Telangana Elections : ఎన్నికల వేళ.. ఎందుకీ జగన్నాటకం!
ABN, First Publish Date - 2023-12-01T03:29:59+05:30
తెలంగాణలో మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభమవుతుందనగా.. నాగార్జున సాగర్ కేంద్రంగా జగన్నాటకం జరిగింది!
తెలంగాణ పోలింగ్‌కు కొద్ది గంటల ముందు
సాగర్ డ్యామ్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా
డ్యామ్‌పైకి ఏపీ పోలీసులు, అధికారులు
ఎస్పీఎఫ్ సిబ్బందిని కొట్టి.. గేట్లు తెరిచి దౌర్జన్యం
13వ గేటు నుంచి ఏపీదేనంటూ కంచె ఏర్పాటు
బెటాలియన్‌ను దింపిన తెలంగాణ అధికారులు
కుడి కాల్వ గేట్లు ఎత్తకుండా విద్యుత్తు నిలిపివేత
అయినా 2 వేల క్యూసెక్కుల నీరు తీసుకున్న ఏపీ
ఓటమి భయంతో బీఆర్‌ఎస్ కుట్ర: రేవంత్‌రెడ్డి
బీఆర్‌ఎస్, వైసీపీ దొంగ నాటకమిది: కిషన్‌రెడ్డి
బలవంతంగా నీటి విడుదల ఆక్షేపణీయం
2 రాష్ట్రాల పాలకుల ఎన్నికల ఎత్తుగడలా ఉంది
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆగ్రహం
నాగార్జునసాగర్/హైదరాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభమవుతుందనగా.. నాగార్జున సాగర్ కేంద్రంగా జగన్నాటకం జరిగింది! బుధవారం అర్ధరాత్రి.. ఏపీ పోలీసులు, అధికారులు సాగర్ డ్యాంపైకి చేరుకుని చేసిన దౌర్జన్యంతో హైటెన్షన్ నెలకొంది. నాగార్జునసాగర్ ప్రధాన జలాశయానికి కుడివైపు ఏపీ రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రాంతానికి బుధవారం అర్ధరాత్రి ఐదు డీసీఎం వాహనాల్లో సుమారు 1500మంది ఏపీ పోలీసులు చేరుకున్నారు. తలుపు తెరవాలంటూ జలాశయం ప్రధాన ద్వారం వద్ద కాపలాగా ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ సమయంలో గేటు ఎందుకు తీయాలని వారు ప్రశ్నించగా.. ‘తీస్తారా.. తీయరా?’ అని గేటును లాగుతూ పెద్ద శబ్దం చేస్తూ గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా.. ఏపీ వైపున ఉన్న లాంచీ స్టేషన్ నుంచి కొందరు పోలీసు అధికారులు కుడి ఎర్త్ డ్యాం పైకి చేరుకుని బలవంతంగా గేట్లను తెరిచారు. అడ్డుకోబోయిన ఎస్పీఎఫ్ సిబ్బందిపై దౌర్జన్యం చేసి సెల్‌ఫోన్లు లాక్కున్నారు. ఒకరిద్దరిపై చేయి కూడా చేసుకున్నట్లు సమాచారం. పోలీసులతోపాటు ఏపీ నీటి పారుదల శాఖ ఎస్‌ఈ, ఇతర సిబ్బంది కూడా వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదలను చేసుకుంటామంటూ ఎస్పీఎఫ్ సిబ్బందితో గొడవకు దిగారు. అందుకు తమకు తెలంగాణ వైపు నుంచి నీటి పారుదల శాఖ ఉన్నతాఽధికారుల ఆదేశాలు లేవని ఎస్పీఎఫ్ సిబ్బంది సమాధానమిచ్చారు. అయినప్పటికీ ఏపీ పోలీసులు, అధికారులు ఆగకుండా ప్రధాన డ్యాంపైకి చొచ్చుకుని వచ్చి మొత్తం 26 గేట్లలో 13వ నెంబరు గేటు నుంచి ఏపీ రాష్ట్రానికి చెందుతుందని చెబుతూ.. ఆ ప్రాంతం వద్ద ముళ్ల కంచె వేసి బారికేడ్లను అడ్డుగా పెట్టారు. ఎన్నెస్పీ ఉద్యోగులను కూడా ప్రధాన డ్యాంపైకి రానివ్వలేదు. తెలంగాణలో ఎన్నికలు ఉండటంతో అక్కడ కేవలం ఎస్పీఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు మాత్రమే ఆ సమయానికి అందుబాటులో ఉన్నారు. వారు ఏపీ పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించి, కుడి కాల్వకు నీటిని విడుదల చేయకుండా అడ్డుకున్నారు. గురువారం ఉదయం తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు.. కుడి కాల్వకు సంబంధించిన గేట్లను ఎత్తకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అలాగే, 12వ బెటాలియన్ నుంచి 400 మందిని ప్రధాన డ్యామ్‌పై దించి పహారా కాస్తున్నారు. ఏపీ వైపు నుంచి ఆ ప్రాంత పోలీసులు 1500 మంది.. 13వ గేటుకు అవతల బందోబస్తుగా ఉన్నారు.
అయినా నీటి విడుదల..
గేట్లు ఎత్తకుండా తెలంగాణ అధికారులు విద్యుత్‌ను నిలిపివేయడంతో.. గురువారం మధ్యాహ్నం ఏపీ అధికారులు తమ పరిధిలోని కుడికాల్వ పవర్‌హౌస్ నుంచి విద్యుత్ సరఫరా చేశారు. డ్యామ్ నిర్వాహకులు కుడికాల్వ గేటు తాళాలు ఇవ్వకపోవడంతో ఐదో నంబరు గేటును పగలగొట్టి.. 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకున్నారు. గంటకు 1000 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదలను పెంచుతూ రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున పది రోజుల్లో 5 టీఎంసీల నీటిని కుడి కాల్వకు విడుదల చేయనున్నట్లు ఏపీ నీటి పారుదల శాఖ ఈఈ శ్రీహరి తెలిపారు.
తీవ్ర విమర్శలు..
సీఎం కేసీఆర్ ఓటమి భయంతోనే సాగర్ డ్యాంపై ఏపీవైపు ఉద్రిక్తత సృష్టించి, తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకొని, ఓట్లు దండుకోవడం కోసం ప్రయత్నించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మండిపడుతున్నారు. ఓటమిభయంతోనే బీఆర్‌ఎస్ పార్టీ ఇలా పోలింగ్ రోజు కుట్రలకు పాల్పడిందని.. ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం వచ్చాక.. ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక.. ఎన్నికల వేళ బీఆర్‌ఎస్, వైసీపీ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడిన దొంగనాటకంలో భాగమే ఈ ఘటన అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. జరిగిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రభుత్వ దుందుడుకు వైఖరిని ఆయన ఖండించారు. ఇక ఈ ఘటన.. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కేసీఆర్, జగన్, బీజేపీ కలిసి ఆడిన నాటకంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. మరోవైపు.. ఓడిపోతున్నామని తెలిసినందునే సీఎం కేసీఆర్ ఎన్నికల రోజే నాగార్జున సాగర్ నీటి గొడవను తెరపైకి తీసుకువచ్చి రాజకీయం చేస్తున్నారని బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు.
కేంద్రానికి కృష్ణాబోర్డు నివేదిక
అర్ధరాత్రి వేళ జరిగిన ఈ హైడ్రామాతో తెలుగు రా ష్ట్రాల ప్రజలే కాక, కేఆర్‌ఎంబీ కూడా ఉలిక్కిపడింది. డ్యామ్ వద్ద పరిస్థితులపై శుక్రవారం కేంద్ర జలశక్తి శా ఖకు నివేదిక అందించాలని యోచిస్తోంది.
అర్ధరాత్రి నీటి విడుదల ఆక్షేపణీయం
తెలంగాణలో ఎన్నికలకు కొన్ని గంటల ముందు.. ఏపీ పోలీసులు, అధికారులు నాగార్జున సాగర్ డ్యాంపైకి అర్ధరాత్రి సమయంలో చొచ్చుకొచ్చి.. నీటిని విడుదల చేసుకోవడం అక్రమం, ఆక్షేపణీయం అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ధ్వజమెత్తారు. బోర్డులో చర్చించకుండా ఏపీ పోలీసులు మూకుమ్మడిగా అర్ధరాత్రి డ్యాం వద్దకు చేరుకుని సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం, బారి కేడ్లు ఏర్పాటు చేయడం, నీటిని విడుదల చేసుకోవడం దుర్మార్గమని, ఈ దౌర్జన్యాన్ని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తోందని.. గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ ప్రభుత్వం, కృష్ణాబోర్డు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ ఈ చర్యకు పాల్పడటం ఉభయ రాష్ట్రాల పాలకుల ఎత్తుగడగా ఉందని రైతు సంఘం అభిప్రాయ పడింది.
కేసీఆర్ ఆరా.. నేడు సాగర్‌కు స్మితాసబర్వాల్
నాగార్జునసాగర్ డ్యామ్‌పై ఏపీ పోలీసుల దాడి.. బలవంతంగా నీటి విడుదల తదితర పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. సాగర్ కుడికాలువ గేట్లను ఎత్తడానికి అవసరమైన విద్యుత్ సరఫరాను తెలంగాణ ప్రభుత్వం నెల రోజుల కిందటే తొలగించగా.. ఏపీ ప్రభుత్వం నెల రోజుల క్రితం ప్రత్యేకంగా లైను వేసిందని అధికారులు సీఎంకు నివేదించారు. సాగర్‌లో రాకపోకల నియంత్రణకు సంబంధించిన గేట్లను ఏపీ పోలీసులు ధ్వంసం చేశారని, డ్యామ్ దిగువన ఉన్న వాక్‌వే వంతెనను కూడా వారు స్వాధీనం చేసుకున్నారని నివే దించారు. దీంతో వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి వీలుగా నాగార్జునసాగర్‌ను సందర్శించాలని నీటిపారుదల శాఖ, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ను ఆదేశించారు. శుక్రవారం ఆమె సాగర్‌ను సందర్శించనున్నారు. మరోవైపు.. ఏపీ ఆక్రమణపై తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) చైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్) సి.మురళీధర్ గురువారం వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. డ్యామ్‌పై సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ గేట్లను ధ్వంసం చేశారని.. వాటర్ రిలీజ్ ఆర్డర్ లేకున్నా అక్రమంగా నీటిని తరలిస్తున్నారని అందులో పేర్కొన్నారు. సీసీ కెమెరాలను, ఆటోమేటిక్ గేట్లను తక్షణం పునరుద్ధరించాలని.. ఏపీ యంత్రాంగం సాగర్ డ్యామ్‌ను ఖాళీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం కృష్ణాబోర్డు చైర్మన్‌ను కలిసి, సమస్యను నివేదించనున్నారు.
ఏపీకి కోరినన్నీ నీళ్లు.. అయినా..
ఈ సీజన్‌లో కృష్ణా బేసిన్‌కు వరద లేకపోవడం, జలాశయాలన్నీ నిండకపోవడంతో.. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి తాగునీటి అవసరాలకే నీళ్లు వినియోగించుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అక్టోబరు 4న జరిగిన ఈ సమావేశంలో.. ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అందులో 30 టీఎంసీలు శ్రీశైలం నుంచి, 15 టీఎంసీలు నాగార్జునసాగర్ నుంచి కేటాయించాలని ఏపీ కోరగా.. అడిగినన్నీ నీళ్లు ఇచ్చేందుకు కృష్ణా బోర్డు మెంబర్, కమిటీ కన్వీనర్ డీఎం రాయిపూరే, ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకుంది. 2024 మే దాకా ఈ నీళ్లు వాడుకోవడానికి ఇరు రాష్ట్రాలూ నాడు అంగీకారించాయి. ఈ జల సంవత్సరంలో తాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి కేటాయించిన 15 టీఎంసీల్లో 5.2 టీఎంసీలను నవంబరు 29 దాకా ఏపీ తరలించింది.
Updated Date - 2023-12-01T08:45:56+05:30 IST