండ్రోజులుగా టీవీల్లో ప్రకటనలు..
ఇప్పటికే కోర్టు తలుపు తట్టిన ఆపరేటర్లు
ప్రసారాలు నిలిపేసిన డీస్నీ స్టార్, జీ, సోనీ
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కేబుల్ టీవీ ప్రసార రంగంలో మళ్లీ కలకలం రేగింది. పే చానల్స్ యజమానులు పెంచిన ధరలు అమలు చేయటానికి కేబుల్ ఆపరేటర్లు ఒప్పుకోకపోవడంతో వివాదం ముదిరిపాకాన పడింది. ఈ నేపథ్యంలోనే ప్రసారాలు నిలిపేస్తున్నట్టు బ్రాడ్ కాస్టర్లు ప్రకటించారు. క్రమంగా ఒక్కో బ్రాడ్ కాస్టర్ తమ ప్రసారాలు నిలిపివేస్తున్నట్టు నేరుగా టీవీల్లోనే ప్రకటిస్తూ ఉండటంతో కలకలం మొదలైంది. దాంతో ధరలు తగ్గించటానికి ప్రయత్నిస్తున్నామని కేబుల్ ఆపరేటర్లు చందాదారులకు నచ్చజెబుతున్నారు. వాస్తవానికి 2000 సంవత్సరం జనవరి 1న పే చానల్స్ ధరల నియంత్రణకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ధరల పరిమితి ప్రకటించింది. చందాదారులను ఇరకాటంలో పెట్టి ఎక్కువ ధరలు వసూలు చేస్తున్న బ్రాడ్ కాస్టర్ల ధనదాహానికి అడ్డుకట్ట వేస్తున్నట్టు అప్పట్లో ట్రాయ్ చెప్పుకుంది. అయితే, బ్రాడ్ కాస్టర్లు కోర్టుకెళ్లి ఈ నియంత్రణను అడ్డుకోవటానికి ప్రయత్నించారు. అయితే అది పూర్తిగా సాధ్యం కాలేదు. దాంతో తెలివిగా కొత్త బొకేలు ప్రకటించి ట్రాయ్‌ని ఇరకాటంలో పెట్టి, చివరికి తమ పంతం నెగ్గించుకున్నారు. దీంతో చేేసదేం లేక ట్రాయ్ గతేడాది నవంబరు 30న బ్రాడ్ కాస్టర్లకు అనుకూలమైన టారి్‌ఫకే అంగీకారం తెలిపింది. దాంతో బ్రాడ్ కాస్టర్లు కొత్త ధరలు ప్రకటించారు.
రూ.250 నుంచి 300 పైగా..
ఇక కొత్త ధరల ప్రకారం చూస్తే... ఇప్పటిదాకా నెలకు రూ.250 కేబుల్ బిల్లు కట్టే ఇంటికి ఇక మీదట రూ.300పైగా కట్టాల్సిన పరిస్థితి రానుంది. ధర పెంచింది బ్రాడ్ కాస్టర్లే అయినా, చెల్లించేది ప్రేక్షకులే అయినా, ఈ పెరిగిన ధరల వలన చందాదారులు వెళ్లిపోతారని, వ్యాపారం దెబ్బతింటుందని ఆపరేటర్లు భయపడుతున్నారు. చందాదారులంతా డీటీహెచ్ వైపో.. ఓటీటీ వైపో మళ్లుతారని ఆందోళన చెందుతున్నారు. కేబుల్ ద్వారా పే చాన్సల్ తీసుకోవటం కంటే ఓటీటీ మెరుగ్గా ఉందనే అభిప్రాయం ఉండటం, బ్రాడ్ కాస్టర్లు కూడా కేబుల్ పట్ల పక్షపాతం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు కూడా కేబుల్ రంగాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఇప్పుడు ఈ కొత్త ధరలను అమలు చేయటం వలన పరిశ్రమ దెబ్బ తింటుందన్న భయంతో కేబుల్ ఆపరేటర్ల రంగం గట్టిగా ప్రతిఘటిస్తోంది. ఇక ట్రాయ్ నిబంధనల ప్రకారం బ్రాడ్ కాస్టర్లు తమ కొత్త ధరలతో ఎమ్మెస్వోలతో ఒప్పందాలు చేసుకోవాలి. ఆ తరువాత ఎమ్మెస్వోలు మళ్లీ తమ పరిధిలోని ఆపరేటర్లతో ఒప్పందం చేసుకోవాలి. రెండింటికీ ఒక్కో నెల వ్యవధి ఇస్తూ, ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమలు చేయాల్సి ఉంది.
కోర్టుల్లో పిటిషన్లు..
కాగా, అఖిల భారత డిజిటల్ కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య ఈ కొత్త టారిఫ్ అమలు చేయవద్దంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... ఈ కేసు విచారణలో ఉంది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులోనూ, కర్ణాటక హైకోర్టులోనూ వరుసగా పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో కొత్త టారిఫ్ ఆర్డర్ అమలును ట్రాయ్ స్వయంగా మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోపు ఎమ్మెస్వోలు ఒప్పందాలకు ముందుకు రాకపోవటంతో మరో నెలలో కూడా ఇది అమలయ్యే పరిస్థితులు కానరావడం లేదు. పిటిషన్ల మీద విచారణ వాయిదా పడుతున్నదే తప్ప ఎక్కడా స్టే రాకపోవటంతో బ్రాడ్ కాస్టర్లు ఇంకో అడుగు ముందుకేసి ఒప్పందం చేసుకోని, ఎమ్మెస్వోల పరిధిలోని టీవీల్లో చానల్స్ నిలిపేస్తున్నట్టు రెండ్రోజులుగా ప్రకటించడం మొదలుపెట్టారు. టీవీ తెరమీద ఈ ప్రకటన చూస్తున్న ప్రేక్షకులకు చాలామందికి ఈ విషయం అర్థం కాక కేబుల్ ఆపరేటర్‌ను సంప్రదిస్తున్నారు. అయితే ప్రేక్షకుల మీద భారం పెరగకుండా ఉండటానికే బ్రాడ్ కాస్టర్ల మీద వత్తిడి తెస్తున్నామని కేబుల్ ఎమ్మెస్వోలు చెబుతున్నారు. మొత్తానికి కోర్టులో తేలేదాకా ఈ వ్యవహారం కొలిక్కి వచ్చేటట్టు కనపడటం లేదు.
ప్రసారాలు నిలిపేసిన పలు చానెళ్లు
కొత్త టారిఫ్ ధరలకు అంగీకరించని ఎమ్మెస్వోలకు తమ చానెళ్ల ప్రసారాలను నిలిపేస్తున్నామని డీస్నీ స్టార్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ తెలిపాయి. దీనిపై ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్) స్పందిస్తూ.. ‘‘కొంతమంది కేబుల్ ఆపరేటర్లు తాజా ఒప్పందాలపై సంతకం చేయలేదు. అందువల్ల బ్రాడ్ కాస్టర్లు నోటీసులు అందజేసిన తర్వాత సేవలు నిలిపేయాల్సి వచ్చింది..’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు అఖిల భారత డిజిటల్ కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య స్పందిస్తూ.. కొత్త టారిఫ్‌లతో కేబుల్ వినియోగదారులపై 25నుంచి 35 శాతం వరకూ భారం పడనుందని తెలిపింది. అందుకే పెంచిన ధరలకు అంగీకరించలేదని వెల్లడించింది.
Updated Date - 2023-02-19T02:52:18+05:30 IST