అమరుల త్యాగాలు గుర్తొచ్చేలా స్మారక చిహ్నం
ABN, First Publish Date - 2023-06-21T04:10:02+05:30
తెలంగాణ సాధన కోసం అసువులు బాసిన అమరులను నిత్యం స్మరించుకుంటూ.. వారికి ప్రతిరోజు నివాళి అర్పించడంతో పాటు వారి త్యాగాల స్ఫూర్తితో ముందుకు సాగాలన్న ఉద్దేశంతో అమరుల స్మారక చిహ్నాన్ని నిర్మించాం.
జ్వలించే జ్యోతి.. అమరుల త్యాగాలే స్ఫూర్తి
ఉద్యమం పురుడుపోసుకున్న చోటే స్తూపం
3.29 ఎకరాల్లో.. 6 అంతస్తుల్లో
రూ.180 కోట్లతో చిహ్నం నిర్మాణం
రేపు సాయంత్రం 6:30 గంటలకు
స్మారక చిహ్నాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
‘ఆంధ్రజ్యోతి’తో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
(ఆంధ్రజ్యోతి, హైదరాబాద్): తెలంగాణ సాధన కోసం అసువులు బాసిన అమరులను నిత్యం స్మరించుకుంటూ.. వారికి ప్రతిరోజు నివాళి అర్పించడంతో పాటు వారి త్యాగాల స్ఫూర్తితో ముందుకు సాగాలన్న ఉద్దేశంతో అమరుల స్మారక చిహ్నాన్ని నిర్మించాం. నిర్మాణంలో కొంత ఆలస్యం జరిగినా అద్భుతమైన డిజైన్‌తో దీనిని రూపొందించాం. ఈ చిహ్నంపైనా ప్రతిపక్షాలు విమర్శలు చేసినా.. పట్టించుకోలేదు. అమరుల త్యాగాలు మదిలో మెదిలేలా.. తెలంగాణ ఉద్యమం గుర్తుకు వచ్చేలా.. నిర్మించిన ఈ స్మారక చిహ్నాన్ని ఈనెల 22న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చెబుతున్న రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
స్మారక చిహ్నం రూపం ఏంటి..? సచివాలయం ఎదురుగానే ఎందుకు నిర్మించాల్సి వచ్చింది?
రాష్ట్రం కోసం అమరులైన వారి త్యాగాలు తెలంగాణ సమాజం మదిలో నిరంతరం సజీవంగా ఉండాలి. ప్రతి రోజూ అమరులకు నివాళులు అర్పించాలి. అది జరగాలంటే వారి కోసం ఒక స్మారకం నిర్మించాలి. అలా అని ఏదో ఒక స్తూపం నిర్మిస్తే.. అక్కడికి జూన్ 2న, ఆగస్టు 15, జనవరి 26న వెళ్లి నివాళులు అర్పించి వస్తారు. అలా కాకుండా ఒక మంచి స్మారకాన్ని నిర్మించి, అక్కడే కొన్ని ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటుచేసి వచ్చిన వారంతా అమరులకు నివాళులు అర్పించే విధంగా కట్టడం నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ మేరకు స్మారక చిహ్నాన్ని డిజైన్ చేశాం. అందుకోసమే ప్రత్యేకంగా దీపం రూపాన్ని ఏర్పాటుచేసి.. అందులో నుంచి ఒక జ్యోతి కనిపించేలా రూపొందించిన డిజైన్‌ను ఫైనల్ చేశాం. జ్వలించే జ్యోతి.. అమరుల త్యాగాల స్ఫూర్తి.. దానిని చూడగానే ప్రతి ఒక్కరికీ అమరుల త్యాగాలు గుర్తొస్తాయి. ఈ నిర్మాణాన్ని ఇక్కడే నిర్మించడానికీ కారణం ఉంది. టీఆర్‌ఎస్ పార్టీ పురుడుపోసుకుంది ఇదే ప్రదేశంలో. గతంలో ఇక్కడ ‘జలదృశ్యం’ పేరుతో పార్టీ కార్యాలయం ఉండేది. అదే సమయంలో ఈ ప్రదేశం వేదికగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. వీటన్నింటికీ గుర్తుగా ఇక్కడే అమరుల చిహ్నం ఉండాలని నిర్ణయించాం. అంతేకాదు.. దీనికి ఎదురుగా ఉన్న అంబేడ్కర్ సచివాలయంలో పనిచేసే అధికారులు, మంత్రులు ఈ స్తూపాన్ని చూస్తూ.. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ పనిచేయాలనే ఉద్దేశం కూడా ఉంది.
ఎంత విస్తీర్ణంలో నిర్మించారు?
మొత్తం 3.29 ఎకరాల్లో 6 అంతస్థుల్లో (అండర్ గ్రౌండ్ 2 ఫ్లోర్‌లు, పైన నాలుగు ఫ్లోర్‌లు) స్మారక చిహ్నాన్ని నిర్మించాం. లక్షా 6వేల 993 చదరపు అడుగులతో బేస్‌మెంట్ -2, ఇంతే విస్తీర్ణంతో బేస్‌మెంట్- 1 లో పార్కింగ్ సదుపాయం ఉంది. దాదాపు 400 కార్ల వరకు పార్క్ చేసుకోవచ్చు. ఇక గ్రౌండ్ ఫ్లోర్ 28,707 చదరపు అడుగులతో ఉంటుంది. ఇందు లో ఒక ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశాం. మొ దటి అంతస్తులో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, అమరుల ఫొటోలతో పాటు ఒక థియేటర్‌ను ఏర్పాటు చేశాం. 100 మంది వరకు కూర్చునేలా ఏర్పాటు చేసిన ఈ థియేటర్‌లో ఉద్యమ ప్రస్థానం, రాష్ట్ర సాధన కోసం జరిగిన రాజకీయ ప్రక్రియతో పాటు తెలంగాణ ప్రగతిని చూసే విధంగా 25 నిమిషాల నిడివిగల ఒక వీడియోనూ రూపొందించాం. సందర్శకులు ఆ వీడియోనూ చూడొచ్చు. రెండో అంతస్తులో 600 మంది కూర్చునే విధంగా 16,964 చ.అడుగుల్లో ఒక పెద్ద హాల్ నిర్మించాం. మూడో అంతస్తును 8095 చ. అడుగుల్లో, 4వ అంతస్తును 5900 చ. అడుగుల్లో నిర్మించాం. నాలుగో అంతస్తులో ఓపెన్ రెస్టారెంట్, గ్లాస్ రూప్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశాం. మొ త్తం అమరుల స్మారక చిహ్నం నిర్మాణాన్ని 2 లక్షల 88 వేల 461 చదరపు అడుగుల్లో చేపట్టాం.
ప్రతిపక్షాలు ఆరోపణలపై..?
గతంలో ఒకసారి కాంగ్రెస్ వాళ్లు రాహుల్ గాంధీని ఇక్కడకు తీసుకొచ్చారు. ఆ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్.. స్వాతంత్య్ర పోరాటంలో అమరులైన వారి కోసం ఢిల్లీలో స్మారక చిహ్నాన్ని ఎందుకు నిర్మించలేదు? స్మారక చిహ్నాంపై విమర్శలు చేశారు కదా.. అందుకే ప్రారంభోత్సవం పూర్తయిన తరువాత రాహుల్‌గాంధీ, ఈటల రాజేందర్ తదితరులు వచ్చి ఈ కట్ట డాన్ని కలియతిరిగి చూస్తే వారికే అర్థమవుతుంది. అమరుల త్యాగాలను గౌరవించాలి. అమరుల కుటుంబాల్లోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు లక్ష రూపాయలను ప్రభుత్వం ఇచ్చి గౌరవించింది.
1200 మంది అమరులు అయితే, ప్రభుత్వం
460 మందికే సాయం చేసిందన్న ఆరోపణలపై..?
కొంతమంది మాత్రమే 1200 మంది అమరులు అని అంటున్నారు.. మేమెప్పుడూ అనలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాగానే పోలీసు రికార్డు ప్రకారం విచారణ చేసి, గ్రామాల వారీగా జాబితా తీసుకుని అమరులు ఎవరన్నదానిని తేల్చి మరీ సాయం అందించాం. ఒకవేళ ఎవరైనా తెలంగాణ కోసం అమరులయ్యారనే వివరాలు రికార్డుల ప్రకారం ఉంటే.. వారి కుటుంబాలకూ సాయం అందిస్తాం. ఆ వివరాలు తీసుకుని నా దగ్గరికి రావొచ్చు.
ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఎలా ఉంటాయి?
ఈనెల 22న సాయంత్రం 5 గంటలకు 6 వేల మందితో అంబేడ్కర్ విగ్రహాం నుంచి భారీ ర్యాలీ ఉంటుంది. సీఎం కేసీఆర్ సా.6:30కు అమరుల స్మారకం వద్దకు చేరుకుంటారు. అమరులకు పోలీస్ గన్ సెల్యూట్ చేసిన తరువాత అమరజ్యోతిని ప్రారంభిస్తారు. అనంతరం పక్కనే ఏర్పాటు చేసే సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ 10వేల మంది దీపాలతో అమరులకు నివాళులర్పిస్తారు. తరువాత సీఎం కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం 800 డ్రోన్‌లతో అమరులకు నివాళి, తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రదర్శిస్తారు.
ఎంత ఖర్చయింది? ఇలాంటి నిర్మాణాలు మరెక్కడయినా ఉన్నాయా.?
దీని నిర్మాణానికి రూ.180 కోట్లు వెచ్చించాం. పూర్తిగా స్టీల్ స్ట్రక్చర్‌తో నిర్మించాం. 1700 టన్నుల స్టీల్‌ను వినియోగించాం. ఇది పూర్తిగా ఆర్‌సీసీ రహిత నిర్మాణం. దీపం ఎత్తు 65 అడుగులు ఉంటుంది. దీనికి 100 టన్నుల స్టెయిన్ లెస్ స్టీల్‌ను వాడాం. అమరజ్యోతి ఎత్తు 85 అడుగులు ఉంటుంది. దీనికోసం హై డిఫైన్డ్ కార్బన్ స్టీల్‌ను ఉపయోగించాం. అమరజ్యోతి.. బంగారం, పసుపు రంగులో ఉంటుంది. ఈ రెండు రకాల స్టీల్‌ను జర్మనీ నుంచి తెప్పించాం. వీటిని దుబాయ్‌కు చెంది న కంపెనీ అమర్చింది. ఇలాంటి నిర్మాణాలు ఇప్పటివరకు చికాగో, దుబాయ్‌లో ఉన్నా.. అవి ఇక్కడి స్మారక చిహ్నంలా ఉపయోగించుకునే వసతులు లేవు.
నిర్మాణంలో ఎందుకు జాప్యం జరిగింది?
చిహ్నాన్ని బాగా కట్టాలనే ఉద్దేశంతో దీని తుది రూపును తయారుచేశాం. 2020లో కరోనా కారణంగా ఇతర దేశాల నుంచి రావాల్సిన మెటీరియల్ దిగుమతిలో చాలా ఆలస్యం జరిగింది. అందుకే నిర్మాణంలోనూ జాప్యం జరిగింది.
నిదానంగా అయినా పర్వాలేదు కానీ, అద్భుతంగా నిర్మించాలని సీఎం కేసీఆర్ కూడా సూచించారు.
Updated Date - 2023-06-21T05:18:54+05:30 IST